అమ్మంటే ఎవరో తెలుసా

“అమ్మంటే ఎవరో తెలుసా?” అంటూ ఒక ఆర్ద్ర గీతపు పల్లవిలో ప్రశ్న వేసి, చరణంలో ‘ తన సుఖాన్ని విడనాడి తరుణి తల్లి అవుతుంది. సంతానం కోసం బ్రతుకంత ధార పోస్తుంది’ అంటూ జవాబిచ్చారు, డా. నారాయణ రెడ్డి గారు. నా జ్ఞాపకాల దొంతరల్లో మా అమ్మ గురించిన తొలి జ్ఞాపకం, పదిమంది పిల్లల్ని తన చుట్టూ కూర్చోపెట్టుకుని, అన్నం కలిపి పెడుతున్న అన్నపూర్ణగానే. అమ్మ పేరు పార్వతి. పశ్చిమ గోగావరి జిల్లా నరసాపురంలో శ్రీ యేలేశ్వరపు జోగినాథస్వామి గారు, శ్రీమతి లక్ష్మీదేవమ్మ గార్ల నాల్గవ సంతానంగా పుట్టిన అమ్మ వివాహం నాన్నగారు శ్రీ రామకృష్ణ శాస్త్రి గారితో జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకెళ్లి వచ్చిన తాతగారు స్వతంత్ర భారతాన్ని అన్నపూర్ణగా మార్చే యజ్ఞంలో నాన్నగారు పాలుపంచుకోవాలని వందెకరాల అడవిని కొన్నారు. చేస్తున్న ప్రభుత్వోద్యోగానికి పెళ్లైన కొత్తల్లోనే రాజీనామా ఇచ్చేసి నాన్నగారు ఆ అడవిని వ్యవసాయ యోగ్యమైన పొలంగా మార్చే పనిలోకి ప్రవేశించారు.

పెట్టుబడికి డబ్బు లేదు. రాయీరప్పలతో ముళ్లపొదలతో నిండిన అడవి. నీటి వసతి లేదు. కనుచూపు మేరలో మరొక్క ఇల్లు కూడా లేని నిర్మానుష్య ప్రదేశం!విశాలమైన మండువా లోగిలిలో ధనవంతుల ఇంటి గారాల బిడ్డగా పెరిగిన అమ్మ , ఆ పరిసరాల్నీ, ఆ తాటాకు కుటీరాన్నీ చూసి బెంగపడినా సర్దుకుని ఆ ఇంట్లో భాగమై పోయింది. అత్త మామలు, ముగ్గురాడపడుచులూ, ముగ్గురు మరుదులూ, వారి పిల్లలూ, మామగారి చెల్లెలు , వారి కుటుంబం, అత్తగారి అక్కలూ , వారి పిల్లలు, ఇంకా పెదమామగారి మనవలు, స్నేహితులు వారి కుటుంబాలూ … ఇలా ఆ వనం లోని పర్ణశాలలో ఎప్పుడూ బంధువాహిని ప్రవహిస్తూ ఉండేది.

ముఖ్యంగా ప్రతి వేసవిలోనూ ఆ తోటలో పారే సెలయేరులా , దూకే జలపాతంలా పాతికమంది పిల్లల హోరు ప్రతిధ్వనించేది. ఇంతమందికీ విసుగన్నది లేకుండా మామ్మ వెనకే అమ్మ చిరునవ్వుతో అన్నపానాలు ఏర్పాటు చేసేది. ఆత్మీయంగా, నిష్కల్మషంగా ఆదరించేది. వచ్చిన పిల్లలంతా ఆట పాటల వయసువాళ్లు కావడం వల్లా, వెంట వచ్చిన తల్లి తండ్రులు కొద్దిరోజులుండి వెళ్లిపోవడంతోనూ పని భారమంతా అమ్మ, మామ్మల మీదే పడేది. అయినా ఏనాడూ అమ్మ విసుక్కోగా నేను చూడలేదు. ఇల్లూ వాకిలీ శుభ్రపరచుకోవడం, ఇంతమందికీ కట్టెపుల్లల పొయ్యిమీద వండి వార్చడం, వడ్డించి , భోజనాలయ్యాక ఆ గిన్నెలన్నీ తోముకోవడం ఇలా ఎడతెరిపి లేని పని ఉండేది. వెనక్కి తిరిగి గుర్తు చేసుకుంటే ఆ ఇల్లు కూడా బంధుమిత్రుల రాక కోసం , వాళ్లు కొంతకాలం తీరుబాటుగా గడపడానికి వీలుగా కట్టినట్టు ఉండేది. ముందు పొడవాటి వరండా, మధ్యలో ఒక హాలు, వెనక విశాలమైన వంటగది , అటూ ఇటూ రెండు వసారాలు.. ఇంతే. పడక గది అనదగ్గ గదే లేదు ఆ ఇంట్లో.

పక్షుల కిలకిలా రావాల మధ్య అమ్మ చల్లే కళాపి జల్లుల శబ్దంతో మాకు మెలకువ వచ్చేది. పెద్ద పెద్ద మెలికల ముగ్గులు తీర్చి , ఆవులూ గేదెల పాలు పితికి ఇంట్లో వారందరికీ పాలూ, కాఫీలూ అందించేది. అమ్మ కలిపే కాఫీ రుచి ఎంతో బావుండేది. ముందు వరండాకి అటూ ఇటూ ఉండే అరుగుల మీద కూర్చుని ప్రభాతవేళ నలుగురితో కలిసి సేవించే ఆ కాఫీ కబుర్ల  రుచి దేనితోనూ పోల్చలేనిది. వేసవి సెలవులు వచ్చాయంటే విడతలు విడతలుగా పిల్లకాయలంతా దిగేవారు. పొద్దుటి పన్లన్నీ పూర్తిచేసుకుని హాల్లో పెద్ద పెద్ద బేసిన్లలో-- చద్దెన్నంలో కొత్తావకాయ, మాగాయ, చివరగా పెరుగన్నం కలిపి పెడుతుంటే పిల్లలందరం అమ్మ చుట్టూ కూర్చుని తినేవాళ్ళం. పెరుగన్నం లో నలుచుకుందుకు కోసిన మామిడి ముక్కలు( తోటలోవి)! ఆ సమయంలో సాగే కబుర్లూ, గిల్లికజ్జాలూ, పరిహాసాలూ, నవ్వులూ వీటికి అంతే లేదు.

బడిలో చదువుకునే రోజుల్లో ఒకసారి ఆటల్లో ఉండగా నా చెవి కమ్మ శీల ఊడి, ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఒంటికున్న బంగారం ఆ కమ్మలు మాత్రమే. స్నేహితురాళ్లంతా చుట్టూ మూగి ‘ఇంక నీ పనయిపోయినట్టే. ఇలాగే నేను పారేసుకున్నపుడు మా అమ్మ చింత బరికె పుచ్చుకుని చితక్కొట్టింది’ అంటూ ఎవరి అనుభవాలు వాళ్లు చెప్పడం మొదలు పెట్టారు. బస్సెక్కి ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇల్లు చేరేవరకూ భయపడడం, ఇల్లు చేరగానే అమ్మకి చెప్పడం, “అయ్యో ! పోయిందా? పోనీలే… కావాలని పారెయ్యం కదా. ఏం పర్వాలేదు. పోయి ఆడుకోండి” అనడం గుర్తు.

పదవ తరగతి పాసవగానే, పదిహేనేళ్లకే పెళ్ళయి అత్తగారింటికి వచ్చేసిన అమ్మ ఎక్కువగా చదువుకోలేదు. రోజంతా ఇంటి చాకిరీలోనే గడిచిపోయేది. అయినా మధ్యాహ్న భోజనాలతర్వాత దొరికే గంటా గంటన్నర సమయంలో ఏదైనా చదవని పుస్తకం ఉంటే బావుండునని వెతుక్కునేది.అమ్మ అలా శ్రద్ధగా చదివే దృశ్యం నాలో ఏదో ఉత్కంఠని రేకెత్తించేది. అలా ప్రాధమిక పాఠశాలలో ఉండగానే కనిపించిన పుస్తకాన్నల్లా వదలకుండా చదివేయడం అలవాటయింది.

ఆర్ధిక ఇబ్బందులు ఎంతగా ఉన్నా ఒకటో, రెండో వార పత్రికలు తప్పనిసరిగా పోస్ట్లో తెప్పించేవారు నాన్నగారు. ఆ పుస్తకం ఎవరు ముందు అందుకుంటే వాళ్లు చదివి ఇచ్చేదాకా మిగిలిన వాళ్లు వేచి ఉండాల్సిందే. ఒకసారి మధ్యాహ్నం వేళ పోస్ట్ లో వచ్చిన వార పత్రిక నా చేతికందింది. మరో పదినిముషాలకి అమ్మ విశ్రాంతి సమయమయింది.’ ఏదర్రా పుస్తకం?’ అంటూ అమ్మ వచ్చేసరికి శ్రద్ధగా సీరియల్ చదివేస్తున్న నేను, ‘చదివేశాక ఇస్తా’నన్నాను. వెంటనే చిన్నబోయిన మొహంతో “నీకు రోజంతా బోలెడు టైముంటుంది. నాకీ కాసేపటి తర్వాత వరసగా పనుంటుంది” అంది. ఆ మొహం , ఆ కంఠం, వెంటనే పత్రిక అమ్మకి ఇచ్చేసిన ఆ సంఘటనా ఇప్పటికీ స్పష్టంగా గుర్తుండిపోయింది.

అలాగే ఒక వేసవి రాత్రి, పిల్లలందరం అపుడే కొత్తగా కట్టిన డాబా మీద ఆట పాటల మధ్య సరదాగా గడుపుతూ పిట్టగోడ మీద నుంచి తొంగి చూస్తే వెనక పెరట్లో అమ్మ ఒక్కత్తీ బండెడు గిన్నెలు తోముతూ కనిపించడం, చిన్న పిల్ల గా నాకది సహజంగా అనిపించడం , నా వెంట ఉన్న మా పెద్దమ్మ గారి అమ్మాయి నొచ్చుకుని “దా మనిద్దరం వెళ్లి పిన్నికి సాయం చేద్దాం” అని వెంట తీసుకెళ్లడం నా మనసులో చెదరని దృశ్యంగా నిలిచిపోయింది. అమ్మా నాన్నగార్ల ఆ నిరాడంబర జీవనం, తోటి వారికి వాళ్లు అందించిన ప్రేమాప్యాయతలూ గుర్తొచ్చినపుడు గర్వంగా, వ్యవసాయ దారుల నిరంతర శ్రమకు ఫలితం లభించని వ్యవస్థ పట్ల విచారమూ కలుగుతాయి.

నేను బియెస్సీఆఖరి సంవత్సరం చదువుతుండగా  అమ్మ కాలుజారి పడి మోకాలి లిగమెంట్  దెబ్బతినడం, నడవలేని స్థితిలో మంచాన పడడం జరిగి, అప్పటి దాకా ఇంటెడు పనీ సమర్ధించుకుంటూ వచ్చిన అమ్మ ఒక్కసారిగా నిస్సహాయస్థితికి లోనైంది. బియెస్సీ పూర్తవుతూనే ఎమ్మెస్సీకి ప్రవేశ పరీక్ష రాస్తానని వెళ్లి , సీటు తెచ్చుకుని నేను హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరాను. అయితే అమ్మకి అవసరమైన సమయంలో నేను దగ్గర లేకపోయాననే ఒక బాధ మనసులో నిలిచిపోయింది. అప్పుడు నా చెల్లెలు డిగ్రీ చదువుతూ అమ్మ దగ్గరే ఉండడం వల్ల నా పై చదువు కొనసాగింది.

ఆ తర్వాత సరైన చికిత్స అందడం, అమ్మ మామూలు స్థితికి చేరడం జరిగింది గాని, మొదటి సంవత్సరం సెలవులకి ఇంటికి వచ్చిన నేను ‘డిస్క్ ప్రొలాప్స్ ‘ వల్ల తీవ్ర అస్వస్థతకి గురవడంతో నెలల తరబడి ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. అపుడు నావెంట ఉండి నాకు సేవ చేసింది అమ్మే. అంతవరకు ఆసుపత్రి ఎలా ఉంటుందో ఎరగని నాకు నెలలతరబడి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం , విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థానం కోసం కృషి చేస్తున్నపుడు చదువుకి ఇలా అంతరాయం కలగడం తీవ్రమైన ఆశాభంగాన్ని కలగ జేశాయి. చికిత్స తర్వాత మళ్ళీ చదువు కొనసాగించి కోరుకున్న విధంగా విశ్వవిద్యాలయంలో ప్రథమురాలిగా ఉత్తీర్ణత పొందినపుడు అమ్మ పొందిన ఆనందం ఇంతా అంతా కాదు.

అప్పుడే కాదు ఆ తర్వాత కూడా పిల్లల పురుళ్ళపుడూ, వారి పసితనపు అనారోగ్యాలలోనూ, నాకు సుస్తీ చేసినపుడూ నా వెంట ఉండి సాయపడింది , నాకు ఆసరా ఇచ్చిందీ అమ్మే. ఒంటి నిండా నగలతో అత్తగారింటికి వచ్చిన అమ్మకి  తన పుట్టింటికి వెళ్లినపుడు నగలేవీ లేకుండా వెళ్లడం నామోషీగా ఉండేది. పంటలు బాగా పండి,  చేతి నిండా గాజులు వేసుకోగలగాలని కోరుకునేది. నా మొదటి పెయింటింగ్ అమ్మకమైనపుడు ఆ డబ్బుతో అమ్మకి నాలుగు బంగారు గాజులు కొనివ్వడం నాకొక మధుర స్మృతి. ఇప్పటికీ పిల్లలెవరి దగ్గరున్నా ఏదో ఒక పని అందుకుంటూ, సగంలో ఏపనైనా ఆగిపోయి కనిపిస్తే నిశ్శబ్దంగా ఆ పని పూర్తి చేసేస్తూ, మనవల్ని ఆదరిస్తూ, నిండు గోదారిలా సాగిపోయే అమ్మ నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు నేల మీద ఉదయించిన దేవతే.

వారణాసి నాగలక్ష్మి(ప్రముఖ రచయిత్రి).