(తల్లి) ప్రేమంటే

|| (తల్లి) ప్రేమంటే ? || గుక్క పెట్టి ఏడ్చే బిడ్డను అక్కున జేర్చుకొనే తల్లి కంట్లోని నీటి పొర చెబుతుంది వందమందిలో ఉన్నా ఆకలితో అల్లాడే పసి పాపకు చిరుగుల చీర కప్పి స్తన్యమందిస్తూ ఆ తల్లి మరిచే సిగ్గు చెబుతుంది మండువేసవిలో ఆటలకి పరుగులెత్తే పిల్లడి జేబులో తల్లి ఉంచే ఉల్లి చెబుతుంది తడిసి వచ్చిన బిడ్డడి తల తుడిచి గుండెలపై తల్లి వ్రాసే విక్స్ వాసన చెబుతుంది బిడ్డకు సూదిమందు వేస్తుంటే బాధతో విలవిలలాడుతూ ఆ తల్లి మూసుకొనే కన్ను చెబుతుంది గడగడలాడించే చలిలో బిడ్డ పాదాల వేళ్ళపై కంబళి సరిచేసే అమ్మ వేళ్ళ వణుకు చెబుతుంది తల్లికి తలకొరివి పెట్టేందుకు నిప్పుకట్టె పట్టుకొనే బిడ్డ చేయి ఎక్కడ కాలుతుందో? అని మూసిన కన్నుల చాటున ఆందోళన పడే నిర్జీవ నేత్రాలను అడిగితే  చెబుతుంది        రచన - ఆర్.వి.యస్.యస్. శ్రీనివాస్ rvsssrinivas666@gmail.com

మేడే నాటి ముభారకులు

మేడే నాటి ముభారకులు నాగలి పట్టే నాగన్న రెక్కలు తెగిన రైతన్న సమ్మెట పట్టే సూరన్న సన్నాయి మేళం సంగన్న మీసం మెలిలో  మగ్గిపోతున్న మంగలి సత్తెన్న మురికి బట్టలు చుట్టి మూటను కట్టే చాకలి చిమ్మన్న రెక్కలు ముక్కలు చేసి రంగుల చీరలు నేసే దేవాంగి దానయ్య కండలు కరిగించే కంసాలి కామయ్య కంపును ఇంపుగా మోసే పాకీ పాపమ్మ కావడి కుండలు మోసే కుమ్మరి కూనయ్య బుగ్గిలో మగ్గి బుట్టలు తట్టలు అల్లే మేదరి ముసలయ్య బుగ్గలు బుగ్గి అయ్యేదాకా శంకం ఊదే జంగాల సాంబయ్య ఆకాశం నుండి అమృతం దించి ఆగమైపొతున్న గౌన్ల గురయ్య అప్పడాలు అద్ది అంగట్లో అమ్మే కోమటోల కనకమ్మ డప్పులుకొట్టి  దండోరా  వేసే మాలోల ముత్తయ్య చెమటలు పట్టి చెప్పులు కుట్టే మాదిగ మల్లయ్య చెత్తను చెరిపేసి చిత్రం గీసేసిన శుబ్బరాలు చుక్కమ్మ  నెత్తుటి చుక్కలు చిమ్మి బండలు పిండి చేసే పటానయ్య మండే ఎండలతో ఎండే గుండెలతో కాయా కష్టంతో వచ్చిన నష్టంతో కనుమరుగౌతున్న కార్మిక  కర్తలకు కాలే కడుపులకు కర్షక జీవులకు మేడే  నాటి ముభారకులు                                                                 మీగడ త్రినాధ రావు

ఏయ్! నన్ను మన్నించవూ...

ఏయ్! నన్ను మన్నించవూ... పద్మా శ్రీరాం మది చివుక్కుమన్న ప్రతిసారీ నువ్ గుర్తొస్తావ్ మెల్లగా తలనిమిరే నీ చల్లని స్పర్శ గుర్తొస్తుంది నువ్వేమైనా సాధించగలవురా ... అనే నీ తోడ్పాటు గుర్తొస్తుంది పోన్లే వదిలేయ్ చిన్నారీ ఎక్కువ ఆలోచించకురా నీలాంటి మంచినేస్తాన్ని వదులుకోవడం వాళ్ళ ఖర్మ బంగారూ. నువ్ వజ్రానివిరా అన్న నీ నమ్మకం గుర్తొస్తుంది... కానీ నేను నిన్ను గాయపరిచిన క్షణాలు మాత్రం ఎప్పుడూ గుర్తురావ్ అదేం ఖర్మమో  అన్నిసార్లూ నవ్వుకుని మరలా నన్ను చేరదీసిన నువ్వు  ఇప్పుడు మాత్రం నన్నిలా ఒంటరిని చేసి అలిగి దూరం పోయావేమిరా? నా కంటి చినుకై అన్ని వేళలా తోడున్న నువ్వు దూరమైతే నేనేమవాలి? అదేంటో మరి నా కంటికునుకూ నీకు తోడయ్యింది. కనులకమలాలు పత్తికాయలయినా మనసు నాకు అత్తిపత్తయింది.... నువు రావా....నీ చెలిమిలో ఉన్న లోకం నాక్కావాలి కానీ నీ బంగారానికింకేం వద్దు. ఏయ్ ! నా చిన్నారి నేస్తమా! రావా మరోమారు….

అందాల ఇంతి - అవనికే చామంతి

అందాల ఇంతి - అవనికే చామంతి పద్మా శ్రీరాం  మనసుకొమ్మ భారమైనప్పుడు వసంతకోయిలవై వచ్చి కలతల చిగుళ్ళు మేసి యద బరువు తీరుస్తావు కనురెప్పల మైదానాలపై కలల విత్తనాలు జల్లి కమ్మని నిద్దురను పంటగా ఇస్తావు ఓటమితో కృంగిపోయి ఉన్నవేళ ఓదార్పునిచ్చి ఆలంబనవై నిలిచి అలవోకగా అద్భుతాలు సాధించే పోరాట పటిమనిస్తావు ఆకలైనవేళ అన్నమౌతావు ఆవేదనలో ఆప్తమౌతావు అలసినవేళ అనురాగమౌతావు ఆరాటాలవేళ అందమౌతావు చివరకు నీకు మాత్రం నీవు శూన్యమౌతావు ఇంతకు మించి నీగురించి ఏమి చెప్పగలమే ఓ మహిళా ! ఇలలోని కళా ! నిను వర్ణింప శ్రీ"నాధుడికి" సైతం సశేషమే ఓ లేమల్లీ !ఎందుకంటే బ్రహ్మ సృష్టికే నీవొక విశేషమే ఓ చిట్టి తల్లీ అమాశ కూడని సామాజిక జాబిల్లీ!

ఆలోచించరూ

ఆలోచించరూ ... చిల్లర భవానీదేవి   ఇంక తెగిన ఈ దారం కోసలతో రెండు దృవాలను నా లేత చేతులతో ముడి వేయలేను యుద్దాలు దేశాలమధ్యే కాదు గడప లోపల మౌనాయుధాలతో కూడా జరుగుతుంటాయి   ఎడమొహం పెడ మొహాల మధ్య ఏకాకి నావ నా బతుకు వాదంవాదాల మధ్య మూసినా పుస్తకం నా బాల్యం   కలహాల కన్నీళ్ళ మధ్య కోర్టు నిర్ణయం నా కస్టడీ జన్మ నిచ్చిన ఇద్దరిలో ఒక కన్నే నేనిప్పుడు ఎంచుకోవాల్సింది!   మనసును వరించే నల్లకోట్ల కధనాలే అన్నీ! పోరుని పెంచే పగముసుగుల పావులే అన్నీ! ఇందరి కళ్ళలో జాలి నాకోసమేనా....? అందరి హేళనా తిరస్కారాలు నాకు బహుమానాలా?   పోరును ప్రోది చేసే నల్లకోట్ల తోడేళ్ళ హాసాలలో భావి చూపుల రెక్కలు విరిగిన పసిపావురాన్ని జీవితకాలంపాటు పగుళ్ళ లేబుల్ ను అతికే అమ్మానాన్నల్లారా ఒక్కక్షణం నా గురించి నిజం గా ఆలోచించారా?!

సిటీబస్ బాబూ సిటీ బస్

సిటీబస్ బాబూ సిటీ బస్.... భాగ్యనగరం ...అన్నిటా బంగారు నగరం స్త్రీల పయనాలకు మాత్రం దౌర్భాగ్యనగరం గమ్యమెంత దగ్గరైనా తప్పనిసరి తగలాటం పడుతూ లేస్తూ పరుగులెత్తించే బస్సు ల ఇరకాటం బ్రతుకు తెరువుకై ఉపాధి తలచి గూడును విడిచి అలసట మరచి ఆదరాబాదరా పరుగెత్తుకొచ్చి బస్సులెక్కే మహిళామణులూ... చంటిపిల్లల్ని చంకనేసుకుని ఒంటి కాలిపై నిలబడుతుండే చిట్టితల్లులు చోటు చేసుకుంటూ తాకిడిలిచ్చే తాతలూ ఏమెరుగనట్లు చేతులేస్తుండే నడివయసు రోతలూ తాకిన చేతిని కాల్చేయాలనున్నా ఏం చేయలేని నిస్సహాయతలో చూపులతో హద్దులు దిద్దే వయసు హరిణలూ కల్ళ నీళ్ళతో పక్కకు తొలగే ఇల్లాళ్ళూ థూ...లెక్కెట్టేందుకు ఏళ్ళొచ్చిన ఎదవల మూక ఏడ చెలీ చెల్లీ మనకు భద్రతనిచ్చే కేక స్వాతంత్ర్య భారతీ... ఏమిటి తల్లీ నీ బిడ్డలకీ దుర్గతీ..... పద్మా శ్రీరామ్...

మార్పుకు నాంది మహిళ

మార్పుకు నాంది మహిళ అప్పడు భారత దేశంలో భార్యగా త్యాగం, తల్లిగా అనురాగం, ఆడ జన్మ పవిత్రం, అయినా తప్పలేదు కష్టాలు, ****************************** వరకట్నానికి బలికాకుండా, కిరోసేన్ అగ్నికి ఆహుతి కాకుండా, ఫ్యాను కడ్డీలను ఆశ్రయించకుండా, బతికేదెలా అని భయపడ్డది ఆడ బ్రతుకు . ************************************ ఇప్పుడు ఆసిడ్ దాడులతో, ప్రేమపిచ్చి ఆవేశాలతో, కామ పిశాచుల కోరికలతో, రాజధాని నడి బొడ్డున పరాభావింప బడ్డాక, వూరుకోకు మహిళా ఎందుకంటే శిక్షలు ప్రభుత్వానివే అయినా క్రమశిక్షణ ఎప్పుడూ తల్లిదే. ********************************* ప్రేమా అనురాగాలూ అణుబాంబు కన్నా శక్తిమంతాలు. అనురాగ మూర్తిగా చేతన కలిగించు అపర శక్తివై చైతన్యం తెప్పించు, ఇది చెయ్యగలిగేది ఒక్క ఆడదే , అత్యంత శక్తి స్వరూపిణి ఆడది, అబల కాదు సబల అని నిరూపించేది సంఘం లో మార్పుకు పునాది వేసేది మహిళే ! రచన- లక్ష్మి రాఘవ 

మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ

మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ   మనిషి పుట్టిన నాడు తిరిగి గిట్టిన నాడు ఏడుపే ఎదురౌను మనసా! మధ్యలో కలిగేటి భోగభాగ్యలన్ని మిధ్యమే మరి నీకు తెలుసా?   పైస గలవాడేను నిలబడేందుకు వీలు 'ప్రజాస్వామ్యం' ఇదే మనసా! లక్షలను భక్షించు ఈ ఎలక్షన్లన్ని లాభ రహితమ్మేను తెలుసా?   ఉన్నవానికె విలువ ఉన్న దేశమ్ములో ఉండలేడిక పేద మనసా! 'గరీబీ హటావ'ని గర్జించి నంతనే గట్టెక్కలేమనియు తెలుసా?   దినదినం ఈనాడు విద్యార్ధి బ్రతుకంత 'డిగ్రీ' ల మయమాయె మనసా! పై చదువు లెన్నున్న 'పైరవీ' లేనిదే ఫలితమ్ము శూన్యమ్ము తెలుసా?   "హాప్పీ" ల పేరుతో కుప్పిగంతులు వేసి ఇది నాగరికతనిరి మనసా! జుట్టు నడవిగ పెంచునట్టి నాగరికతయు ఆది మానవునిదే తెలుసా?     'స్ట్రీకింగ్' పేరుతో నగ్న నాట్యం నేడు సిసలైన 'ఫ్యాషనట' మనసా! మెల్లమెల్లగ మనిషి నవనాగరికతనుచు వెళ్ళేది వెనుకకే తెలుసా?    

మెరీనాబీచ్ - డాక్టర్ మణిగోపాల్

మెరీనాబీచ్ - డాక్టర్ మణిగోపాల్   కవిత్వం లేని ఊరు అక్షరాలు వలసపోతాయి కలని చిత్రించే కలాలు ఇంకిపోతాయి   కవిత్వం లేని ఊళ్ళో అమ్మకూడా పదినెలలు నిన్ను మోసిన కూలీయే! అక్కడ 'రక్తసంబంధం' సినిమా ఆడదు పువ్వులు కొమ్మలకే పూస్తాయి పెదాల మీద కాదు చందమామ నింగిలో ఉంటుంది  అమ్మాయి మోములో కాదు పక్షులు కేవలం చెట్లని కాపలా కాస్తున్న సెక్యూరిటీ గార్డులు మాత్రమే!   కవిత్వం లేని ఊళ్ళో రెప్పల్లోంచి ఉబుకుతున్న చూపులకి ఇంద్రధనుస్సొక రంగుల మరక! వాన పడినా ఈ నేలకి కాగితం పడవలు పుట్టవు ఆఫీసుకెళ్ళే సమయంలో చినుకు వెంట చినుకు మహా చిరాకు! కోకిల మాత్రం ఏం చేస్తుంది? అది కూడా కాపీ ట్యూనే అందుకొంటుంది   కంటిపాపని కలల ఊయల్లో వేస్తేనే కదా... కవిత్వానికి బాలసారె! నిత్యం కరెన్సీని లెక్కించే వేళ్ళకి అక్షరాల స్పర్శేం తెలుస్తుంది? అసలు కవిత్వమే లేని ఊరు ఒక ప్రవహించని సెలయేరు ఎప్పుడైనా గుండెలోకి తొంగిచూసుకుంటే కదా.... ఆ పొడి కళ్ళకి కలల తడి అంటేది!   ఉగాదుల్లేని కాలండరుకు అంకెల గారడీ తప్ప అక్షరాల మహిమేం తెలుసు? ఉద్యమల్లేక ఉసూరనే ఊరు ముప్పిరిగోనే నినాదాలేం చేస్తుంది?   కవిత్వం లేని ఊరు పసిపాపలు లేని లోగిలి కవిత్వం లేని ఊరు పసుపు రాయని ఇంటి గడప   అందుకే..... కవిత్వాన్ని గొంతెత్తి పిలువ్! కురుల్ని నిచ్చెనలా చేసుకుని ఒక్కో పువ్వూ అమ్మాయి సిగలోకి చేరుతుంటే కవిత్వం తన్నుకురాదూ?   పత్రిక తిరగేస్కుంటే ఓ మూల రేకులు విప్పుకుని అక్షరాల పుప్పొడితో గుబాళిస్తున్న కవిత్వమొకటి తొంగిచూస్తుంటుంది ఒకే ఒక్క నిమిషం నీ పెదాల మీద ఆ పంకుల్ని కదలాడనీ ప్రత్యక్షరాన్నీ తనివితీరా ఉచ్చరించు   నువ్వెక్కడో జారవిడుచుకు ఓ జ్ఞాపకం ఎదురవట్లేదూ మరిచిపోయిన చిరునవ్వులు మళ్ళీ నిన్ను పలకరించట్లేదూ?   రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా గాయపడ్డ మనసుకి మందు రాస్తున్నట్టుగా లేదూ? కవిత్వం ఎక్కడో లేదు.... ప్రేమించే గుండెలో ఉంది ఎన్ని యాతనలు పడ్డా ఫలించని ప్రేమలో ఉంది మిత్రునికి వీడ్కోలు పలుకుతూ వెనుదిరిగిన నీ పాదాల్లో ఉంది   పద.... ఈ ఊరిని కవిత్వంగా మార్చేద్దాం ఈ దారి పొడవునా మనం అక్షర పతాకల్ని ఎగురవేస్తూ నడుద్దాం!    

మెరీనాబీచ్ - డాక్టర్ మణిగోపాల

మెరీనాబీచ్ - డాక్టర్ మణిగోపాల   మొబైల్ పక్షులు నగరం నిండా పక్షులు ఒక్కో కువకువనీ చిదుగులా ఏరుకొచ్చి మాటల గూడు కట్టుకున్న పక్షులు హలో రాగాల హంసధ్వనుల నుంచి బైబై ముక్తాయింపుల ఆనందభైరవులు!   ఉదయం నేర్చిన మెలకువల్లోంచి ఉరుకుల తీసే జీవితాన్ని మాటల గారడీతో మలుపు తిప్పే పక్షులు తలకిందులుగా తపస్సు చేసే గబ్బిలాల్లా బెల్టు కొమ్మలకు వేలాడేవి కొన్ని! చొక్కా జేబుల్లో వాలి మన గుండె చప్పుళ్ళు వినేవి కొన్ని! ఈ పక్షులు నగరంలోకి వలసొచ్చాక కరచాలన స్పర్శ ఎలా ఉంటుందో మర్చిపోయాం!   సాయంకాలాలు చెరిసగమై టీ కప్పులు ఇప్పుడెక్కడా కనిపించవు. ఎదురింట గుమ్మమే అయినా.... ఎన్నాళ్లవుతోందో ఎదురుపడి! నెంబరు నొక్కితే చాలు..... రెడీమేడ్ కబుర్లు సిద్ధం! ఇన్ కమింగ్ స్వప్నాలు ఫ్రీ!   కర్ణుడు కవచకుండలాతో పుట్టినట్లు మనతోపాటు ఇవీ పురుడోసుకుంటాయి ఏ రాగంలో కావాలంటే ఆ రాగంలో మేల్కొలుపుతాయి రోడ్డు పక్కగా నడుస్తున్న వాళ్లం ఒక్కసారిగా రిమోట్ నొక్కినట్టు ఆగిపోతాం జేబుగూటిలోంచి జేగంటల రొద నగరంలో ఉన్నా నల్లపూసైపోయిన మిత్రుని గొంతులో తడిలేని పలకరింపు!   బిజీ షెడ్యూళ్ళని వల్లెవేసుకునే బడాయి మాటల బాతాఖానీ!   లక్షలాది అడుగుల నడుమ ఒంటరి పక్షిలా తిరుగుతుంటాం మనకు తోడుగా చెవికీ చేతికీ నడుమ రెక్కలు విప్పుకొనే మొభైల్ పక్షులు సాయంకాలమైనా గూటికి చేరవు   మన మిత్రుణ్ణి మనకు కాకుండా చేశాయివి   మన కలయికల్ని మాటలతో సరిపుచ్చేశాయివి   మాటల్ని అరచేతిలో పెట్టి మన నోళ్ళు నొక్కేశాయివి   ప్రపంచాన్ని చేరువగా తెచ్చి మన ప్రయాణాల్ని ఆపేశాయివి   ఇప్పుడు తెల్ల కాగితాల మీద అక్షరాల అలికిడి లేదు!    

మనస్సు - మురళీ

మనస్సు - మురళీ   కలల అలల-కడలి నీవు ఆశనిరాశల-పడవనీవు ఆనందాల-ఆర్జవమీవు విషాదాల-నిశీధినీవు వివాదాల-మసీదు నీవు ఆలోచనల-అంబుధినీవు అభ్యుదయపు-వారధినీవు అనంతభావాల-సాగరమీవు అనుభవాల-ఆకలినీవు ఆవేశాల-కేకవి నీవు స్నేహానికి-ప్రాణంనీవు ప్రేమకు-ప్రతిరూపంనీవు అనురాగపు-బానిసనీవు పగకోసం-వగచేవీవు అద్భుతాల-ఆమని నీవు నీవే నా జీవన-తొలి ఉషన్సు నీ కోసమే- నా ఈ తపస్సు నువ్వదుపులో ఉంటే-మోదం అదుపుతప్పితే-ఖేదం ఇన్ని రూపాలున్న ఓ నా మనస్సూ-నీకో నమస్సూ   తొలివలపు   తలపుల వీణియపై-వలపుల తేనేలూరగా ఆ మధువుల మధువనిలో-సుధలొలికే సింధువుగా నాజీవన అమనిలలో-సమ్మోహన కామినివై నా ఆశల సుమవనంలో - కుసుమంలా విరబూయగ రావా ఓ నా చెలియా-ప్రేమ బాసలే చేయ మదిలో-సవ్వడిగా-నెమ్మదిగా హరివిల్లులా-చిరుజల్లులా-సిరిమల్లెలా తొలి ప్రేమలో-తడబాటులా-సరిబాటలా యెద పొంగగా-మనసూగగా-మూగగా ప్రశాంత కాంతి-యామినిలో అనంత శాంతి-కౌముదిలా వాలే ఆ నయనాలు-అదిరే ఆ అధరాలు తెలుపకనే తెలిపెనులే-తొలి వలపు ప్రేమనే