బుజ్జి పాపాయి బాడీ లాంగ్వేజ్ అప్పుడే పుట్టిన పాపాయిని చేతుల్లోకి తీసుకోగానే... అప్పటి వరకు ఎన్నెన్నో పాత్రలని సమర్థవంతంగా పోషించి, అందరినీ మెప్పించిన అమ్మాయి కూడా బేలగా మారిపోతుంది. ఆ పసిప్రాణాన్ని ఎలా ఎత్తుకోవాలి, పాలు ఎలా త్రాగించాలి, బొజ్జ నిండిందా, లేదా? ఎలా తెలుసుకోవటం? మళ్ళీ ఆకలి వేస్తే ఎలా తెలుసుకోవాలి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అప్పటికీ ఇప్పుడు చాలాచోట్ల కాబోయే అమ్మ - నాన్నలకి క్లాసులు చెబుతున్నారు, డైపర్ కట్టడం నుంచి, పసిపిల్లలకి ఎలా స్నానం చేయించాలనే వరకు చెబుతున్నారు. అయినా సరే చాలామందిలో ఎన్నెన్నో సందేహాలు ఉంటూనే ఉన్నాయని అని అంటున్నారు డా. అనుపమ. డాక్టర్ అనుపమ పసిపిల్లల వైద్యురాలు. తల్లి కాబోయే ప్రతీ స్త్రీ అడిగే ప్రశ్నలు ఇంచుమించు ఒకేలాగే ఉంటాయని చెబుతున్నారు. అలా ఆమెకు తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకి - సమాధానాలు ఈవిధంగా చెప్పారు. 1) పసిపిల్ల బొజ్జనిండా పాలు సరిపోయాయో లేదో అని బాధపడనక్కరలేద్దు. బొజ్జ నిండకపోతే తనే ఏడుస్తుంది. బొజ్జనిండితే హాయిగా నిద్రపోతుంది. 2) పిల్లలు గుక్కలు పెట్టి ఏడుస్తుంటే ....రెండు చేతులతో పిల్లల చెవులు గట్టిగా మూస్తే - గుక్క తిప్పుకుంటారు. అప్పుడు వాళ్ళని బయట చల్లటి గాలిలో తిప్పితే ఏడుపు ఆపుతారు. 3) పిల్లలకి పడుకుని పాలు ఇవ్వకూడదు, పట్టకూడదు. కూర్చుని పాలు ఇచ్చి, ఇచ్చిన తరువాత భుజంపై వేసుకొని తేనుపు వచ్చాక పడుకోబెట్టాలి. ఈవిధంగా చెయ్యకపోతే పిల్లలు తాగిన పాలు కక్కే ఇబ్బంది ఉంది. 4) డైపర్ మార్చినప్పుడు శుభ్రంగా కడిగి, పొడిబట్టతో తుడిచి గాలికి ఆరనిచ్చి, పౌడర్ రాసి, అప్పుడు డైపర్ కట్టాలి. ఈవిధంగా చేస్తే, పిల్లలకి ఒరుపులు ఉండవు. పిల్లలని ఎంత శుభ్రంగా చూస్తే, అంత ఆరోగ్యంగా ఉంటారు. -రమ
పిల్లలను చురుగ్గా ఉంచే ఆహారం.. పాలు: మెదడుకు మరియు శరీరం కోసం శక్తిని అందించడానికి పాల ఉత్పత్తులు ప్రోటీన్ మరియు కాల్షియం బాగా సహాయపడుతాయి. పిల్లల్లో బ్రెయిన్ టిష్యుష్ అభివృద్ధికి మరియు పిల్లల్లో బలమైన ఎముకల పెరుగుదలకు మరియు బలమైన దంతాలను పొందడానికి పాలు బాగా సహాపడుతాయి. గుడ్లు: గుడ్లు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మరియు వీటిలో సహజంగా కాల్షియం శరీరం గ్రహించడానికి సహాయపడే విటమిన్ డి ఇందులో ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పిల్లలకు ఒక గ్లాసు పాలతో పాటు గుడ్డును అంధించడం వల్ల వారు సంతృప్తికరంగా అనుభూతిని కలిగి ఉండటమే కాదు ఎక్కువ సమయంలో కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది ఈ పోషకాంశం. పండ్లు: వివిధ రకాల పండ్లలో ఏ పండైనా సరే పిల్లలకు ఆరోగ్యకరమే. పిల్లలు పండ్లు తినడం వల్ల పిల్లలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరలల్స్ పుష్కలంగా అందుతాయి. మరియు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరియు ఇవి పిల్లలను చురుకుగా ఉంచుతుంది. మరి పుష్కలమైన న్యూట్రీషియన్స్ పొందడానికి అన్ని రకాల పండ్లను పిల్లలచేత తినిపించండి. ఓట్ మీల్: కొన్ని పరిశోధనల ప్రకారం ఓట్ మీల్ తిన్న పిల్లలు పాఠశాలలో మంచి ఏకాగ్రతను పొందుతున్నారు. అదేవింధంగా అన్నింట్లోను దృష్టి సారిస్తున్నారు. అని కనుగొన్నారు. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు అంటే ఓట్ మీల్, ఇవి చాలా తేలికగా మరియు నిదానంగా జీర్ణం అవుతాయి. దాంతో పిల్లల్లో ఎక్కువ సమయం శక్తి స్థిరంగా ఉండటానికి ఈ ఆహారాలు సహాయపడుతాయి. . పెరుగు: బలమైన ఎముకలు మరియు దంతాలను రూపొందించడానికి పెరుగులోని క్యాల్షియం, ఇతర పోషకాంశాలు బాగా సహాపడుతాయి. అంతే కాదు, పెరుగు తేలికగా జీర్ణం అవ్వడానికి మరియు పేగులో చెడు బ్యాక్టీరియాను నివారించడానికి ఇవి బాగా సహాపడుతాయి. కాబట్టి లోఫ్యాట్ పెరుగును తీసుకొని, వారికి ఇష్టమైన పండును చేర్చి అంధించండి. ఆకుకూర: ఐరన్, క్యాల్షియం, మరియు ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ ఎ అండ్ సి పోషకాంశాలను కలిగిన ఒక అద్భుతమైన ఆహారం ఆకుకూరలు. ఆకుకూరలు పెద్దలకు మాత్రమే కాదు పిల్లల బ్రెయిన్ మరియు బోన్ పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. తృణధాన్యాలు: తృణధాన్యాలను బ్రెడ్ మరియు ఇతర చిరుధాన్యాలలో చూడవచ్చు. పిల్లలు సాధారణంగా ఇటువంటి ఆహారాలను బాగా ఎంజాయ్ చేస్తారు. వీటిలో ఫోలిక్ ఆమ్లం, ఇనుము, జింక్ మరియు B విటమిన్లు మరియు అలాగే కొన్ని విటమిన్ డి మరియు కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. పిల్లలకు ఇటువంటి ఆహారాలను(తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాలను) ముఖ్యంగా బ్రెడ్ మరియు పాస్తా వంటివి ఇవ్వడాన్ని మొదలు పెట్టండి. నట్స్: పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మరియు అభివృద్ధి కోసం, అలాగే గుండె ఆరోగ్యానికి అవసరం అయ్యే మంచి ఫ్యాట్స్(కొవ్వు) ను కలిగి ఉంటాయి. పిల్లలకు రోజూ ఉదయం చిన్న మొత్తంలో ఇటువంటి కొవ్వు పదార్థాలను అంధించడం వల్ల వారికి తగినంత శక్తిని పొందుటకు వారు పెరుగుదలకు అన్నివిధాల బాగా సహాయడుతాయి.
పెద్దలకు ఇది పెద్దబాలశిక్ష.. పిల్లల్ని ‘పిల్లలు’ అంటూ తేలిగ్గా తీసుకోవడానికి లేదు. రెండేళ్ళ సిసింద్రీ నుంచి ఇష్టాలు, అయిష్టాలు, కోపం, విసుగు అన్నీ ప్రదర్శిస్తూ వుంటారు. మన స్పందన బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతూ వుంటుంది. చాలాసార్లు మీరు గమనించే వుంటారు.. మూడు నాలుగేళ్ళ పిల్లలు ఏదన్నా కావాలంటే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టు అడుగుతారు. మనకి కోపం వచ్చేస్తుంది అది చూసి. వేలెడంత లేవు - ఏదన్నా కావాలంటే నెమ్మదిగా అడగకూడదా.. నామీదే అరుస్తావా అంటూ పిల్లాడిని కోప్పడతాం.కానీ నిజానికి ‘మాన్యుపులేషన్’ ఇంకా అలవాటు కాని వయసది. నెమ్మదిగా బతిమాలితేనే బావుంటుందని వాళ్ళింకా నేర్చుకోని అమాయకత్వం మరి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని అనుకరించడమే కరెక్టు అనుకునే సందర్భమది. మనం పిల్లలకి ఏదన్నా చెప్పాలంటే గొంతు పెంచి అరిచేకదా చెబుతాం. వాళ్ళూ అదే చేస్తున్నారు. కానీ, దానికి మనకి కోపం వస్తుంది. అయితే ఇక్కడే మని వాళ్ళని పెద్ద కన్ఫ్యూజన్లో పడేస్తాం. అమ్మ అరిస్తే తప్పులేదుగానీ, నేను అరిస్తే తప్పేంటి? అలాగే కదా చెప్పాలి? అని ఆ పసిపాపల మనసులు ఆలోచనలో పడిపోతాయి. పెద్దల్లాగే పిల్లలూనూ: ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే వారిని పెంచడానికి మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ వుండాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు సాధారణంగా పిల్లల ప్రవర్తనను అంచనా వేసే విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు, చేసుకోవాల్సిన సర్దుబాట్లు కొన్ని ఉన్నాయంటూ పిల్లల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘‘వాటికి మొండితనం చాలా ఎక్కువ’’ అంటూ మనం పిల్లల్ని పదేపదే అంటుంటాం కదా, ఆ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా? కొంతమంది పిల్లలు ప్రతీ పనిని చాలా చక్కగా చేయాలని తాపత్రయపడతారు. ఎక్కడా రాజీపడరు. అలాగే వాళ్ళ పనులన్నీ కూడా మనం అలా పద్ధతిగా చేయాలని ఆశిస్తారు. దాంతో మొండిగా ప్రవర్తిస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించండి: మనం పిల్లల్ని నిందించే ముందు వారిలో వున్న ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించాలి. దానిని సరైన దారిలోకి మళ్ళించాలి. ‘‘రాజీలేని మనస్తత్వం’’ ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కావల్సిందల్లా పట్టు విడుపులు నేర్చుకోవడమే. పిల్లలకు ఆ విషయంపై క్లాసు తీసుకుంటే వాళ్ళకేం అర్థం కాదు. అలాకాక ప్రాక్టికల్‌గా ఆ మనస్తత్వాన్ని వాళ్ళకి వాళ్ళే ఎలా గుర్తించాలో, మనసుని ఎలా మలచుకోవాలో నేర్పించాలి. ఉదాహరణకి స్కూలులో ఇచ్చిన ఏదో ప్రాజెక్టు పనిని ఎంత చేసినా సరిగా రాలేదంటూ పిల్లలు విసుగు పడుతుంటే లేదా మిమ్మల్ని విసుగెత్తిస్తుంటే తేలిగ్గా తీసుకుని కొట్టిపారేయకూడదు. సమస్యపై పనిచేయడం నేర్పాలి: పిల్లల దగ్గరకి వెళ్ళి కూర్చుని ఇది కొంచెం కష్టమే కానీ, నువ్వు చేయగలవు - ఎటొచ్చీ నువ్వు కాస్త టెన్షన్ పడకుండా చేయాలి. ఓ అరగంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టావనుకో చురుగ్గా చేయగలవు.... ఇలా చెప్పి చూడండి. అలాగే, పిల్లలు ఏదన్నా కావాలని మొండిపట్టు పడితే ‘‘నేను ఇవ్వను’’ అని కచ్చితంగా చెప్పకుండా ‘‘తప్పకుండా ఇస్తాను. కానీ ఇప్పుడు కాదు.. అది ఎందుకు అవసరం... ఇప్పుడే ఎందుకు కావాలి... ఆలోచించి నాకు చెప్పు’’ అనాలిట. ఇలా చేయడం వలన సమస్యపై పనిచేయడం నేర్చుకుంటారుట పిల్లలు. అంటే, రాజీలేని మనస్తత్వం మంచిది కాదు - అది మొండితనమని మనం విమర్శించటం లేదు - కానీ అలా రాజీ పడలేనప్పుడు దానిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తున్నాం. అలాగే తన ప్రవర్తనకి కారణాన్ని తానే ఆలోచించుకునేలా చేస్తున్నాం. మనవంతు సహకారం చాలా ముఖ్యం: పిల్లలు ఎదుగుతూ, చుట్టూ పరిశీలిస్తూ తమ అనుభవాలని సమీక్షించుకుంటూ ఎన్నో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఆ ప్రయత్నానికి మన వంతు సహకారం అందిస్తే చక్కటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అలాకాక పిల్లల ప్రతి చర్యనీ విమర్శిస్తూ, అతిగా స్పందిస్తూ, వారిని నిందిస్తూ వుంటే అది క్రమశిక్షణ అని మనం అనుకున్నా, అది పిల్లల సహజ నైజాన్ని, వ్యక్తిత్వాన్ని చిదిమేయడమే అవుతుంది. అందుకే వారిని విమర్శించేముందు, ఎలా సరిచేయొచ్చో ఆలోచించమంటున్నారు నిపుణులు. -రమ
పసిపిల్లలు ఏడవకుండా మనం తీసుకోవలసిన చిన్న చిన్న జాగ్రత్తలు పిల్లలు తమ బాధలు ఏడవటం ద్వారానే మనకి తెలియజేస్తారు పిల్లలు ఏడ్వటానికి కొన్ని కారణాలు: ఆకలిగా ఉండటం, భయపడటం, దాహం వేయడం, డయపర్ తడి కావడం వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండటం, పెద్ద పెద్ద శబ్దాలు కావడం కాంతి ఎక్కువ కావడం, పొగలు కమ్ముకోవడం, తీవ్రమైన నొప్పి ఉండటం, పళ్ళు రావడం, ఇన్ఫెక్షన్లు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) జ్వరం, జలుబు, చెవినొప్పి మెదడువాపు జ్వరం గుండె సమస్యలు జాగ్రత్తలు : * పిల్లల్లో వింత శబ్ధాలు ఏమైనా వస్తున్నాయోమో చూడండి. అంటే శ్వాస సరిగా తీసుకోలేక ముక్కులో, గొంతులోంచి ఎటువంటి శబ్దం వినిపించినా... అజీర్ణం వల్ల వచ్చే యూట్రస్ శబ్ధం. * నిద్రపుచ్చడానికి వీలైనంత వరకు చుట్టూ పక్కల శబ్ధంలేకుండా జాగ్రత్తపడాలి. పిల్లలు నిద్రించే టైంలో వాషింగ్ మెషిన్లు, టీవీలు, మిక్సీలు ఆన్ చేయకపోవడమే ఉత్తమం. * పిల్లలను ఎత్తుకోవడం ,లేదా వాళ్లని పొట్టమీద పడుకోబెట్టడం, తేన్పు వచ్చేలా చేయడం తో ఏడుపు మాన్పించొచ్చు. * బేబీ ఆయిల్ లేదా క్రీమ్స్ తో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రిలాక్స్ అవుతుంది. * గోరువెచ్చని నీటితో రోజులో ఒకటికి రెండు సార్లు స్నానం చేయించాలి. * కొన్ని సందర్భాల్లో అప్పుడే పాలు పట్టినా కూడా ఏడవడం మాత్రం మానరు అటువంటప్పుడు వాటిర నోటికి శుభ్రపరిచిన ఖాలీ బాటిల్ సక్కింగ్ కోసం ఇవ్వాలి. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినా కూడా మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
చిన్న పిల్లలకు ఏర్పడే ప్రమాదాలు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెద్దలు, పిల్లలను ఓ కంటకనిపెడుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్నారులకు అపాయాన్ని గురించి ఆలోచించే వయస్సుండదు. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఏర్పడితే, మరికొన్నింటిని ప్రమాదమేమో అని తెలియకుండా కొని తెచ్చుకునేవి కొన్ని. పిల్లలకు ప్రమాదం కలిగితే పెద్దలు అతిగాభరా పడుతూ పిల్లల్లో భయాన్ని కలిగించకుండా, వెంటనే ప్రథమచికిత్స పద్ధతులను పాటించాలి. ఆ తర్వాత పిల్లల వైద్యునికి చూపించి, అవసమయితే చికిత్సచేయించాలి. మందులు వాడాలి. అందువల్ల, ఏ ప్రమాదానికి ఏవిధమైన ప్రథమ చికిత్స జరపవలసినదీ పెద్దలకు సరైన అవగాహన ఉండాలి * జారిపడితే : పిల్లలు నేలమీద, మెట్లమీద నుంచి ఎత్తుగా ఉండే అరుగుల మీద నుండి జారిపడి దెబ్బలు తగుల్చుకోవచ్చు. దెబ్బ తగిలిన నొప్పికంటే, భయంతో పిల్లలు ఏడ్చేస్తారు. పిల్లల ఏడుపునకు కంగారు పడకూడదు. పిల్లలను భయపడవద్దని బుజ్జగిస్తూ, ఏం జరిగిందో, ఎక్కడ ఏవిధంగా పడిందీ, దెబ్బ ఎక్కడ తగిలిందీ తెలుసుకోవాలి. చర్మం చీరుకుపోయి రక్తం వస్తుంటే డెట్టాల్ నీటితో చర్మాన్ని శుభ్రంగా కడిగి, టించర్‌ను దూదితో అద్దాలి. రక్తం ఆగకుండా వస్తుంటే, తడిబట్టతో కొంతసేపు నొక్కి ఉంచాలి. ఆ తర్వాత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి వైద్య సలహా ప్రకారంగా కట్టుకట్టించడమో, మందులు ఇవ్వడమో చేయాలి. * కాలినప్పుడు : చిన్నారులను వేడి వస్తువుల దగ్గరకు రానీయకుండా, వంటింట్లో పరుగులు తీయకుండా చూసుకుంటుండాలి. వేడి నీళ్ళతో ఆడాలని చేయి పెట్టినా చేతులు కాలి, లేత చర్మానికి బొబ్బలొస్తాయి.. వెంటనే పిల్లల చేతులు మీద ధారగా చన్నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చల్లని నీళ్ళతో తడిపిన బట్టను చర్మం మీద ఉంచి, వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలకు అందనంత ఎత్తులో వేడి కుక్కర్‌ను, వేడి పాత్రలను, బాణలిలాంటి వాటిని ఉంచాలి. డైనింగ్ టేబుల్ మీద, టేబుల్ క్లాత్‌కు క్రిందకు వేలాడుతున్నట్లుగా వేయకూడదు. చిన్నపిల్లలున్న ఇంట్లో, ఆ టేబుల్ క్లాత్‌ను పిల్లలు లాగి, టేబుల్ మీద ఉం చిన పాత్రలను, వేడి పదార్థాలను మీద వేసుకునే ప్రమాదం ఉంటుంది. వారి చర్మం కాలే ప్రమాదముంటుంది. పిల్లలకు చర్మంకాలినప్పుడు చర్మం మీద చల్లటి నీటిని ధారగాపోయడమే సరైన పద్ధతి. తేనె పూయడం లాంటివి చేయకూడదు. డాక్టర్‌కు చూపించాలి. వెంటనే, బొబ్బలను చిదపకూడదు. చర్మాన్ని రబ్‌చేయకూడదు. * కోసుకుంటే : పెద్దల నిర్లక్ష్యం, అశ్రద్ధ, మతిమరుపు వల్ల కూడా చిన్నారులకు పదునైన వస్తువులు కోసుకునే ప్రమాదం వుంది. కూరలు తరిగే కత్తిపీట, చాకు, కత్తెర, బ్లేడు లాంటి పరికరాలను వాడిన తర్వాత, వాటిని పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా ఉంచాలి పిల్లలు ఆడే ఆట వస్తువుల వల్ల కూడా వారికి చర్మం కోసుకుని లోతుగా దిగే ప్రమాదం ఏర్పడ వచ్చు. పదునుగా వుండే ఆట వస్తు వులు, రేకు లున్న ఇనుప బొమ్మలు, మేకులు, స్క్రూలు లాంటివి ఉన్న బొమ్మలు పిల్లలకు ఆటవస్తువులుగా కొనకూడదు. ఇవ్వకూడదు. గాజు సీసాలు, గాజుపాత్రలు పిల్లలకు అందనంత ఎత్తులో ఉంచాలి. పొరపాటుగా పిల్లలు కోసుకుని నెత్తురు కారుతుంటే, చల్లటి నీటితో తడిపిన బట్టను చుట్టాలి. లేదా ఐస్ ముక్కలను బట్టలో ఉంచి రక్తం కారుతున్న ప్రదేశంలో ఒత్తిపెట్టి ఉంచితే రక్తం కారటం ఆగిపోతుంది. లోతుగా కోసుకుంటే! ఆ భాగాన్ని ఎత్తుగా వుంచి, చల్లటినీటితో తడిసిన బట్టను ఉంచాలి. రక్తస్రావం ఆగిపోయిన తర్వాత, పరిశుభ్రమైన బట్టతో తెగిన ప్రదేశంలో చర్మాన్ని కప్పి, ఒదులుగా చుట్టి, ఆ తర్వాత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి చూపించి, వైద్య సలహా తీసుకోవాలి. అవసరమైన చికిత్సను చేయించాలి. * కీటకాలు కుడితే : కొన్ని రకాల కీటకాలలో కొంత విషపదార్థం ఉంటుంది. అటువంటి విషకీటకాలు కుడితే పిల్లలకు ఎలర్జీ కలిగి, ఆ తర్వాత కుట్టిన చర్మం మీద అమిత బాధకలుగుతుంది. గొంగళి పురుగులు లాంటివి కుడితే, చర్మం మీద పాకితే దురదలు, దద్దుర్లు వచ్చి పిల్లలకు బాధ కలుగుతుంది. అప్పుడు, గోరువెచ్చని నీటితో స్నానం చేయించి, దద్దుర్లు, దురద తగ్గటానికి గొంగళిపురుగు పాకిన ప్రదేశంలో విభూదిని బాగా రుద్దాలి. కొన్ని విషకీటకాలు కుడితే ఎలర్జీ ఏర్పడటమే కాకుండా, మరికొన్ని తీవ్రమైన మార్పులు వస్తాయి. దద్దుర్లు ఎర్రగా మారినప్పుడు, ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బంది కలిగినప్పుడు పెదాలు నల్లబడటం, నాలుక తడారిపోవడం లాంటి లక్షణాలు ఏర్పడితే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్ళాలి. అవసరమైన వైద్య సహాయాన్ని పిల్లలకు అందించాలి. * మందులు, రసాయనాలు : మందులు, క్లీనింగ్‌లోషన్స్ పిల్లలకు అందనంత ఎత్తుగా ఉంచాలి. పిల్లలు ఏమైనా మందులు తాగినా, మందుబిళ్ళలు తిన్నా వాటిని కక్కించాలని, ఉప్పునీళ్ళు త్రాగించడం, మంచినీళ్ళు ఎక్కువగా త్రాగించడం చేయకూడదు. అలా చేసినట్లయితే కడుపులో చేరిన మందులు, వెంటనే రక్తంలో చేరే ప్రమాదం ఉంది. బిడ్డకు ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. ఇటువంటివి జరిగినప్పుడు, తక్షణమే వైద్య సహాయం పొందడం చాల అవసరం. కీటకాలను సంహరించే మందులను అమిత భద్రంగా ఉంచాలి. మందును స్ప్రే చేసినప్పుడు పిల్లలను ఆ ప్రదేశానికి దూరంగా ఉంచాలి. దోమలు, నల్లులు, ఎలుకలు, బొద్దింకలు చీమల సంహారక మందులను పిల్లలు నిద్ర పోయిన తర్వాత ఉపయోగించి, పిల్లలు నిద్రలేవకుండా క్లీన్ చేసేయ్యాలి. వాటిని పిల్లలకు తెలియకుండా దాచాలి. పిల్లలకు ఏర్పడే కొన్ని ప్రమాదాలకు తక్షణ ప్రథమచికిత్స చేయాలి. మరికొన్ని ప్రమాదాలకు ఎంతమాత్రం ఆలస్యం జరగకుండా వైద్య చికిత్స జరగాలి. ముఖ్యంగా, పిల్లలకు ప్రమాదాలు జరిగినప్పుడు పెద్దలు, ఆందో ళన, గాభరా పిల్లల ఎదుట ప్రదర్శించకూడదు. పనులు చేసే టప్పుడు చిన్న పిల్లలున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరుపు, అ శ్రద్ధ, నిర్లక్ష్యం లేకుండా ప్రవర్తించాలి. పిల్లలకు జరిగే ప్రమాదాలు ప్రాణా పాయ స్థితికి చేరకుండా తక్షణమే, చర్యలు తీసుకోవాలి.
మీ ఇంట్లోనే సమ్మర్ క్యాంప్ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది అమ్మలకి పెద్ద ఛాలెంజ్. ఎండలు మండిపోతుంటే బయటకి వెళ్ళి ఆడతాం అంటారు. లేదా అస్తమానం టీవీ చూస్తామంటారు... అంటూ కంప్లయింట్ చేసే అమ్మకి మంచి ఆప్షన్స్ తెలిస్తే బావుంటుంది కదా. మా అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ వున్నాయి. సో, సమ్మర్ రాగానే అన్ని ఫ్లాట్స్‌లోని పిల్లల్ని ఓచోట చేర్చి, వాల్ళని ఎలా ఎంగేజ్ చేయాలి? ఏమేమి నేర్పించాలి అన్నది ముందే నిర్ణయించేస్తారు. సో ఇక హాలిడేస్ మొదలవగానే మా అపార్ట్మెంట్లో హడావిడి మొదలవుతుంది. మా పై ఫ్లోర్లో అరుణ దగ్గర పిల్లల బుక్స్ మంచి కలెక్షన్ వుంది. సో, తను వాళ్ళ పిల్లల రూమ్‌లో రెండు రాక్లు పెట్టి దానినిండా ఆ పుస్తకాలు సర్దిపెడుతుంది. ఓ లైబ్రరీలా చేసి, పిల్లలు అక్కడకి వచ్చి రీడింగ్ టైమ్‌ని స్పెండ్ చేసేలా చూస్తారు అరుణ. అలాగే పిల్లలు కొన్ని బుక్స్ ఇళ్ళకి తీసుకెళ్ళవచ్చు. అలాగే అక్కడే స్టోరీ అవర్ అని పిల్లలు ఒక్కొక్కరు తాము చదివిన పుస్తకాల్లోని కథలని మిగతా పిల్లలకి చెప్పాలి. దాని వలన పిల్లలు తాము తెలుసుకున్న విషయాలని అంతే చక్కగా అందరితో చెప్పడం ఎలాగో నేర్చుకుంటారు. అలాగే పిల్లలందరూ కలసి ఓచోట చేరి ఆ పుస్తకాలలోని విషయాలపై చర్చించుకుంటారు. అలాగే వాళ్ళని స్వంతగా కథలు రాసేలా ప్రోత్సహిస్తారు. ఇక పిల్లలకి కొత్తకొత్త ప్రాంతాలు, సంస్కృతి సంప్రదాయాలని పరిచయం చేయడం మా థర్డ్ ఫ్లోర్లో శారద డ్యూటీ. ఆమె ఈ నెలరోజుల్లో పిల్లలతో రకరకాల సంప్రదాయాలని ప్రతిబింబించేలా డ్రస్సు చేయించడం, ఫ్యాన్సీ డ్రస్ పోటీలు ఇవన్నీ మా శారదగారు ఎంతో ఇష్టంగా చేస్తారు. ఎవరికి వారు వాళ్ళవాళ్ళ పిల్లల్ని ఒక్కరినే హ్యాండిల్ చేయడానికి ఎంత సమయం, సహనం కావాలో మరికొంతమంది పిల్లల్ని కూడా కలిపి వాళ్ళందరినీ చూడటానికి అంతే సమయం పడుతుంది. పైగా పిల్లలందరూ ఓచోట చేరితో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. మా ఫస్ట్ ఫ్లోర్లో వుండే అనిత పిల్లలందరికీ డ్రాయింగ్, కుట్లు, అల్లికలు నేర్పిస్తారు. వాళ్ళ అత్తగారు సాయంత్రం అవగానే పిల్లలందర్నీ ఓచోట చేర్చి వాళ్ళకి తెలుగు పద్యాలు, పాటలు, స్తోత్రాల వంటివి నేర్పిస్తారు. ఇక ఈ హాలిడేస్‌లో పిల్లలకి ప్రతిరోజూ ఓ పిక్నిక్కే. ఎందుకంటే ప్రతీరోజు మధ్యాహ్నం లంచ్ ఎవరో ఒకరింట్లో వుంటుంది. పిల్లలకి నచ్చిన ఐటమ్స్ చేసి అందరినీ కలిపి బఫే పెడితే కబుర్లు, ఆటపాటలతో హాయిగా బొజ్జనిండా తింటారు పిల్లలు. ఇక పిల్లల్ని బయటకి తీసుకువెళ్ళడం గురించి చెప్పాలంటే సాయంత్రం అవగానే పిల్లల్ని వాళ్ళ ఫాదర్స్ ఆఫీసు నుంచి రాగానే దగ్గర్లోని పార్క్‌కి తీసుకువెళతారు. అలాగే ఆదవారాలలలో దగ్గర్లోని ప్లేసెస్‌కి పిక్నిక్- ఇలా ఈ నెలరోజులు ప్రతి పిల్లాడూ అపార్ట్మెంట్లోని మిగతా పిల్లలతోపాటు పెద్దవాళ్ళతో కూడా కలవటం, మాట్లాడటం చేస్తాడు. సో, సోషలైజేషన్ అలవాటయిపోతుంది వీళ్ళకి. అందరూ కలసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ముఖ్యంగా 24 గంటలూ పిల్లల్ని ఎంగేజ్ చేయాలన్న భయం వుండదు. ఎందుకంటే ఒకోరోజు ఒకరు. అలాగే రోజు మొత్తంలో ఒకో సమయంలో ఒకోరు పిల్లల బాధ్యత తీసుకుంటారు కాబట్టి మిగతావాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది. పిల్లలకి ఈ హాలిడేస్ జాలీడేస్లా అనిపించాలన్నా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలన్నా, ఎన్నో లైఫ్ స్కిల్స్‌ని నేర్చుకోవాలన్నా ఇలా ఓ గ్రూప్‌గా చేరడం ఎంతో ముఖ్యం. సో, మీ ఇంట్లో పిల్లలకి మీరే ఓ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవచ్చు.. ఆలోచించండి.. -రమ
నయం చేయలేని ఈ వ్యాధి పిల్లలను వికలాంగులను చేస్తుంది..! పిల్లల తల లేదా మెడ సాధారణం కంటే చిన్నగా ఉందా? కండరాలు చాలా బలహీనంగా ఉన్నాయా? మాట్లాడటంలో లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? ఇలాంటి పిల్లలను నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి పిల్లలకు డౌన్ సిండ్రోమ్ ఉండే అవకాశం ఉంటుంది. అసలు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? డౌన్ సిండ్రోమ్ అనేది ఒక తీవ్రమైన జన్యుపరమైన సమస్య. దీని కేసులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. పిల్లలలో ఈ జన్యుపరమైన సమస్య వారి మొత్తం జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డౌన్ సిండ్రోమ్ సమస్యలో అదనంగా ఒక క్రోమోజోమ్ తో జన్మిస్తారు. దీని అర్థం వారికి 46 క్రోమోజోమ్‌లకు బదులుగా మొత్తం 47 క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఇది వారి మెదడు, శరీర అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా చాలా మందికి నడవడం లేదా లేవడం వంటి సాధారణ జీవిత కార్యకలాపాలను చేయడంలో సమస్యలు ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ సమస్య గురించి అవగాహన పెంచడం, డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులను సమాజాలలో వారు విలువైన వారిగా ఎలా పరిగణించాలో ప్రజలకు అవగాహన కల్పించడం అనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మార్చి 21న ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు.. భారతీయ జనాభాలో డౌన్ సిండ్రోమ్ కనిపిస్తోంది. ఈ సమస్య భారతదేశంలో 800 నుండి 850 జననాలలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం 30,000 నుండి 35,000 మంది పిల్లలు దీని బారిన పడుతున్నారని అంచనా. చాలా ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే ఈ డౌన్ సిండ్రోమ్ కు చికిత్స లేదు. పిల్లలో డౌన్ సిండ్రోమ్.. డౌన్ సిండ్రోమ్ శారీరక, అభిజ్ఞా, ప్రవర్తనా సమస్యలను కలిగిస్తుంది. డౌన్ సిండ్రోమ్, శారీరక సంకేతాలు సాధారణంగా పుట్టినప్పుడు కనిపిస్తాయి. బిడ్డ పెరిగేకొద్దీ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. చదునైన ముక్కు, వాలుగా ఉన్న కళ్ళు, పొట్టి మెడ, చిన్న చెవులు, చేతులు, కాళ్ళు వంటి సమస్యలు ఉండవచ్చు. పుట్టినప్పుడు బలహీనమైన కండరాలు, సగటు ఎత్తు కంటే తక్కువ, వినికిడి, దృష్టి సమస్యలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కూడా డౌన్ సిండ్రోమ్ లక్షణం కావచ్చు. పిల్లలో ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అసలు ఎందుకు ఇది సమస్య కలిగిస్తుంది. డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్‌లకు సంబంధించిన సమస్య. దీనితో పాటు కొన్ని ప్రమాద కారకాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 35 ఏళ్లు పైబడిన మహిళలకు జన్మించిన పిల్లలకు ఈ రుగ్మత వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఇంతకు ముందు డౌన్ సిండ్రోమ్ కేసులు ఉంటే, ప్రమాదం పెరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఎవరికైనా జన్యుపరమైన రుగ్మత ఉంటే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏం చేయాలి? డౌన్ సిండ్రోమ్ సాధారణంగా గర్భధారణ సమయంలో లేదా ప్రసవం తర్వాత నిర్ధారణ అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మొదటి, రెండవ త్రైమాసికంలో గర్భధారణ స్క్రీనింగ్ పరీక్షలు, అంటే రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ ద్వారా డౌన్ సిండ్రోమ్ ప్రమాదాన్ని గుర్తించవచ్చు. డౌన్ సిండ్రోమ్‌కు శాశ్వత నివారణ లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ సరైన సంరక్షణ ద్వారా జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు. పిల్లలకు మాట్లాడే, సంభాషించే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి టాక్ థెరపీ ఇవ్వబడుతుంది. అదేవిధంగా కండరాల బలం, సమతుల్యతను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ ప్రయోజనకరంగా ఉంటుంది. డౌన్ సిండ్రోమ్‌ను నివారించడానికి ఖచ్చితమైన మార్గం లేదు. *రూపశ్రీ.
పిల్లల మనసుని మార్చే రంగులు! రంగుల ప్రభావం మన మనసుపై పడుతుందంటే నమ్మసక్యంగా లేదు కదూ, కాని ఇది అక్షరాల నిజమని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మనం పిల్లల గదికి వేసే రంగుల ప్రభావం వారి మీద చాలా ఉంటుందిట. ముభావంగా ఉండే పిల్లల్లో హుషారుని నింపాలన్నా, హైపెరాక్టివ్ పిల్లల్ని కుదురుగా కూర్చోబెట్టాలన్నా ప్రత్యేకమైన రంగులు ఉపయోగిస్తే చాలట. వారి ప్రవర్తనా విధానంలో మెల్లిగా మార్పులు చేసుకుంటాయట. ఇది వింటే కాస్త కొత్తగా అనిపిస్తున్నా దీనికి సంబంధించి పిల్లలపై చేసిన పరిశోధనలు మంచి ఫలితాలని ఇచ్చాయని నొక్కి చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మరి మీ పిల్లల మనస్తత్వానికి ఎలాంటి రంగు ఎక్కువగా వాడాలో ఎంచుకోండి. ఇంటిలో వాళ్ళ రూమ్ కి వేసే కలర్, వాళ్ళ స్కూల్ బ్యాగ్ కలర్, వాళ్ళు వేసుకునే బట్టల కలర్ ఇలాంటి వాటికి ఏ సమయంలో ఎలాంటివి ఎంచుకోవాలో ఒక నిర్ణయానికి రావచ్చు. * రెడ్ కలర్ - ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకుండా నలుగురిలో కలవటానికి ఇబ్బంది పడే పిల్లల రూం కి ఎరుపు రంగు వేస్తె వాళ్ళల్లో హుషారు పెరుగుతుందట ఎందుకంటే ఎరుపు మనిషి మెదడులో రక్త ప్రసరణ త్వరగా జరిగేలా చేస్తుందిట. అదే హైపెరాక్టివ్ పిల్లల రూంలో ఎరుపు రంగు వేస్తే గనక ఇక వాళ్ళని ఆపటం ఎవరితరము కాదు. వాళ్ళ హుషారు రెండింతలు పెరిగి చదువు మీద ధ్యాస తగ్గి ప్రవర్తనలో విపరీతధోరణులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్తంత జాగ్రత్త సుమా. * ఆరంజ్ కలర్ - పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచగల శక్తి ఈ నారింజ రంగుకి ఉందట. ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించటానికి దోహదపడుతుందట. అన్నివిషయాలలో పిల్లలు మీ మీద ఆధారపడుతుంటే మీరు ఈ రంగుని ఎంచుకోవచ్చు. * గ్రీన్ కలర్ - పిల్లల్లో కాన్సంట్రేషన్ పెరగడానికి ఈ రంగు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వారిలో చదువుపట్ల ఆసక్తిని కూడా పెంపొందిస్తుందట. వాళ్ళల్లో ఉన్న యంగ్జైటి తగ్గి వాళ్ళని ఎప్పుడూ కూల్ గా ఉంచుతుంది కూడా. * బ్లూ కలర్ - ఎరుపు రంగుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఈ నీలం రంగు. అది మెదడులోని రక్త ప్రసరణని రెట్టింపు చేసి గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తే ఈ నీలం రంగు పిల్లల మెదడు చాలా ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని.నిద్రకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా అవి కూడా దూరమయ్యి హాయిగా నిద్రపడుతుందట కూడా. హైపేరాక్టివ్నెస్ ఎక్కువగా ఉండే పిల్లల కోసం ఎక్కువగా ఈ రంగుని ఎంచుకున్నట్లయితే వారిలో దూకుడు స్వభావం తగ్గుతుందని చెప్తున్నారు. * ఎల్లో కలర్ - పిల్లల్లో ఏకాగ్రత పెరగటానికి పసుపు రంగు ఉపయోగపడుతుందట. వారు స్థిరంగా కూర్చుని చదవాలన్నా లేడిన ఏదైనా పని కుదురుగా చేయాలన్నా ఈ రంగుని ఎంచుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇలా రంగులు మనిషి పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయని ఎన్నో అధ్యయనాలు రుజువు చేసాయి. రంగుల పట్ల కాస్తంత అవగాహన ఉంటే చాలు మన పిల్లల మనసుని మనం సునాయాసంగా మార్చుకుని హ్యాపీ గా ఉండచ్చు. కేవలం గదికి వేసే రంగులే కాదు వారి కోసం వాడే ప్రతి వస్తువుని సరిపడే రంగులలో మనం ఎంచుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడరు మనని ఇబ్బంది పెట్టరు. - కళ్యాణి
కొల్లాజెన్‌ను పెంచి ముడతలు తగ్గించే ఈ డ్రింక్స్ తాగితే యంగ్‌గా ఉంటారు..! కొల్లాజెన్ శరీరానికి అవసరమైన ప్రోటీన్. ఇది చర్మం, జుట్టు, గోర్లు, కీళ్ళు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చర్మం వదులుగా మారుతుంది. ముడతలు వస్తాయి. అందుకే కొల్లాజెన్ స్థాయిలు మెరుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొల్లాజెన్ పెంచడానికి 5 పానీయాలు బాగా సహాయపడతాయి. అవేంటంటే.. బెర్రీ స్మూతీ.. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం, ఎందుకంటే ఇది అమైనో ఆమ్లాలను కొల్లాజెన్గా మార్చడంలో సహాయపడుతుంది. బెర్రీ స్మూతీని తయారు చేయడానికి, ఒక కప్పు బెర్రీలు, ఒక అరటిపండు, ఒక కప్పు పెరుగు లేదా బాదం పాలు, ఐస్ క్యూబ్‌లను బ్లెండర్లో వేసి బ్లెండ్ చేయాలి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఆకుకూరల జ్యూస్.. పాలకూర, కాలే, ఇతర ఆకుకూరలలో క్లోరోఫిల్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్థాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుపచ్చ కూరగాయల జ్యూస్ తయారు చేయడానికి పాలకూర, దోసకాయ, సెలెరీ, ఆపిల్లను కలిపి జ్యూసర్లో గ్రైండ్ చేసుకోవాలి. దీనికి నిమ్మరసం జోడించడం ద్వారా విటమిన్ సి మొత్తాన్ని మరింత పెంచవచ్చు. బోన్ జ్యూస్ లేదా సూప్.. ఎముక రసం కొల్లాజెన్ కు సహజ మూలం. దీనిని చికెన్ లేదా మటన్ ఎముకలను ఉడకబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు, గ్లైసిన్, ప్రోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. బోన్ జ్యూస్ సూప్ లాగా లేదా నేరుగా తినవచ్చు. ఇది కొల్లాజెన్‌ను పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది . కొబ్బరి నీళ్లు, కలబంద రసం.. కొబ్బరి నీళ్లు, కలబంద రసం రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. కొబ్బరి నీరు హైడ్రేషన్‌ను నిర్వహిస్తుంది. కలబంద రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ రెండింటినీ కలిపితే రిఫ్రెషింగ్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. రెండు టీస్పూన్ల కలబంద రసం ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి . నారింజ, క్యారెట్ జ్యూస్.. నారింజ, క్యారెట్లు రెండింటిలోనూ విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, బీటా కెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. నారింజ, క్యారెట్ రసం తయారు చేయడానికి, జ్యూసర్లో రెండు నారింజ, ఒక క్యారెట్‌ను గ్రైండ్ చేసుకోవాలి. దానికి అల్లం ముక్కను జోడించడం ద్వారా రుచిని కొల్లాజెన్ కంటెంట్ పెరగడాన్ని మరింత పెంచుకోవచ్చు. *రూపశ్రీ.
పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు! పిల్లల ఎదుగుదలను చూసి సంతోషించని తల్లిదండ్రులు ఉండరు. అయితే ఈ క్రమంలో తెలియకుండానే వాళ్లకి కొన్ని విషయాలలో అతిగా స్వేచ్ఛను ఇస్తుంటారు. మరికొంతమంది .. పిల్లలకు అస్సలు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతీ విషయంలో తల్లిదండ్రులు చెప్పినట్లే చేయాలని వాళ్ల మీద విపరీతమైన ఒత్తిడి తెస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మన మాట లెక్కచేయకపోవడం లేదా అతి క్రమశిక్షణ వలన యాక్టివ్‌గా లేకపోవడం వంటి దుష్ప్రభవాలు కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల వలన పిల్లలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట లెక్కచేయడం మానేసి వారికి నచ్చినరీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకొని పెడదారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే పిల్లలను ఎలా పెంచాలో అనే విషయం గురించి తెలుసుకుందాం. 1. చదువులో గాని, ఆటల్లో గాని వారికి కావాల్సిన ప్రేరణను మనం అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ప్రతీ విషయానికి వాళ్ల మీద చిరాకు పడడం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు దారి వైపు వెళ్లేందుకు దోహదపడుతుంది. 2. పిల్లలకు చిన్నప్పటి నుండి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. చిన్నతనం నుండి వారిలో స్వార్ధాన్ని నూరిపోయకూడదు. ఇతరుల అవసరాలకి స్పందించేలా వారిని ప్రోత్సహించాలి. అందువలన వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు. వారిలో ఏదో సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా వారిని ప్రోత్సహించాలి. 3. కొన్ని సందర్భాల్లో తెలియకుండానే పిల్లలపై కోపాన్ని చూపిస్తాం . ఉదాహరణకు వారు మన కళ్ల ముందే ఏదైనా గోడ ఎక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వారిని దగ్గరకు తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి. దాని వలన జరిగే అనర్ధాలను వారికి వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి. 4. చాలా మంది తల్లితండ్రులు తమ బాగా చదువుకోవాలని అనుకుంటారు . అందువల్ల వారికి ఏ పని చెప్పకుండా ఎప్పుడూ చదువుకోమని చెప్తూ ఉంటారు .. అది చాలా తప్పు అలా చేయడం వల్ల పిల్లలు చాలా వత్తిడికి గురవుతారు . దానివలన లేనిపోని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది .. పిల్లలకి చదువు విలువ ఏంటో అర్దం అయ్యేలా చెప్పండి .. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేయండి .. 5. అలాగే తల్లులు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి .. చాలామంది పిల్లలకి స్కూల్ లో జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పడం అలవాటు . ఇంట్లో వారి మాటలు వినేవారు లేకపోతే వారు బయట స్నేహితులకి ఎక్కువ అలవాటు అయ్యే అవకాశం ఉంది . వారితో ఎక్కువగా మాట్లాడుతుండడం వల్ల వాళ్ళు కూడా ఏ విషయాలు దాచుకోకుండా అన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అది పిల్లల భవిష్యత్తు కి ఎంతో మేలు చేస్తుంది.
పిల్లల్లో డిప్రెషన్.. గుర్తించటం ఎలా! 1. ‘డిప్రెషన్’ ఈ మధ్యకాలంలో తరచూ అందరిదగ్గర మనకి వినిపిస్తున్న మాట ఇది. ఈ డిప్రెషన్ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోలేక, లోలోపలే కుమిలి పోయే, ఒకలాంటి అయోమయ స్థితికి తీసుకువెళుతుంది ఎవరినైనా. ఏ వయసువారినైనా ఈ డిప్రెషన్ చుట్టుముట్టచ్చు. కాస్త పెద్దవాళ్లకయితే తామున్న స్థితి గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. దాని నుంచి బయట పడటానికి కనీసం ప్రయత్నమైనా చేయగలుగుతారు. కానీ పిల్లలు అలా కాదు. అసలు తమకి ఏమవుతుందో కూడా అర్థం చేసుకోలేని వయసు వారిది. కాబట్టి పిల్లల విషయంలో మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2. పిల్లలోని డిప్రెషన్‌ను సరైన సమయంలో గుర్తించకపోతే, పిల్లల వికాసాన్ని చేజేతులారా మనమే అడ్డుకున్న వాళ్ళమవుతాం అంటున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డా॥ గౌరీదేవిగారు. డిప్రెషన్‌తో ఉండే పిల్లల లక్షణాలు ఇలా వుంటాయంటూ కొన్ని లక్షణాలని తెలియచేస్తున్నారు. అవి ఏంటంటే ఎప్పుడు చూసినా దిగులుగా ఉండటం, ప్రతీ విషయానికి పేచీ పెట్టి ఏడవటం, ఎక్కువగా భయపడటం, ఆటపాటల పట్ల కూడా ఉత్సాహం చూపకపోవటం, అమ్మ కొంగుపట్టుకునే తిరగటం, ఎప్పుడూ ఏదో ఒక నొప్పి ఉందంటూ చెబుతుండటం, ఆహారంపట్ల ఎక్కువ ఇష్టం ఇష్టం చూపించటం, లేదా అస్సలు ఇష్టపడకపోవటం ఇలా సాధారణ స్థితికి భిన్నంగా ఉండే లక్షణాలు కనిపిస్తాయట. 3. పిల్లలోని డిప్రెషన్‌ను గుర్తించటం ఎలాగో చెప్పుకుంటున్నాం కద.. అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుందీ అన్న దానికీ పరిశోధకులు చెబుతున్న కారణం ‘మొదడులో డోపమిన్, సిరోటానిన్ అనే పదార్ధాల ప్రమాణం ఎక్కువ, తక్కువ అవడం వల్ల డిప్రెషన్‌కు లోనవుతారట.’ అలాగే చిన్నప్పుడు బాధాకర అనుభవాలు కూడా డిప్రెషన్‌ను కలుగచేస్తాయట. కుటుంబంలోని తల్లిదండ్రుల పోట్లాటలు, స్కూలు టీచర్లు, తోటివారి ప్రవర్తన వంటివి కూడా పిల్లల్లో డిప్రెషన్‌కు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. 4. పిల్లలో అసహజ లక్షణాలు అంటే కోపం, భయం, వంటివి కనిపిస్తే ‘ఎందుకు’! అంటూ తల్లిదండ్రులుపిల్లల్ని అరిచి, తిట్టి, హేళన చేస్తుంటారు. అది వారిని మరింత కృంగదీస్తుంది. కాబట్టి పిల్లల్లో అసహజ లక్షణాలు కనిపిస్తే కారణం ఏమైవుంటుంది అని ఆలోచించి, వారిని ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురావటానికి ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు. 5. మన ప్రయత్నాలేవి ఫలించనపుడు మానసిక వైద్యులను సంప్రదించటానికి సంకోచించకూడదు. డిప్రెషన్ అనేది ఒక మానసిక స్థితి అంటే.. తగిన సమయంలో గుర్తించి స్పందిస్తే పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు అంటున్న నిపుణుల సూచనలు పిల్లల చిన్న ప్రపంచాన్ని సంతోషంతో నింపటానికి సహాయపడతాయి. - రమ
వాళ్ళని ఆడనివ్వండి.. అలసిపోనివ్వండి... పిల్లలు దూకుడుగా ఉంటే తల్లులకు కాస్త కంగారుగా వుంటుంది. ఎక్కడ క్రింద పడతాడో దెబ్బలు తగిలించుకుంటాడోనని జాగ్రత్త... జాగ్రత్త అంటూ వెంట వెంటే తిరుగుతూనే వుంటుంది అమ్మ, కానీ అల్లరి బుడతలు ఓ చోట కూర్చుంటారా? కుర్చీలు ఎక్కి, సోఫాలెక్కి దూకటం, పరుగులు పెట్టడం మామూలే. కొంతమంది అమ్మమ్మలు, నాయనమ్మలు పసివాడు ఉదయం నుంచి చక్రంలా తిరుగుతూనే వున్నాడు కాళ్ళు నొప్పి వస్తాయో ఎమో అంటూ బాధపడతారు. కానీ అమెరికాలోని ఇండియానా వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం అది ఎంతో మంచిది, పిల్లలని వారించద్దు, వీలయితే చిన్న వయస్సులో ఉండగా వారితో వ్యాయామాల వంటివి కూడా చేయించండి అంటున్నారు. చిన్నతనంలో చేసే వ్యాయామం వల్ల జీవితకాలం ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చిన్నతనంలో బాగా శారీరక అలసట వచ్చేలా ఆటలు అడిన పిల్లలు, ఎముకల చలనం ఎక్కువగా ఉండేలా పరుగులు పెట్టి ఆడిన పిల్లలు, అలాగే చిన్నప్పటి నుంచి వ్యాయామాలు చేసిన పిల్లల్లో పెద్దయ్యాక వారి ఎముకలు పటిష్టంగా ఉండటం వీరు నిర్వహించిన ఓ పరిశోధనలో గుర్తించారుట. చిన్నతనంలో వ్యాయామాల వల్ల ఎముకల్లో అదనంగా బాహ్య పొరలు ఏర్పడటం గమనించారు వీరు. దీనివల్ల భవిష్యత్తులో ఎముకలు విరిగే ప్రమాదం వుండదని, కీళ్ళ నొప్పుల వంటివి త్వరగా రావని చెబుతున్నారు వీరు . పిల్లల ఆటలు వారి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయనే విషయాన్ని నిర్ధారించు కోవటానికి శాస్త్రవేత్తలు కొంత మంది పిల్లలపై కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపారు, కొంతమంది పిల్లలతో కొన్ని నెలల పాటు చిన్నపాటి వ్యాయామాలు చేయించారట. ఆ సమయంలో వారి ఎముకల ఎదుగుదలని నమోదు చేసినపుడు వ్యాయామం చేయకమునుపు కంటే, వ్యాయామం చేసిన తరువాత ఎముక పెరగటం గమనించారుట. ఎముక బలంగా ఉన్నప్పుడే అది ఎక్కువకాలం పాటు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్యేకంగా పిల్లలతో వ్యాయామాల వంటివి చేయించలేం అనుకుంటే కనీసం పిల్లల్ని అడుకోనివ్వమని చెబుతున్నారు. వారి మానాన వారిని వదిలేస్తే వాళ్ళు అటు,ఇటు తిరుగుతూ ఆడుకుంటూ వుంటారు . ఏమాత్రం కదలికకి అవకాశం ఇవ్వకుండా పిల్లలు పడిపోతారనే భయంతో చంకన వేసుకు తిరగటం వంటివి చేయటం మంచిది కాదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎదిగే వయసులో ఎముక బలిష్టంగా ఉంటేనే ఆ తర్వాత కాలంలో ప్రయోజనం పొందవచ్చని, అదే అ సమయంలో కావల్సినంత కదలిక లేకుండా పిల్లల్ని ఒకేచోట కూర్చోబెట్టటం వంటివి చేస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయని హెచ్చరిస్తునారు. అంతే కాదు పౌష్టికాహారం కూడా పిల్లల్లో ఎముకలు ఆరోగ్యంగా ఎదగటానికి సహాయపడుతుందని, పిల్లలు తినరంటూ ఎదో ఒకటిలే అని పెట్టడం వంటివి చేసే తల్లులు ఒకసారి ఆలోచించటం అవసరమని కూడా చెబుతున్నారు ఆహారం, వ్యాయామం వంటివి పెద్దలకే కాదు పిల్లలకూ ముఖ్యమేనని గట్టిగా హెచ్చరిస్తున్నారు వీరు. ఒకప్పుడు పిల్లలు స్కూలు నుంచి వస్తే ఓ రెండు, మూడు గంటల పాటు ఆరుబయట ఆడుకొనేవారు. ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంచక్కా నడచి వెళ్ళేవారు. కానీ ఇప్పుడో... పిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెడితే స్కూల్ బస్సు, తిరిగి స్కూల్ బస్సు దిగి ఇల్లు. టి.వి., వీడియో గేమ్స్ వంటివి పిల్లలని కదలకుండా ఓ చోట కట్టిపడేస్తున్నాయి. దాంతో నడక నేర్చిన పిల్లల నుంచి స్కూల్ పిల్లల దాకా అందరూ ఉరుకులు, పరుగులు తగ్గించారు. ఆ ప్రభావం వారి ఎముకల ఎదుగుదలపై, వాటి ఆరోగ్యంఫై తప్పక ఉంటుందని నిపుణులు చెబుతున్న మాట తేలికగా తీసుకోటానికి లేదు. అందువల్ల పిల్లలని ఓ కంట కనిపెడుతూనే వారిని స్వేచ్చగా ఆడుకోనివ్వటం అవసరం. వీలయినంతలో పిల్లలు, పెద్దలు వ్యాయామాలు వంటివి చేయటం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదూ.. ఆలోచించడమే కాదు.. తప్పకుండా అచరణలో కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ ఆలోచన, ఆచరణ మీరు ఎంతగానో ప్రేమించే మీ పిల్లల భవిష్యతుకు ఆరోగ్యకరమైన బాట పరుస్తాయి. -రమ
ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం అనే సమస్య చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు తెల్లజుట్టు కేవలం వయసు అయిపోయిన వారిలోనే కనిపిస్తుండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. మరీ దారుణంగా చిన్నపిల్లలలో కూడా తెల్లజుట్టు కనిపించడం ఆందోళనకు గురిచేసే అంశం. చాలా మంది తెల్లజుట్టును చూసి గందరగోళానికి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇలాంటి ఆందోళనలు సమస్యను ఎక్కువ చేస్తాయి. మరికొందరు కాంప్రమైజ్ అయిపోయి కలర్ డైలు వాడుతూ తెల్లజుట్టును కవర్ చేసుకుంటారు. అయితే వీటన్నింటికి బదులు తెల్ల జుట్టును నల్లగా మార్చే పరిష్కారాన్ని మాత్రమే కాకుండా.. అసలు తెల్ల జుట్టు సమస్యకు మూలం ఏంటనే విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. తెల్ల జుట్టు సమస్యకు కారణాలు.. ఈ తెల్లజుట్టు సమస్య అస్సలు రాకూడదు అంటే పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుంటే.. ధూమపానం.. ధూమపానం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మాత్రమే కాకుండా జుట్టు బూడిద రంగులో మారడానికి కూడా కారణమవుతుంది. కేవలం నేరుగా సిగరెట్, బీడి, పొగాకు తీసుకునేవారే కాదు.. పరోక్షంగా ఈ పొగను పీల్చేవారు కూడా ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఉన్నాయట. జుట్టు నెరయడం, ధూమపానం మధ్య సంబంధం ఉందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ధూమపానం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని వలన జుట్టుకు తగినంత పోషకాలు అందవు. బలహీనత కారణంగా జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. యోగా.. యోగా చేయకపోవడం వల్ల శరీరం నీరసంగా మారడమే కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. యోగా లేదా మరే ఇతర శారీరక శ్రమలో పాల్గొననప్పుడు, వృద్ధాప్యం త్వరగా వస్తుంది. అది జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. జుట్టు బూడిద రంగులోకి మారడానికి ఇదే కారణం. యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది జుట్టుకు ఎక్కువ పోషణను అందిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. పోషణ.. జుట్టు తెల్లబడటానికి ఒక ప్రధాన కారణం పోషకాహార లోపం. తగినంత పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు తిననప్పుడు జుట్టుకు అవసరమైన పోషకాలు లభించవు. దీనివల్ల అది బలహీనంగా మారుతుంది. త్వరగా నెరిసిపోతుంది. అందువల్ల ఆహారంలో ఒమేగా 3, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని జోడించాలి. జంక్ ఫుడ్ మానేయాలి. శుభ్రత.. జుట్టు సరిగ్గా కడగకపోతే అది కూడా బూడిద రంగులోకి మారడానికి కారణమవుతుంది. ఎందుకంటే జుట్టును సరిగ్గా కడగకపోతే, తలపై మురికి పేరుకుపోతుంది, దీని వలన రంధ్రాలు మూసుకుపోతాయి, జుట్టు బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. అలాగే, మరు ప్రతిరోజూ జుట్టును కడుక్కుంటే అది తలలోని సహజ నూనెను కూడా తొలగిస్తుంది. జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అందువల్ల జుట్టును వారానికి 2-3 సార్లు మాత్రమే కడగాలి. ఒత్తిడి.. ఒత్తిడి అన్ని విధాలుగా హానికరం. అది ఆరోగ్యం అయినా, చర్మం, జుట్టు అయినా, ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది, ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. జుట్టు తెల్లబడటం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి ధ్యానం చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి. *రూపశ్రీ.
అందమైన బుజ్జాయిల కోసం చిట్టి పాపాయి ఏం చేసినా, ఎలా వున్నా అందమే. అలా అని అమ్మ పాపాయిని తయారుచేయడంలో రాజీ పడగలదా! అందాల బొమ్మని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు తాపత్రయపడుతుంది. అసలే పాపాయిలతో ఫుల్ బిజీగా వుండే అమ్మలకి మార్కెట్లో పాపాయిల కోసం కొత్తగా వచ్చే ఫ్యాషనబుల్ ఐటమ్స్ గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమే. అందుకే బుజ్జిపాపని ఒక్క క్షణంలో అందంగా సిద్ధం చేసే సరికొత్త హెయిర్ బాండ్స్‌ని పరిచయం చేస్తున్నాం. రకరకాల రంగుల్లో డిజైన్లలో ఇవి దొరుకుతాయి. బుజ్జి పాప తలపై అందంగా అమరిపోయే వన్నెలు చిందిస్తాయి. ఒక్క పువ్వు బ్యాండ్ పెట్టి చూడండి ఎంత అందంగా మెరిసిపోతుందో మీ చిట్టిపాపాయి. -రమ
చలికాలంలో పసిపిల్లల సెన్సిటివ్ హెయిర్ కోసం ఇలా కేర్ తీసుకోండి..! పిల్లల ఆరోగ్యం విషయానికి వస్తే చలికాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. పొడి, చల్లని గాలి నుండి పిల్లల చర్మాన్ని రక్షించడమే కాదు, వారి జుట్టును ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. చలికాలంలో పొడి గాలి తలలో తేమను తగ్గిస్తుంది. దీని వల్ల దురద సమస్య పెరగడమే కాకుండా జుట్టు కూడా పాడవుతుంది. పెద్దవాళ్లు బయటకు చెప్పుకున్నట్టు, సమస్యను గురించి ఆలోచించినట్టు పిల్లలు ఆలోచించలేరు. వ్యక్తం చేయలేరు. అందుకే చిన్న పిల్లల విషయంలో తల్లులే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు తమ తలను పదే పదే గోకడం, చిరాకుగా అనిపించడం లేదా పిల్లవాడు తన తలను పదేపదే తాకడం గమనించినట్లయితే, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు వైద్యులు సూచించిన, పిల్లలకు రెకమెండ్ చేయబడిన షాంపూ ఉత్పత్తులను మాత్రమే వాడాలి. సాధారణంగా చలికాలంలో జుట్టు సమస్యలు పెరుగుతాయి. తక్కువ ఉష్ణోగ్రతలు, పొడి గాలితో పాటు ఇంట్లోని వేడి పిల్లల చర్మం, తలలో తేమను కోల్పోయేలా చేస్తుందని చిన్న పిల్లల నిపుణులు అంటున్నారు. ఇది చాలా దుష్ప్రభావాలను కలిగిస్తుంది. పిల్లల తల చర్మం పెద్దవారి కంటే చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే అది చాలా తొందరగా పొడిగా మారడం, పొరలుగా మారడం, దురద పెరగడం వంటి వాటికి దారి తీస్తుంది. చలికాలంలో పిల్లలకు ఎంత తరచుగా తల స్నానం చేయించాలి? చిన్న పిల్లల నిపుణుల ప్రకారం.. అవసరాన్ని బట్టి పిల్లలకు జుట్టును వారానికి ఒకటి లేదా రెండుసార్లు తలస్నానం చేయించడం సిఫార్సు చేశారు. పిల్లలకు స్నానం చేయడానికి గది ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. ఇది కాకుండా, జుట్టు కడగడానికి ముందు లేదా తర్వాత, బేబీ సేఫ్ ఆయిల్‌తో తలపై తేలికగా మసాజ్ చేయాలి. ఇది స్కాల్ప్‌కు పోషణను అందిస్తుంది, సరైన రక్త ప్రసరణను నిర్వహిస్తుంది. *రూపశ్రీ.
పిల్లల జీవన నైపుణ్యం పెంచుదాం పిల్లలు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించుకొని, బాగా డబ్బు సంపాదించి సుఖంగా బతకాలి అని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అయితే సుఖంగా బతకటానికి చదువు, ఉద్యోగం, డబ్బు ఇవి మాత్రమే చాలా? జీవితాన్ని అందంగా, ఆనందంగా మార్చుకోవాలంటే డబ్బు మాత్రమే కాక మరికొన్ని కూడా కావాలి. జీవన నైపుణ్యాలనండి లేదా మరే పేరుతోనైనా పిలవండి. తప్పనిసరిగా ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకి నేర్పించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి పిల్లల వ్యక్తిత్వంలో భాగంగా మారాలంటే తప్పనిసరిగా ఆ పాఠాలు వారి బుడిబుడి అడుగులతోపాటు మొదలు కావాలి. నాలుగు గోడల మధ్య మొక్క పెరగదు: ఎప్పుడు గుర్తుచేసుకున్నా తియ్యటి అనుభూతులు చుట్టుముట్టేలా ఉండాలి వారి బాల్యం. ఆడటం, ఓడటం, ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకోవటం, పడటం, లేవటం, అన్నీ జీవననైపుణ్యాలే. వాటి నుంచి తప్పించి పిల్లలని నాలుగు గోడల మధ్య పెట్టి జీవితాన్ని జీవించటం ఎలాగో నేర్పించాలనుకోవటం హాస్యాస్పదం కాదంటారా? నాటిన విత్తనం మొలకెత్తి, ఆ మొలక మొక్కై, ఆ మొక్క చెట్టు అయ్యి, ఆ చెట్టు వృక్షంగా మారటం క్రమబద్ధమైన ఎదుగుదలకి, నిలువెత్తు నిదర్సనం. పిల్లలతో ఓ విత్తు నాటిస్తే చాలు ఎదగటమంటే ఎలా వుండాలో వారికి ప్రత్యకంగా నేర్పించక్కరలేదు. ప్రోత్సహించడం చాలా ముఖ్యం: ఉద్యోగాల బజార్లో మనల్ని మనం ఒక బ్రాండ్‌గా మార్కెట్ చేసుకోవటానికి మాటకారితనమే పెట్టుబడి. వ్యక్తిగత జీవితానికి మాటే పెట్టని కోట. ఎవర్ని వారు వ్యక్తం చేసుకోవటానికి మాటను మించిన మార్గం వేరే ఏముంది చెప్పండి! మాట్లాడితే నలుగురూ మంత్రం వేసినట్టు వినాలి. ఆ నైపుణ్యం, ఒక్క రోజులో రాదు, సాధన కావాలి. అది చిన్నప్పుడే మొదలు కావాలి. అది అమ్మానాన్నలే ప్రోత్సహించాలి. అందుకే అదుపు, ఆజ్ఞల పేరుతో పిల్లల నోటికి తాళం వేయద్దు. నీకేం తెలీదంటూ మాట్లాడనీకుండా చేయద్దు. వారి ఆత్మ విశ్వాసాన్ని మొగ్గలోనే తుంచేయద్దు. మాట్లాడనీయండి, మనసులోని మాటలు పెదాలు దాటేలా ప్రోత్సహించండి. అస్పష్టమైన భావాలు సృష్టంగా బయట పడటమెలాగో నేర్పించండి. పిల్లలు తమ బలమైన వాదనని వినిపిస్తుంటే ముచ్చటగా చూడండి. ఎందుకంటే ఆ లక్షణమే నలుగురి మధ్య ఉన్నవాడిని నలుగురిని నడిపించేవాడిగా మారుస్తుంది. సానుకూల దృక్పథం పెంచాలి: ఇది పిల్లలుగా ఉన్నప్పుడే వారి మనసుల్లో నాటితే వారితో పాటు పెరిగి, పెద్దదవుతుంది. పిల్లలకి గెలవటం ఎంత అవసరమో చెప్పినట్టే ఓడిపోవటం తప్పేంలేదని కూడా కూడా చెప్పాలి. ఆశ పడటం ఎంత బావుంటుందో, సర్దుకు పోవటం కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. ఏ పరిస్థితుల్లోనైనా సానుకూలంగా ఆలోచించటం అలవాటు చేయాలి. ఆశావాద దృక్పథాన్ని విడకూడదని హెచ్చరించాలి, బుజ్జగించి చెప్పాలి. రోజువారి ఆటపాటల నుంచి పరీక్షల్లో ఫలితాల దాకా ఉదాహరణలని చూపించి చెప్పాలి. చిన్న మనసుల్లో గెలుపు ఓటములు ఏవీ శాశ్వతం కాదని నాటుకుంటే చాలు... సప్త సముదాల అవతల వున్నా ఆ బిడ్డ ఆత్మ స్థైర్యంతో ప్రపంచాన్ని ఎదుర్కోగలడు. -రమ
అనుబంధంతో అల్లుకోండి పిల్లలతో మంచి అనుబంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి..? అమ్మలందరి ప్రశ్న అదే... ఎందుకంటే వాళ్ళని బెదిరించి, బయపెట్టి మాట వినేలా చేసే రోజులు పోయాయి. చిన్నతనంలో అమ్మ ఏం చెబితే అదే వేదం. అమ్మ చెంగుపట్టుకు తిరుగుతూ, అమ్మ చెప్పే కథలు వింటూ.. అమ్మే లోకంగా వుంటారు పిల్లలు. ఆ సమయంలో నయాన్నో, భయాన్నో వాళ్ళు చెప్పినట్టు వినేలా చేయచ్చు. కాని కాస్త పెరిగి ప్రిటీన్స్ లోకి వచ్చాకా, ఎదురుతిర గటాలు, అలకలు, అబ్బో అమ్మకి బోల్డంత ఓపిక కావాలి. కానీ ఆ పేచీలు లేకుండా చేయటానికి కొన్ని చిట్కాలు వున్నాయి. వాటితో పిల్లలతో అనుబంధం కూడా పెరుగుతుంది.. దాంతో పేచీలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.. నిజానికి అమ్మలందరికి ఈ చిట్కా తెలిసే వుంటుంది. కాని పని కుదరదనో, ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. అలా కాకుండా... అది చాలా ముఖ్యమైనది అని గుర్తించి పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి... అని భరోసా ఇస్తున్నారు నిపుణులు. మరి వారు సూచిస్తున్న ఆ సూత్రాలు ఏంటో చెప్పనా ... పిల్లలతో సమయం గడపటం : ఈ మాట చెప్పగానే... రోజు చేసేది అదే కదా అంటారని తెలుసు...కాని సమయం గడపటం అంటే... రోజూ వారి పనుల మద్య వాళ్ళతో మాట్లాడటం కాదు.. అచ్చంగా వాళ్ళతో మాత్రమే గడపటం. దానికి అమ్మ కొన్ని సమయాలని ఫిక్స్ చేసుకోవాలి. సాధారణంగా ఉదయాన్నే నిద్రలేపేటప్పుడు.. హడావుడిగా టైం అయిపోయింది అంటూ పిల్లలని లేపుతుంటారు.. అలా కాకుండా, ఓ పది నిమిషాల ముందు పిల్లలని లేపండి. పక్కన కూర్చుని ఓ నాలుగు మాటలు సరదాగా మాట్లాడండి, అప్పుడు చూడండి చక, చకా ఎలా రెడీ అవుతారో... అలాగే ఉదయం వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతో అవి, ఇవి మాట్లాడుతూ వుండాలి. అవి చాలా సాధారణ విషయాలు.. పేపర్ లో న్యూస్ గురించో, ఇంట్లో మొక్కల గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో చాలా, చాలా క్యాజ్యువల్ టాక్ జరగాలి. ఇక వీలైతే కాకుండా, వీలు చేసుకుని మరీ పిల్లలతో ఆడిపాడాలి. ఆటలు పిల్లలతోనా? అనద్దు.. క్రికెట్ నుంచి షటిల్ దాకా, అలాగే కారమ్స్, యూనో ఇలా ఎన్నో గేమ్స్ వున్నాయి .. వాటిలో ఏదో ఒకటి ఆడండి. మ్యూజిక్ వినటం ఇష్టంగా వుంటుంది పిల్లలకి. వాళ్ళతో కలసి పాటలు వినటం, వాళ్ళు డాన్స్ చేస్తుంటే చేయలేకపోయినా చూడటం అన్నా చేయాలి. ఇక రంగులంటే పిల్లలతో పాటు మనకి ఇష్టమేగా.. డ్రాయింగ్, కలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా పిల్లలతో కలసి ఏమేం చేయచ్చో అన్నీ చేయటమే. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి ఓ ఫ్రెండ్ లా వాళ్ళ అల్లరిలో భాగం కావాలి. దీని వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి చేసి చూడండి.. పిల్లలు ఎలా అమ్మా, అమ్మా అంటూ చుట్టూ తిరుగుతారో చూడండి. వాళ్ళకి కావాల్సింది ఓ ఫ్రెండ్ లాంటి అమ్మ. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూ, జాగ్రత్తలు చెబుతూ, అప్పుడప్పుడు కోప్పడుతూ, అమ్మ వాళ్ళకి పరాయిగా కనిపిస్తుంది. అర్ధం చేసుకోదు అనుకుంటారు. కాదు బంగారం నీతోనే నేనూ.. నీలా ఆడిపాడి అల్లరి చేస్తాను.. అని వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు... పసివాళ్ళుగా మారిపోయి గారాబాలు పోతారు. ఎంతయినా, ఎన్ని వున్నా వాళ్ళకి కావాల్సింది అమ్మే. ఆ అమ్మ పెద్దయ్యారు అంటూ మీ పనులు మీరు చేసుకోండి, మీ ఆటలు మీరు ఆడుకోండి అంటుంటే, అమ్మ కావాలి అని బయటకి చెప్పటం ఎలాగో తెలియక మొండికేస్తుంటారు. అది పోవాలంటే మళ్ళీ చిన్న పిల్లలప్పుడు పిల్లలతో ఎలా ఎలా ఆడిపాడారో అలా చేయటమే. -రమ
బొమ్మలతో పౌష్టికాహారం పట్ల అవగాహన ప్రముఖ బాల సాహితీవేత్త, వైద్య ఆరోగ్య సైన్స్ రచయిత్రి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ నూతనంగా ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పండ్లు ఫలాలను తింటే ఆరోగ్యం లభిస్తుందని అందరికీ తెలుసు. అయితే పిల్లలు అన్ని ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడరు. ఆ విషయం మాతృమూర్తులందరికీ విదితమే. పండ్లతో, డ్రై ఫ్రూట్స్.తో అనేక రకాల బొమ్మలను చేసి పిల్లలకు చూపించడం వలన ఆయా ఆహార పదార్థాల పట్ల ఆసక్తి కలుగుతుందని ఆలోచించిన రాణీప్రసాద్ డ్రైఫ్రూట్స్.తో అనేక బొమ్మల్ని సృష్టిస్తున్నారు. ఆయా బొమ్మల్ని పిల్లలకు చూపించి అందులోని పోషక పదార్థాల విలువల్ని వివరిస్తూ తల్లీ పిల్లలను చైతన్య పరుస్తున్నారు. అంజీర్లు, బెర్రీ పండ్లు, చెర్రీ పండ్లు, బాదంపప్పు జీడి పప్పు, పిస్తా, పప్పు, కిస్మిస్లు, చియా సీడ్స్, వంటి అనేక రకాల డ్రైఫ్రూట్స్.తోనూ, యాపిల్, అరటి, బత్తాయి, కమలా, అవకాడో, జుకినీ, కివీ, డ్రాగన్ వంటి పండ్లతోనూ అనేక బొమ్మలు తయరుచేసి తమ ఆసుపత్రికి వచ్చే పిల్లలకు ఎగ్జిబిషన్ల ద్వారా చూపిస్తున్నారు. వాటిని ఎలా తయారు చేసుకోవచ్చో, వాటిలోని పోషకాలు ఏమిటో కూడా వివరిస్తున్నారు. అంతే కాక వాటిని వ్యాసాలుగా రాసి పత్రికల్లో ప్రచురిస్తున్నారు. పిల్లలకు డ్రైఫ్రూట్స్ తినడం పట్ల ఆసక్తిని కలగజేయడం లక్ష్యంగా బొమ్మలు తయారు చేస్తున్నానని రాణీప్రసాద్ చెప్పారు పిల్లలు పౌష్టికాహారం తీసుకోకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఈ సమస్యకు రాణీప్రసాద్ తన కళల ద్వారా పరిష్కారం చూపుతున్నారు. పిల్లలకు నోటితో చెప్పడం కన్నా చిత్రాల ద్వారా కథల ద్వారా చెప్పటం వల్ల ఎంతో ఉపయోగముంటుంది. తమ ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే డ్రైఫ్రూట్స్ విలువనూ, ఉపయోగాన్నీ చక్కగా వివరించి చెపుతున్నారు. రాణీప్రసాద్ ఇంతకు ముందే పొడుపు కథల ద్వారా పిల్లలకు మానవ శరీర ఆవయవాల్ని పరిచయం చేశారు. అలాగే పిల్లల తల్లుల కోసం ‘మెడికల్ రంగోలీ’ తయారు చేసి వైద్య శాస్త్రాన్ని ముగ్గుల్లోకి రప్పించారు. పోలియో చుక్కలు, టీకాలు వేయించే వాటిని కవితలుగా మలిచి తమ ఆసుపత్రి ప్రిస్కిప్షన్ ప్యాడ్ మీద ప్రింటు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతంగా మలుస్తున్నారు. ఇప్పుడు పిల్లలకు బలవర్ధకమైన ఆహారం మీద ఇష్టాన్నీ ప్రేమనూ పెంచడానికి తన కళల ద్వారా ప్రయత్నిస్తున్నారు. కళ అనేది తమ మానసిక ఆనందం కోసమే కాకుండా పదుగురినీ జాగృతం చేసేది అని రాణీ ప్రసాద్ నిరూపిస్తున్నారు.