మీ శాంతిని భగ్నంచేస్తాం!

మీ శాంతిని భగ్నంచేస్తాం     అనురాగం అంబరమైతే ఆనందం అర్ణవమైతే మేం తోకచుక్కగా వస్తాం బడబానలమై మండిస్తాం ప్రపంచమొక నందనవనమై జీవితమొక గులాబి ఐతే మేం ముళ్ళతొడుగుగా ఉంటాం సుఖస్వప్నం భంగపరుస్తాం ఈ జీవిత కేళి గృహంలో సుఖమే ఒక విరిపాన్పైతే మేం కాలసర్పమై వస్తాం విషజ్వాలల ధార విడుస్తాం మీ నిద్రాసుఖసమయంలో స్వాప్నిక ప్రశాంతి నిలయంలో మేం పీడకలలుగా వస్తాం రౌరవదృశ్యం చూపిస్తాం మీ ప్రణయోత్సుక మధుగీతం మీనృత్యమత్త సంగీతం మీకటుక్షుధారోదనంలో ముంచేస్తామొక్క క్షణంలో మీ హేమాసన పాత్రల్లో మీ స్వప్నజగతి యాత్రల్లో మా అశృధార నింపేస్తాం మీబాటను జారుడు చేస్తాం. పానకపు పుడకగా వస్తాం టీకప్‌లో ఈగైచస్తాం మా ప్రాణాలైనా విడుస్తాం మీ శాంతిని భగ్నంచేస్తాం. (ప్రముఖ కవి బైరాగి రాసిన చీకటినీడలు కవితాసంపుటంలోంచి)  

చాలా రోజుల తర్వాత వర్షంలో తడిశా

చాలా రోజుల తర్వాత వర్షంలో తడిశా   చాలా రోజుల తర్వాత వర్షంలో తడిశా... వర్షంలో నడిచా... వర్షాన్ని అనుభవించా... వర్షాన్ని అనుభూతి చెందా... ప్రవాహ వర్షానికి పాదాలు ఎదురీదుతూ ముద్దాడాయి. చినుకులు పువ్వలై నేల తల్లిని అభిషేకించాయి. పారే జలపాతంలో మనసు మునకలైంది. పడే ప్రతి చినుకు పారే జలంలో సరికొత్త మొలకై చిగురించింది చినుకు చుట్టూ చినకు, చినుకు పక్కన చినుకు... చినుకు ముందు చినుకు.. చినుకు వెనక చినుకు.. నేల ఒడినిండా చినుకు రెక్కలు విప్పిన రత్నాలే... అనుబంధాల అల్లికలతో తడిసిన మాలలా ఆ ప్రవాహం నేలపైనే కాదు... నాలో కూడా... విచ్చిన రోజాకింద ఐస్ క్రీమ్ తింటున్న అమ్మాయి వాసన ముద్దై ముద్దుల కోసం ఆరాటపడే ప్రేమికుల తడిఆరని మాటల ఉత్సాహం. ఉరుకులు పరుగుల మధ్య చల్లటి గాలులు నిట్టూర్పుల ఎదలు వాహనాల చిందుల్లో చినుకుల అల్లరి బాసలు. బస్టాపుల నిండా భరోసా కోసం ఎదురు చూపులే... లే ఎండ గుండెలతో... తీగల మధ్య కన్నుల్లో పలకిరంచే అందమైన కన్నెల శారీరక పలకరింపులు.       బస్సులో నేను... నాలో కదిలే మనషులు... వెరసి... ఆఫీసుకు అర్థగంట ఆలశ్యం.. అయినా ఫర్వాలేదులే... నేస్తం నులివెచ్చని హృదిలో వెన్నెల్లా వెలిగావు. కలతల మధ్య ఎద వీణ మీటావు. చాలు... చాలదు... మనసు మాట వినదు కదా... ఆశ ఆగదు కదా... అందుకే.... పరుగు పెడుతున్న ప్రపంచాన్ని పలకరించిన వానా... నీకు.. ఇదే... ఓ నమస్సుమాంజలి.  ఎ. రవీంద్రబాబు

శ్రమికజాతి

శ్రమికజాతి!     తర తరాల దరిద్రాల బరువులతో కరువులతో క్రుంగి క్రుంగి కుమిలి కుమిలి కష్టాలకు నష్టాలకు ఖైదులకూ కాల్పులకూ సహనంతో శాంతంతో బలిపశువై తలవాల్చిన దీన పరాధీనజాతి శ్రమికజాతి దెబ్బతిన్న బెబ్బులివలె మేల్కొన్నది మేల్కొన్నది. విశ్వవిపణి వీథుల్లో చావు చాల చవకైనది బ్రతుకుకు బ్లాక్‌మార్కెట్‌ధర. వ్యాపారులు ప్రపంచాన్ని తుంచుకొని పంచుకొని పరిపాలిస్తున్నారు. రైతు కూలి ప్రజ లంతా ధనికుల పాదాల క్రింద చీమలవలె చితికినారు. శ్రమజీవుల రక్తధార జలంకన్న పలచనైంది. పరతంత్రత దరిద్రత గిరులవోలె పెరిగినాయి. శాంతానికి సహనానికి దహనక్రియ జరిగింది. చెలియలి కట్టలు దాటిన ప్రళయకాల జలధి వోలె తిరుగుబాటు పరచుకుంది. విశ్వ రుద్ర ఫాలంలో విప్లవాక్షి విరిసింది. పరతంత్ర ప్రజాకోటి ప్రళయవృష్టి కురిసింది. స్వాతంత్ర్యోద్యమ శంఖం దిగంతాల మొరసింది. పొగులుతున్న భూగర్భం -- పగులనున్న జ్వాలాముఖి -- చిచ్చంటిన స్నిగ్ధాటవి -- పిడుగు లురలు పెను మేఘం -- హరగళగత హలాహలం శ్రమికజాతి కదిలింది. ప్రజాద్రోహి వర్గానికి లయకాళిక శ్రమికజాతి -- జగద్విప్లవ గళంలో జయమాలిక శ్రమికజాతి -- మేల్కొన్నది మేల్కొన్నది (దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార కవితాసంపుటిలోంచి) - నిర్జర.

తిట్టు కవిత్వం

తిట్టు కవిత్వం   మనసులో ఉన్న భావాలను కాస్త సృజనాత్మకంగా వెలువరించే ప్రయత్నమే కవిత్వం. అందుకనే కవిత్వ వస్తువుకి కానీ, కవిత్వ భాషకి కానీ పరిధులు ఉండవు. కాదేదీ కవితకనర్హం అంటూ శ్రీశ్రీ సెలవిచ్చినా, జంధ్యాల తన సినిమాలో తిట్లతోనే ఓ పాటని పెట్టినా చెల్లిపోయింది. అలా వైవిధ్యభరితంగా సాగే కవిత్వంలో ‘తిట్టు కవిత్వం’ కూడా ఓ భాగమే. దాని చరిత్రా పురాతనమే! తెలుగులో తిట్టు కవిత్వానికి వేములవాడ భీమకవి నాంది వేశాడని చెబుతారు. ఇతను ఆదికవి నన్నయ్య సమకాలీకుడు కాబట్టి, తెలుగు కవిత్వం మొదలైనప్పటి నుంచే అందులో తిట్లు కూడా వచ్చేశాయని చెప్పుకోవచ్చు. భీమకవి తర్వాత వచ్చిన శ్రీనాధుడు తిట్టిన తిట్లు మనకి తెలిసినవే! ఒకానొక సందర్భంలో తనకి తాగేందుకు నీరు దొరకకపోవడంతో ఏకంగా ఆ శివుడినే తిట్టిపోశాడు శ్రీనాధుడు. బైరాగివైన నీకు ఇద్దరు భార్యలు ఎందుకు, నీ తలపై ఉన్న గంగను నాకు విడువు అంటూ ఆడిపోశాడు (సిరిగల వానికి జెల్లును/ దరుణుల పదియారు వేల దగ బెండ్లాడన్/ దిరిపెమున కిద్ద రాండ్రా/ పరమేశా గంగ విడుము పార్వతి చాలున్). కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా పేరొందిన కందుకూరి రుద్రకవి కూడా తిట్టు కవిత్వంలో ప్రసిద్ధుడే. కందుకూరి రుద్రకవి రాయలవారిని కలుసుకోవాలని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదట. మంత్రులెవ్వరూ కూడా ఆయనకు సాయపడలేదయ్యే! చివరికి కొండోజి అనే క్షురకుని సాయంతో ఆయన రాయలవారి సమక్షానికి చేరుకున్నాడు. ఆ సందర్భంగా రుద్దరకవి- ‘ఎంగిలి ముచ్చు గులాములు/ సంగతిగా గులము జెరుప జనుదెంచిరయా/ ఇంగిత మెరిగిన ఘనడీ/ మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్’ అంటూ మంత్రులను నానాతిట్లూ తిట్టాడు. రాయలవారి ఆస్థానంలో ఉన్న మరో మహాకవి తెనాలి రామకృష్ణుని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిందే! హాస్యానికి మారుపేరుగా, ఆ హాస్యం పండించే హడావుడిలో ఒకోసారి అపహాస్యాన్ని కూడా పండించేవాడుగా రామకృష్ణునికి పెట్టింది పేరు. అతన్ని అభాసుపాలు చేయాలని కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్’ అనే పూరణాన్ని అందిస్తారు. దానికి బదులుగా రామకృష్ణ కవి తిట్టిన తిట్లు వెండితెర మీద కూడా వినవచ్చు. ఏదో నోటి నుంచి ఆశువుగా వెలువడిన కవిత్వంలో తిట్లు కలిశాయంటే అనుకోవచ్చు. మన శతకాలలో కూడా కావల్సినన్ని తిట్లు కనిపిస్తాయి. కొరగాని కొడుకుల దగ్గర నుంచీ, అక్కరకు రాని చుట్టాల వరకూ ఈ శతకాలలో అందరికీ తలాకాస్త వడ్డనా ఉన్నట్లు తోస్తుంది. ఇక తిట్లూ బూతులే వస్తువులతోనే కవితలు రాసిన చౌడప్ప వంటి వారల గురించైతే చెప్పనే అక్కర్లేదు. మెచ్చుకోలైనా, తిట్టయినా అది ఒక హద్దు దాటనంతవరకూ... ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ప్రయోగించవచ్చు. అందుకే ‘నిందాస్తుతి’ పేరుతో కీర్తనలలో సైతం ఈ తిట్లు కనిపిస్తాయి. ఎవరో దాకా ఎందుకు దీనికి మన రామదాసు కీర్తనలే ఉదాహరణ. ‘సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా/ ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా’ అని తన ఖర్చుల జాబితాని చదివి ‘నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా’ అంటూ ఆడిపోసుకుంటాడు. జీవితం పెట్టే బాధల్ని ఓర్చుకోలేక ఒకోసారి దేవుడిని కూడా తిట్టాల్సి వస్తుంది మరి! ఇక మామూలు కవిత్వంలో తిట్లు ఉండకూడదంటే ఎలా సాధ్యం! - నిర్జర.  

నైనం ఛిన్దన్తి శస్త్రాణి

నైనం ఛిన్దన్తి శస్త్రాణి     తెల్లకాగితాల్లో ఇంకు.. ఉండలు చుట్టిన జీవితాన్ని  రోజొకింత ఒంపుకోవటం చూశావా?  ఏముందా రాతల్లో!?  తలగడల సాక్ష్యాలైన తడి ఆరని గాథలో  ఫాంటస్సీలై మెరిసిన విబ్జియార్ రంగుల కలలో కటిక చీకట్లేనాడు కలగనని గతపు పొదలో  ఒక నవ్వు భళ్ళున పగిలిన శబ్ధం  హయ్యో! ఒట్టి పనికిమాలిన ఘోష ఇది అని  ఎన్నెన్ని నిశీధులు వెర్రిగా చూసెళ్ళిపోయాయో మరి! గగనవియత్శూన్యాలకు పయనించే ఓ మనిషీ!  ఎన్నెన్ని చూస్తావో ఈ లోకంలో  కానీ నువ్వివాళ పోతే రేపటికి రెండట!  ఎంతెంత వేదాంతం..  నువ్వు విరబూసినా విలపించినా చీలిపోని ఆత్మకి  ఏ సంఖ్యాశాస్త్రాలతో లెక్కలు అప్పజెప్పగలవు మరి!  ఒట్టి వృథాప్రయాసే కదూ!  ఆత్మను ఏ ఆయుధం చీల్చలేదు.. అవును  నైనం ఛిన్దన్తి శస్త్రాణి  నైనం దహతి పావకః   - సరిత భూపతి 

నిజాంను ఎదుర్కొన్న కవిత – పదే పదే అనేస్తా!

  నిజాంను ఎదుర్కొన్న కవిత – పదే పదే అనేస్తా!     ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను.   ఖదం తొక్కి పదం పాడి ఇదేమాట అనేస్తాను.   ఎదల్లోన, రొదల్లోన సొదల్లోన, గదుల్లోన ఇదే మాట ఇదేమాట పదే పదే అనేస్తాను.   జగత్తంత రగుల్కొన్న కృథాజ్వాల వృథాపోదు. అడుగడుగున యెడదనెత్రు గడగడ మని త్రాగినావు.   పడతుల మానాలు దోచి గుడగుడ మని 'హుక్క' త్రాగి జడియక కూర్చుండినావు మడికట్టుక నిలిచినావు.   దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు.   పూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి ఇళ్ళన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపుగొట్టి నిక్కిన దుర్మార్గమంత నీ బాధ్యత నీ బాధ్యత.   'కోటిన్నర' నోటివెంట పాటలుగా మాటలుగా దిగిపొమ్మని దిగిపొమ్మని ఇదేమాట అనేస్తాను.   వద్దంటే గద్దె యెక్కు పెద్దరికం చేస్తావా! మూడుకోట్ల చేతులు నీ మేడను పడతోస్తాయి మెడనే విడతీస్తాయి.   నీకు నిలుచు హక్కు లేదు నీ కింకా దిక్కు లేదు.   చరిత్ర బొంగరం తిరిగి కిరీటాలు నేల కొరిగి ధరాధిపులు నశిస్తుంటే బరాయెనాం నవాబా! పరాక్రమం చూపేవా? 'దిగి పొ'మ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది.   "దిగిపోవోయ్‌ తెగిపోవోయ్‌ తెగిపోవోయ్‌ దిగిపోవోయ్‌" ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను. - దాశరథి కృష్ణమాచార్య. (నిజాం అరాచకాలను నిలదీస్తూ, విప్లవాన్ని నినదిస్తూ దాశరథి కృష్ణమాచార్యా రాసిన ‘అగ్నిధార’ సంకలనంలోనిదీ కవిత. అప్పటికీ ఇప్పటికీ పాలకుల అరాచకాన్ని ఎదిరించేందుకు తోడుగా నిలిచే విప్లవ గీతమిది!)   - నిర్జర

ఉగాది స్పెషల్ కవిత

ఉగాది     సంస్కృతి, సంప్ర‌దాయం సంద‌డిచేసేలా.. పసుపు, కుంకుమ ప‌ల్ల‌వి పాడిన శుభ‌వేళ‌.. ప్ర‌తి కొమ్మ పువ్వుల‌తో స్వాగ‌తమిస్తుంటే.. ప్ర‌తిపువ్వు ప‌రిమ‌ళంతో పుల‌క‌రిస్తుంటే.. తెలుగునేల వైభ‌వం వెలిగేలా.. తెలుగుభాష తియ్య‌ద‌నం తెలిసేలా.. వేకుజామునే వెన్నెల్లా వ‌చ్చేసింది ఉగాది! తెలుగువారి ష‌డ్రుచుల సంతోషాల సార‌ధి! ప్ర‌తి మనసు మావిచిగురులా అల్లుకుంటే.. ప్ర‌తి చిగురు చిరునువ్వులా పూస్తుంటే.. అంతులేని ఆనందాల హేల‌.. అంద‌రి క‌ళ్ల‌ల్లో మెరిసిన‌ వేళ‌.. పొలిమేర నుంచి పూజ‌గ‌ది వరకు పండ‌గ‌తెస్తుంది! గుడి నుంచి గుండెల వ‌ర‌కు సంబ‌ర‌మిస్తుంది! ఊపిరికి ఉర‌కలువేసే  ఉత్సాహాన్నిస్తుంది! ఊహ‌లకు స‌రికొత్త ఊపిరినిస్తుంది.. ఉగాది! తెలుగువారి ష‌డ్రుచుల సంతోషాల సార‌ధి! వాన‌విల్లు తోర‌ణమై ఎదురొస్తుంటే.. వేయిక‌ళ్ల‌తో తెలుగులోగిళ్లు ఎదురుచూస్తుంటే.. నింగి నేరుగా నేల‌కు జారేలా.. నేల ప‌ర‌వ‌శ‌మై ప‌ల‌క‌రించేలా.. ముత్యాల‌ముగ్గుల‌కు మెరుపునిస్తుంది! ముద్దుగుమ్మ సిగ్గుల‌కు మెరుగుదిద్దుతుంది! పూజించే హృద‌యాన్నిహారతిలా తీసుకుంటుంది! ప్రేమించే మార్పుని నైవేద్యంలా తిరిగిస్తుంది.. ఉగాది! తెలుగువారి ష‌డ్రుచుల సంతోషాల సార‌ధి!                                                             - మ‌నోసంజీవ్‌

చీకటి

// చీకటి //     తిమిరాన్నంతా తన వద్దే దాచేసుకొని  ప్రపంచానికి వెలుగులా చూపుకుంటున్న దీపం గురించి ఇపుడేం చెప్పనూ? కొన్ని చీకట్లను ఎవరూ గుర్తించలేరు  నలుపులు పులుముకుంటున్న పర్వర్టెడ్ అథారిటీలకు  లోలోపలి తిమిరాన్ని ఎప్పటికీ వెలిగించలేనని  చూపాలనిపించుకోని సహజత్వం వెలిగే దీపాల్లా కనిపించే నవ్వులన్నీ  నువ్వు చూడగలిగేవి మాత్రమే, తన లోపలి చీకట్ల ప్రతిబింబాలే చిమ్ము చీకటిలో లోకానికి వెలుగైన  ఓ గుడ్డిదీపపు లోపటి నలుపు  బయట మతాబుల శబ్ధానికి ఓసారి ఉలిక్కిపడింది  అవును, కొన్నిసార్లంతే..  కొందరి ఆనందమూ, కొందరికి చివుక్కుమనేలా చేస్తుంది  అంధకారం లోకంలో కాదు  నీ లోపల అని అమావాస్య రాత్రి వెక్కిరించిపోతుంది -సరిత భూపతి   

‘యువత’గురించి శ్రీశ్రీ కవిత

  ‘యువత’ గురించి శ్రీశ్రీ కవిత       కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకిర్లకి పు కార్లకి నిబద్దులు  నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు ఉత్తమొద్దు రాచ్చిప్పలు నూతిలోని కప్పలు తాతగారి నాన్నగారి భావాలకు దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు నిన్నటి లీడరు ధోక నేడు చూడజాలరు కన్నులున్న జాత్యంధులు కాకినైనపోలరు వీళ్ళకి కళలన్నా రస మన్నా చుక్కెదురు గోలచేసి ఆరవడమొక టే వాళ్ళేరుగుదురు కొంతమంది యువకులు రా బోవు యుగం దూతలు పావన నవజీవన బృం దావాన నిర్మాతలు బానిస పంధాలను తల వంచి అనుకరిoచరు పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు వారికి నా ఆహ్వానం వారికి నా సాల్యూట్ - శ్రీశ్రీ (సిప్రాలి)

మాతృభాషా దినోత్సవం సందర్భంగా ..

మాతృభాషా దినోత్సవం సందర్భంగా ..   అమ్మ నుంచే మన అమ్మ భాష  ఆటలతో ఆనందభాష్పాలు  ఇక్కడ మాటల నేర్పును  ఈశ్వరునికి అక్షరాల మాల చేకూర్చును  ఉగ్గు పెడుతూ ఊయల పాటల భాష  ఊరిస్తూ ఊసులు ఊపే ఉయ్యాల జంపాలలో రాగాలు దీర్ఘాలను తక్షణమే   ఋణం తీర్చుకునేందుకు అమ్మభాషను  ఎప్పుడెప్పుడు నేర్చుకుందామా  ఏనుగు ఆటలు ఆడుతూ  ఐక్యమత్యంగా మన "మాతృభాష "ను  ఒకరికొకరు పంచుకుంటూ  ఓనమాలు దిద్దుతూ  ఔన్నత్యాన్ని పెంచుకుంటూ  అందరమూ గర్వించేలా , అభినందించేలా మన మాతృభాష అద్భుత:  అంటూ మాతృ భాష దినోత్సవం శుభాకాంక్షలను మన అమ్మ నేర్పిన కమ్మని భాషలో తెలుపుకుందాము !! -దివ్య చేవూరి

పూట పూట నీ పందిరిలోన సందడి

పూట పూట నీ పందిరిలోన సందడి     ఊరూ వాడా అందరూ ఎదురుచూసేనంట ఊరూరా తిరిగి "మా మంచి గణపయ్య" మా ఇంట కొలువుదీరంగ ఈనాటి "మట్టి గణపతి " ఇలలో వారందరూ జోరు జోరుగా మంగళ హారతులిస్తూ ప్రతీ ఏటా "వినాయక చవితి " పండుగకు ఆనందం కురిసే వేళ !! అందరి విఘ్నములను తొలగించి మంచి శుభములను కురిపించవయ్యా ఓ సిద్ధి బుద్ధులని ప్రసాదించే మావిఘ్నరాజా !! బొజ్జ నిండా నీకు కుడుములను , పాయసంబులు పోసేము నీ ముఖమెత్తి ఒక్కసారైనా చూసి మము దీవించవయ్యా !! పల్లవమ్ములు కట్టెదము , పూలు , పండ్లతో ,పాలు తేనెలు , పంచభక్షములు , ఫలహారములు తోడ నీకు నైవేద్యములు పెట్టెదమయ్యా వినాయకా మూషిక వాహనము మీద వేగంగా వచ్చి   దర్శనమీయవయ్యా!! నీ లడ్డూ ప్రసాదమును వేలం పాటలో ఆనందముగా చేజిక్కిచ్చుకునేందుకు  ఆట పాటల తో పిల్లా , పాపలు సందడి జేసెదము నీ కథలే మాకయ్యెను ఆదర్శం !! తల్లి దండ్రులను ప్రణమిల్లగా ముమ్మారు ప్రదక్షిణము జేసిన చాలు సకలదేవతలను దర్శించిన భాగ్యమును నీవు తెలుపగా అందరమూ ఆచరించేమయ్యా  ఓ గౌరీ తనయా !! పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డవే మా అందరికీ అండ దండగా నీ ఆశిస్సులతోడ చే "గణేశ ఉత్సవాలు " ఉత్సాహముగా జరుపుకుండెదమయ్యా పూట పూట నీ పందిరి లోన సందడి కి మేమంతా చెప్పేదము "గణేష్ మహరాజ్ కీ జై " జై గణేశ పాహిమాం, జై గణేశ రక్షమాం జై జై వినాయక ,శరణు శరణు గణేశ !! -  దివ్య చేవూరి

అనురాగం పంచే రక్షాబంధనం (కవిత)

అనురాగం పంచే రక్షాబంధనం (కవిత)     శ్రావణ పూర్ణిమ- రాఖీ పండుగ రక్షా బంధనం – నేటి ఉదంతం రక్షా బంధన్  రాఖీపండుగ రకరకాల పేరుల భరతావని పెద్దల పిన్నల భేదం లేకనె ప్రీతిగ జరుపు కొనేదీ పండుగ. రకరాల రాఖీల నెంచి –పలు రకాల మిఠాయి లెన్నో చెసీ- అక్కా చేల్లెళ్ళందరు కలసి – అన్నాదమ్ముల చేతుల గట్టగ పళ్ళెంలో ఒక కొబ్బరి  బొండం పళ్ళెంలో  కుంకుమ  తడి తిలకం పళ్ళెంలో వెలిగే శుభ దీపం పళ్ళెంలో  అక్షిత  సమూహం ఆ వదనంలో సుమ దరహాసం ఆ కన్నులలో మెరపు ప్రకాశం ఆ చేతులలో  రక్ష విశేషం ఆ మనస్సులో  రక్షిత భావం ! అన్నీ కలగలుపుగ కలిసి కలిసి అన్నదమ్ముళ్ళ కూర్చుండ  జేసి నుదుటను చక్కని తిలకము దిద్దీ నూ రెండ్ల కు  అక్షింతలన ద్దీ కుడిచేతికి  రక్షన్నట  గట్టీ కుల మతాల కతీతము నెంచీ నోటికి తీపి పదార్థ మందించీ నోటివ్వగా నెంతో సంతోషించీ నేను నీకు రక్షనౌదును  గాత! నీవు నాకు  రాక్షవౌదువు గాత ! అనెడి భావనను  మనసుల నింపి అన్న చెల్లెళ్ళు  రక్షణ  నుందురు ! ఒకరి కొకరు రక్షణ కల్పిస్తే ఒకరి నొకరు మంచిని పంచిస్తే సమాజమంతా ఒకటౌతుంది! సమ సమాజమే సిద్దిస్తుంది ! రచన :- నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్