అమ్మకి కానుక

మా అమ్మ మంచితనం గురించి ఏం చెప్పను? అమ్మంత మంచిది అమ్మ. పేరు సత్య వాణి . ఆవిడ ఎక్కువ చదువుకోలేదు. .కానీ ఆవిడకున్న తెలివి తేటలు సమర్ధత ఇంతా అంతా కాదు. ఆ తరం లో ఏంతో మంది మధ్య తరగతి ఇల్లాళ్ళ లాగా మా అమ్మ కూడా మాలతి చందూర్ గారికి వీరాభిమాని. పొద్దున్న లేచి మాలతీ చందూర్ ని తలచుకోకుండా వుండేది కాదు. ప్రతి విషయంలోను మాలతి గారు అలా చెప్పారు. మాలతి గారు ఇలా చెప్పారు అనుకుంటూ ఆవిడ చెప్పిన సలహాలు తూచా తప్పకుండా పాటించేది అమ్మ. ఆ రోజుల్లో మాలతి చందూర్ గారి పేరు మాఇంట్లో వాసాలకు పెండేలకు పట్టిపోయింది.

కాలం గడిచింది .నేను కలం పట్టి రచయిత్రిని అయ్యాను. మా శ్రీవారి ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్లాం .  కాస్త ఇల్లూ వాకిలీ  సర్దుకుని  టెలిఫోనే డైరెక్టరీ నంబర్ వెతికి మాలతి చందూర్ గారికి ఫోన్ చేసాను. అప్పుడు ఆవిడ ఇంట్లో లేరు..ఆవిడ క్లర్క్ నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరునాడు మాలతి గారిదగ్గర్నించి ఫోన్ . మొదటి సారి మాట్లాడినా ఎన్నో ఏళ్ళనించీ పరిచయం వున్నట్లు అప్యాయంగా మాట్లాడటం  మాలతి గారి ప్రత్యెకత. ఆ రోజే అమ్మకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాను. బొలెడంత  సంబర పడిపోయింది అమ్మ. ఆతరువాత మాలతి గారిని చాలాసార్లు కలుసుకున్నాను.

ఆ రోజుల్లోనే అమ్మ చెన్నై వచ్చింది. అప్పటికి నాన్నగారు వెళ్ళిపోయారు. మరికొద్ది రోజుల్లో అమ్మ70 వ పుట్టిన రోజు వస్తోంది. అమ్మా  నీకు ఏం కొనను?ఏం కావాలి? అని అడిగాను, నాకేం వద్దు నీకు వీలయితే  నన్ను  మాలతీ చందూర్ గారి దగ్గరకి తీసుకువెళ్ళు అని అడిగింది. మాలతి గారికి ముందుగా చెప్పి మా వెహికిలూ డ్రైవర్ వగైరా జంజాటాలు పెట్టుకోకుండా అమ్మ నేను ఆటోలో వెళ్లాం.

తన 70 వ ఏట తన అభిమాన రచయిత్రిని కళ్ళారా చూసుకుంది అమ్మ. అప్పుడు ఆవిడ కు కలిగిన ఆనందం వర్ణనాతీతం .  నాన్నగారు పోయాక  అంత కాలానికి మళ్ళీ  అమ్మ మొహం లో వెలుగు కనిపించింది. పరిచయం చేయటంతో నా పని ముగిసింది. ఇక వాళ్ళిద్దరూ  ఎక్కడికో వెల్లిపొయారు. ఎప్పటెప్పటి  సంగతులో గుర్తు చేసుకున్నారు . రెండు గంటలు రెండు క్షణాల్లా గడిచిపోయాయి. ఆటో ఎక్కగానే అమ్మ నా చెయ్యి పట్టుకుంది ..  నాకెంతో ఆనందం గా వుంది మాలతి గారిని చూస్తానని కల్లో కూడా అనుకోలేదు . ఇవ్వాల్టికి నా కోరిక తీరింది ,అదికూడా ఏ funtion  లోనో కలిసి  హడావిడిగా  రావటం కాదు . సావకాశం గా మాట్లాడాను అని మురిసి పోయింది.

ఆ మర్నాడు కొరియర్  లో హృదయ నేత్రి  పుస్తకం పంపించారు  మాలతి చందూర్ గారు.  అది అందుకుని  లాటరీ  వచ్చినంత సరదా పడింది అమ్మ. ఆ తరువాత  నాలుగేళ్ళకు అమ్మకి కాన్సర్  వచ్చింది. ఎక్కువ బాధ పడకుండానే  వెళ్లి పొయింది. పోతానని తెలిసిపోయింది అమ్మకు. తన కళ్ళు దానం చెయ్యమని చెప్పింది చెశాం. ఇద్దరికి చూపు వచ్చిందిట. అమ్మకి ప్రకృతి  అంటే ఇష్టం . గుళ్ళు గోపురాలు చూడటం ఇష్టం .. నేను ఎక్కడికైనాటూర్  వెళ్లి రాగానే అక్కడి వివరాలు అడిగి తెలుసుకునేది .నువ్వు చెప్తే నేను స్వయంగా చూసి నట్లు ఉంటుందమ్మా  అనేది ' పోయేముందు నేను వెళ్ళిపోతున్నా  .ఎక్కడికి వెళ్ళినా ఆ అందాలన్నీ నా కళ్ళతో చూడు  అని నాకో బాధ్యత అప్పగించింది అమ్మ కళ్ళు ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఎక్కడ ఏ అందమైన దృశ్యం చూసినా  అమ్మను తల్చుకుని ఆమె కళ్ళతో మరోమారు చూస్తాను.  మరి కూతురిగా నా బాద్యత నిర్వర్తించాలిగా !

.......పొత్తూరి విజయ లక్ష్మి.