రాజుగారి కోతి

రాజుగారి కోతి   అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక పెంపుడు కోతి ఉండేది. ఆ కోతి చాలా మూర్ఖంగా ఉండేది. కానీ రాజు గారికి మాత్రం కోతి అంటే చాలా ఇష్టం. కోతికి కూడా రాజుగారంటే చాలా ప్రేమ. ఆ కోతిని ఎవ్వరూ ఎప్పుడూ కట్టేసేవాళ్ళు కాదు. రాజుగారి గదిలోకి కూడా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వచ్చే స్వేచ్ఛ ఉండేది దానికి. ఒకరోజు రాజుగారు నిద్రపోతున్నారు. ప్రక్కనే కూర్చొని, ఆయన్నే చూస్తూన్నది కోతి. అంతలో రాజుగారి భుజం మీద ఈగ వాలింది. కోతి ఈగను తోలింది. కానీ ఈగ పోలేదు. మళ్ళీ మళ్ళీ రాజుగారి మీద వాలుతూనే ఉంది. చెయ్యి మీద వాలింది. మళ్ళీ వచ్చి నుదుటి మీద వాలింది. కోతి తోలగానే ఎగిరి పాదం మీద వాలింది. కొంచెం ఎగిరి వచ్చి ఈసారి రాజుగారి ముక్కు మీద వాలింది. 'రాజుగారికి నిద్రాభంగం అవుతుందే' అని కోతికి కష్టం వేసింది. అంతలో దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వెళ్ళి గోడకు వ్రేలాడుతున్న పెద్ద కత్తిని ఒకదాన్ని తీసుకుని వచ్చి రాజుగారి దగ్గర కూర్చున్నది. ఈసారి ఈగ రాజుగారి మీద వాలిన మరుక్షణమే ఆ ఈగ మీద దాడి చేసింది. ఈగ తప్పించుకున్నది; కానీ రాజుగారికి మాత్రం బాగా గాయాలు అయ్యాయి! రాజుగారికి ఇప్పుడు బుద్ధి వచ్చింది. తెలివిలేని వాళ్లకి అధికారం ఇస్తే కష్టాలు తప్పవని అర్థం అయ్యింది. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఉడతా ఉడతా నీవెంత

ఉడతా ఉడతా నీవెంత     రామాలయం ప్రాంగణంలో ఉన్న జామ చెట్టెక్కి, పండు కొరికి తింటున్నది చిన్నారి ఉడుత. ఆ రోజున శాస్త్రి గారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి! దాంతో చెట్టు దిగి, శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది. "శ్రీరాములవారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు! వాళ్లకంటే చిన్న జంతువు- ఉడుత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందిట! అందుకు రాములవారు సంతోషించి, ఉడుతను దగ్గరకు తీసుకొని, దాని వీపును ప్రేమగా నిమిరాడట! దానికి గుర్తుగానే ఉడుత వీపు మీద చారలు ఉంటాయట" అని శాస్త్రి గారు చెబుతుంటే శ్రోతలతో పాటు ఈ ఉడుత కూడా శ్రద్ధగా విన్నది. "ఏంటీ! నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా?! రామయ్య వ్రేళ్ల గుర్తులా ఇవి! ఆహా! నేనెంత గొప్పదాన్ని?! నా గురించి నాకు తెలీకుండా ఇట్లా పెరిగానే?! ఇప్పుడు చెబుతాను!" అనే ఆలోచన మనసులోనే తిరిగి ఎక్కడలేని సంతోషం వేసింది దానికి. చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి, ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది. అట్లా ఉబ్బి తబ్బిబ్బైపోతూ పోతున్న ఉడుతకు దాని ఫ్రెండ్స్ ఎలుక, తాబేలు ఎదురయ్యాయి. వాటిని చూస్తే ఉడుతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇవాళ్ల ఎందుకో, అవి రెండూ ఒట్టి పనికిమాలినవి అనిపించాయి. వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్ధయింది ఉడుతకి. అది అట్లా పైకి పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక, తాబేలు కూడా దాని వెంట పరుగుపెడుతూ "ఆడుకుందామారా?" అని అడిగాయి అనురాగంతో. "నేనా?! మీతో ఆడాలా?! అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో? నా వీపుపైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు? ఇవి మామూలు చారలు కాదు! రామయ్య తండ్రి వేళ్ళ గుర్తులివి! నాతో ఆడేందుకు మీరేంటి, మీకున్న విలువేంటి?! పోండి, పోండి!" అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడుత.   అంతలో ఎదురుగా కనిపించాడు గున్నేనుగన్నయ్య. "ఏయ్‌! నీ ఫ్రెండ్స్ ఏరీ, ఆడుకోవడం లేదా?" అన్నాడు. "లేదు లేదు" అంటూ రాగం తీసి, "ఆ విలువ లేనోళ్ళతో ఆడనన్నాను" అంది ఉడుత. "అయ్యో! అదేమి? విలువ లేదంటావేమిటి? వాళ్ళు మంచోళ్ళేనే? రోజూ నీతోటి ఆడుకుంటుంటారు కదా?" "నిజమే. ఇప్పుడు నన్నే తీసుకోండి. నా వీపున చారలున్నై. ఇవి ఎలా వచ్చినై? రాముల వారు.. "అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడుత. అంతా విని ఆగకుండా నవ్వింది గున్న ఏనుగు. "ఎందుకు, నవ్వుతున్నావు?" అని అడిగింది ఉడుత, కోపంతో..   "అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నావే, మరి ఇంక ఎలుక ఎంత గర్వపడాలి, ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా?! మరి ఇంక తాబేలు సంగతికొస్తే, విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు గదా?! అసలు ఇప్పుడు ఆ ఎలుక, తాబేలే 'నీతో‌ స్నేహం చెయ్యం పో!’ అప్పుడు నీ పరిస్థితి ఏంటి, చెప్పు?! నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను తల్లీ, నువ్వు వాటి 'మంచితనాన్నే' 'చేతకానితనం' అనుకున్నావు. అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు- అంతకు మించి ఏమీ లేదు" అంటూ ముందుకు సాగింది ఏనుగు. దాని మాటలు వినగానే ఉడుత తలకెక్కిన గర్వమంతా టప్పుమని ఎగిరిపోయింది. సృష్టిలోని ప్రతి జీవికీ దానిదైన గొప్పతనం ఉందని అర్థమై, తన నేస్తాలకు క్షమాపణ చెప్పేందుకు వెనక్కు తిరిగిందది. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఓరెంకా రేవడ్సే కాదిస్కే

ఓరెంకా రేవడ్సే కాదిస్కే   అనగనగా నాగసముద్రంలో గంగరాజు అనే నేతగాడు ఒకడు ఉండేవాడు. అతనికి లేకలేక ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరు రాణి. రాణిని చాలా ముద్దుగా పెంచుకున్నారు గంగరాజు దంపతులు. ఆ పాపమీద బాగా ఆశలు కూడా పెట్టుకున్నారు. ఆ పాప కూడా పెరిగి పెద్దయ్యే కొద్దీ చేనేత విద్యలో మంచి నిపుణతే సాధించింది. గంగరాజు నోరు ఊరికే ఉండదు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. ఒట్టి కోతల-రాయుడు కూడా. ఉన్న విషయాన్ని ఉలవలు పలవలుగా పెంచి, అసలు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చెప్పటం అతనికి అలవాటు. 'అనవసరమైన మాటలే కొంప ముంచు-తాయి' అని ఏమాత్రం తెలీదు అతనికి. ఒకరోజు అతను వాళ్ళ బంధువు లింగరాజుతో మాట్లాడుతూ "మా రాణి చెయ్యి మామూలు చెయ్యి కాదురా! ఆ పాప డోలు చుడుతుంటే, అందులో వేసిన గడ్డి పరకలు కూడా బంగారు కడ్డీలుగా మారిపోతాయి!" అనేసాడు. ఆ మాట వారి నోటా వీరి నోటా పడి నలిగి, చివరికి ఆ దేశపు రాజు చెవిలో పడింది. ఇంకేముంది?- "వెళ్ళి అమెను తక్షణం వెంట బెట్టుకు రండి" అని భటుల్ని పంపించారు రాజుగారు. భటులు రాణిని వెతుక్కుంటూ నాగసముద్రం వరకూ వచ్చి, "లింగరాజు ఇల్లు ఎక్కడ?" అని వాకబు చేసారు. 'సంగతేంటి?' అని కుతూహలపడ్డ ఊళ్ళోవాళ్ళు, వాళ్ల వెంట వచ్చి మరీ లింగరాజు ఇల్లు చూపించారు. "రాజుగారు నిన్ను వెంట బెట్టుకు రమ్మన్నారు తల్లీ" అని చెప్పారు భటులు. ఇక రాణికి వాళ్ల వెంట రాక తప్పలేదు. రాజుగారి దర్బారుకు వెళ్ళి నిలబడింది. రాజుగారు ఆ అమ్మాయిని చూడగానే మర్యాదగా లేచి నిలబడి, "నువ్వు డోలు చుడుతుంటే అందులో గడ్డి పరకలు వేసినా కూడా బంగారు కడ్డీలు అవుతాయట కదా! మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఖజనాలో నిధి బాగా తగ్గిపోయింది. నువ్వు ఇప్పుడు ఎలాగో ఒకలాగా నిధిని పెంచాలి- ఎంత కష్టమైనా సరే, తప్పదు" అని చెప్పేసాడు.   "అయ్యో రాజావారూ, దయచేసి నామాట ఆలకించండి. నాకు ఇవేవీ రావు. మా నాన్న వట్టి కోతలరాయుడు. గొప్పలు చెప్పుకోనిదే బ్రతక లేడు!" అని నిజం చెప్పింది రాణి. అయినా రాజుగారు ఆమె మాటలు నమ్మలేదు. "చూడమ్మా! పరాచికాలకు ఇది సమయం కాదు. దేశం ఎట్లా ఉందో చెప్పాను నీకు! చేతిలోని విద్యల్ని దేశం కోసం‌ కాకపోతే ఇంక దేనికి వాడతావు? నువ్వు ఖజానాలో సంపదని పెంచాల్సిందే. వేరే మాట లేదు!" అని, రాజుగారు ఆమెకు సకల సౌకర్యాలూ కల్పించాడు; సేవలు చేసేందుకు చెలికత్తెల్ని పెట్టాడు; కడుపునిండా ఫలహారాలు సమకూర్చాడు. ఆమె ఉండే గదిలో ఒక డోలు, గది నిండా గడ్డి సమకూర్చాడు! రాణికి ఇంక ఏమి చేయాలో తెలీలేదు. పగలంతా కూర్చొని తండ్రిని బాగా తిట్టుకుంది. రాత్రంతా ఆ గడ్డి కుప్ప ముందు కూర్చొని ఏడ్చింది. చివరికి ఇంక తట్టు-కోలేక, 'చనిపోవాల్సిందే' అనుకున్నది. 'ఈ గడ్డితోటే ఉరి వేసుకుంటాను' అని నిశ్చయించుకున్నది.   అయితే సరిగ్గా అదే సమయానికి ఆమె ఉన్న గదిలోకి దూకింది, ఒక భూతం! రాణి దాన్ని చూసి కూడా చూడనట్లే ఉంది. అది రాణిని చూసి భయంకరంగా పళ్ళన్నీ కనబడేట్లు ఇకిలించింది. జవాబుగా రాణి మూతి ముడుచుకున్నది. భూతం ఓ చర్నాకోల తీసుకొని గడ్డినంతా చెల్లాచెదరయ్యేట్లు కొట్టింది. దాన్ని కళ్ళార్పకుండా చూసిన రాణి, "గడ్డిని కొడితే ఏమొస్తుంది, నన్ను చంపెయ్యి మామయ్యా! కనీసం ఈ పీడన్నా విరగడౌతుంది" అని ఏడ్చింది. ఆశ్చర్యపోయిన భూతం గడ్డిని ఏకే పనిని ఆపి "ఏమైంది? ఏడవాల్సినంత విషయం ఏం జరిగింది?" అని అడిగింది. జరిగిన సంగతంతా పూస గుచ్చినట్లు చెప్పి, ఇంకోసారి కళ్ళనీళ్ళు పెట్టుకున్నది రాణి. "సరే సరే, అర్థమైంది! ఇప్పుడింక మళ్ళీ ఏడవకు, ఊరికే. నేను నీకు సాయం చేస్తాను!" అని, రాణినే పరీక్షగా చూస్తూ "ముందు నీ కాళ్ళకు వున్న బంగారు పట్టీలు తీసి ఇవ్వు" అన్నది భూతం. రాణి తన కాళ్ళకు ఉన్న పట్టీలు తీసి భూతానికి ఇచ్చింది. భూతం వాటిని గడ్డిలో వేసి చేతులు తిప్పింది. వెంటనే అక్కడున్న గడ్డి పరకలన్నీ బంగారు కడ్డీలుగా మారాయి. ఆ వెంటనే భూతం కూడా మాయమైపోయింది. తెల్లవారగానే రాజుగారు వచ్చి, బంగారంగా మారిన గడ్డిని చూసి చాలా సంతోషించాడు. "నాకు తెలుసు తల్లీ! నువ్వు కోరుకుంటే ఏమైనా చేయగలవు! నీవల్ల మన ఖజానాలో మూడో వంతు నిండి పోయింది! ఇంక మన పెద్దలు చేసిన బాకీలు తీరినట్లే. ఇవాళ్టిరోజున కొంచెం శ్రమ పడ్డావంటే మనం చేసిన బాకీలు కూడా తీరిపోతాయి. ఇలా అడుగుతు-న్నానని ఏమీ అనుకోకు- మళ్ళీ గదినిండా గడ్డి వేయిస్తాను" అన్నాడు.   "నాకేమీ రాదు! ఇది నేను చేసింది కాదు!" అని రాణి ఏదో చెప్పబోయింది గానీ ఆయన విననే లేదు! గదిలో ఒక్క బంగారు కడ్డీ కూడా లేకుండా ఎత్తుకెళ్ళి, కొత్త గడ్డి తెచ్చి వేయించాడు మళ్ళీ. రెండవరోజున కూడా ఏడ్చుకుంటూ కూర్చున్నది రాణి. "భూతం మామయ్య వస్తే బాగుండు!" అనుకున్నది గానీ, "రోజూ రావాలని ఏమున్నది?" అని కూడా అనుకున్నది. అయితే ఆమె అదృష్టం‌ కొద్దీ‌ మళ్ళీ వచ్చింది భూతం. "నాకు తెలుసు; నీ పరిస్థితి ఇట్లా అవుతుందని. ఏదీ, బంగారం ఇవ్వు. అంటూ రాణి వేసుకున్న బంగారు గొలుసును తీసుకొని, అక్కడున్న గడ్డినంతా ఒక్క క్షణంలోనే బంగారు కడ్డీలుగా మార్చేసి, వెళ్ళిపోయింది.   తెల్లవారాక వచ్చి చూసిన రాజుగారు, బంగారాన్నంతా ఖజానాకు తరలించి, ఆమెను చాలా మెచ్చుకొని, "అమ్మా, నీ‌ చలవ వల్ల నా ఖజానా రెండు వంతులు నిండిపోయింది. మన బాకీ అంతా తీరినట్లే. ఇప్పుడు ఇంక ఒక్క రోజు శ్రమ పడ్డావంటే, ఇక మన తర్వాతి తరం అంతా దర్జాగా పెరుగుతుంది!" అన్నాడు, కొత్తగా గడ్డి తెచ్చి వేయిస్తూ. ఆ రోజు రాత్రి కూడా భూతం మామయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నది రాణి. అనుకున్నట్టు గానే భూతం వచ్చింది. అది రాగానే "మార్చేయి, మామయ్యా; మార్చేయి గబగబా!" అన్నది రాణి. "సరే, ఏదైనా బంగారు నగ ఇవ్వు మరి-" అని చేతులు చాపింది భూతం. కానీ రాణి దగ్గర ఇచ్చేందుకు ఇంక ఏ బంగారు నగా లేదు. కాళ్ల పట్టీలు, మెడలో గొలుసు రెండూ ఇచ్చేసిందిగా?! "అయ్యో! నా దగ్గర ఇంక బంగారం ఏమీ లేదే!" అంది రాణి. "బంగారం లేకపోతే మరి ఇంక నేనేమీ చెయ్యలేను!" అంది భూతం. రాణి భూతాన్ని చాలా బ్రతిమిలాడేసరికి, చివరికి అది రాణితో ఒక మాట తీసుకుంది: "నేను ఇప్పుడు ఈ గడ్డిని బంగారు చేస్తాను. రేప్పొద్దున రాజు వచ్చి, నిన్ను తన కొడుక్కు ఇచ్చి పెళ్ళి చేస్తాడు. ఆ తర్వాత మీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. వాడికి ఐదేళ్ళు రాగానే వాడిని నాకు ఇచ్చెయ్యాలి" అని. అంతా భూతం చెప్పినట్లే జరిగింది. రాజుగారు రాణిని తన కోడలుగా చేసుకున్నాడు. భూతం భయం కొద్దీ రాణి "ఇవేవీ వద్దు. నేను మా ఊరికి వెళ్ళిపోతాను" అన్నది గానీ, రాజుగారు ఆమె మాటల్ని అస్సలు వినలేదు. చూస్తూండగానే రాణికి ఒక కొడుకు పుట్టాడు; వాడికి నాలుగేళ్ళు నిండి ఐదో ఏడాది పడే సరికి భూతం వచ్చి కనిపించింది రాణికి: "గుర్తుందిగా, ఈ ఏడాది గడిచే సరికి నీ కొడుకుని నాకు ఇచ్చేయాలి. ఈ ఏడాదంతా నేను కూడా మీ ఇంట్లోనే ఓ గదిలో నివసిస్తా" అంటూ. రాణి దు:ఖంతో బక్కచిక్కిపోసాగింది. "నీలో ఏదో మార్పు ఉంది- ఏమైంది?" అని యువరాజు ఎంత అడిగినా ఆమె మటుకు ఏమీ చెప్పుకోలేదు. అయితే యువరాజు కూడా చాలా మంచివాడు; అతను గంగరాజుతో "మామా! రాణి ఎందుకో చాలా బాధ పడుతున్నది. నువ్వైతే ఆమెను అర్థం చేసుకుంటావు. వచ్చి కొన్నాళ్ళు మాతోనే ఉండు" అని చెప్పి పిలిపించాడు. గంగరాజు రాణిని మాటల్లో పెట్టి అసలు సంగతిని రాబట్టాడు. "తల్లీ! ఇదంతా నా తప్పు వల్లే జరిగింది కాబట్టి, దీని పరిష్కారం కూదా నేనే చూపిస్తాను. నువ్వు కంగారు పడకు" అని, ఆనాటి నుండి రోజూ భూతం ఉండే గదిలోకి వెళ్ళి దానితో ముచ్చట్లు పెట్టుకోవటం మొదలు పెట్టాడు. గంగరాజు చెప్పే జోకులు, సామెతలు భూతానికి చాలా ఇష్టం అయ్యాయి. అతను అడిగే పొడుపు కథలు విప్పటంలో దానికి ప్రత్యేకంగా మజా వచ్చేది. ఒక్కోసారి గంగరాజు దానితో చిన్న చిన్న పందేలు కూడా వేసేవాడు. "అడవిలో పుట్టింది-అడవిలో పెరిగింది.."అని ఓ పొడుపు కథ అడిగి, "సమాధానం చెబితే నీకు ఒక చాక్లెట్ ఇస్తా" అనేవాడు. భూతానికి అట్లాంటి పందేలు కూడా చాల నచ్చినై. ఒకరోజున భూతం గంగరాజుకి ఒక సమస్యను ఇచ్చి పరిష్కరించమన్నది- "ఓరెంకారేవడ్సాకాదిస్కే అంటే ఏంటి?" అని. "నాకు తెలీదు- నువ్వే చెప్పెయ్యి" అన్నాడు గంగరాజు. "కాదు కాదు. నువ్వే చెప్పాలి" అన్నది భూతం. "లేదులే, నేను ఓడిపోయాను" అన్నాడు గంగరాజు. "కాదు కాదు! కనుక్కో! కనుక్కుంటే మంచి బహుమతి ఏదైనా ఇస్తాను" అంది భూతం.   "ఏమిస్తావు?" అడిగాడు గంగరాజు ఉత్సాహంగా. "ఇది చాలా పెద్ద పందెమే మరి. నీకు వారం రోజులు సమయం ఇస్తాను. సరైన సమాధానం చెప్పావంటే, నేను నీ‌ బిడ్డ రాణిని, మనవడిని వదిలిపెట్టి ఇక కనబడకుండా వెళ్ళిపోతాను. చూడు మరి!" అన్నది భూతం మెరిసే కళ్లతో. "సరే" అని గంగరాజు ఆ సమస్యని రాణికి, యువరాజుకు నివేదించాడు. వాళ్ళు మంత్రుల్ని అడిగారు. మంత్రులు తమకు తెలిసిన పండితుల్ని అడిగారు- ఎవ్వరికీ అసలు ఈ ప్రశ్న ఏంటో, ఏ భాషలోదో, ఏమీ అంతు చిక్కలేదు. ఆ సరికి ఐదు రోజులు గడిచాయి. గంగరాజు రాజ్యంలో అంతటా తిరగటం మొదలెట్టాడు. పండితులు-పామరులు అనకుండా ఎవరు కనిపిస్తే వాళ్లని "ఓరెంకారేవడ్సాకాదిస్కే" అంటే ఏంటి?" అని అడగటం మొదలెట్టాడు. ఆ రోజున కూడా అతను వెతికి వెతికి అలసి పోయి, ఓ నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టు కింద కూలబడ్డాడు. అక్కడికి దగ్గర్లోనే ఒక ఊరు ఉంది. ఆ ఊళ్లో ఉండే ఒక సెట్టిగారికి నది అవతలగా ఐదు ఎకరాల పొలం ఉంది. సెట్టి గారి దగ్గర ఒక పాలేరు ఉండేవాడు. అతని పేరు వెంకన్న. సెట్టిగారు రోజూ పొలానికి వెళ్తూ వెంకన్నను వెంటబెట్టుకొని వెళ్ళేవాడు. నదిలో ఒక్కోసారి నీళ్ళ ప్రవాహం ఎక్కువ ఉండేది; ఒక్కోసారి నది నడచుకొని దాటేందుకు వీలుగా ఉండేది- ఏ రోజున నది ఎలా ఉందో పరీక్షించటం వెంకన్న పని. ఆ రోజున మొదటగా వెంకన్న నదిలోకి దిగి కొంత దూరం నడిచాడు. ప్రతిరోజూ మాదిరే గట్టు మీదినుండి సెట్టిగారు "ఓరెంకా! రేవడ్సా?" అని అడిగాడు గట్టిగా. "ఓరీ వెంకా! రేవు అడుసా?- ఒరే వెంకన్నా, రేవు బురద బురదగా ఉందా?" అని దాని అర్థం. "కాదిస్కే!" అని అరిచాడు వెంకన్న. "కాదు ఇసకగానే ఉంది, బురదగా లేదు" అని! చెట్టు క్రింద కూర్చున్న గంగరాజుకు ఆ క్షణంలో మొత్తం అర్థమైపోయింది: గతంలో భూతం ఈ మర్రిచెట్టు మీదే ఉండి ఉంటుంది! రోజూ శెట్టిగారు, వెంకన్న ఇలా మాట్లాడుకోవటం గమనించి ఉంటుంది. కానీ దానికి ఇదేమీ అర్థమై ఉండదు!! అందుకే ఇప్పుడు అది తనకు ఈ సమస్య ఇచ్చింది! గంగరాజు తక్షణం రాజధానికి వెళ్ళి, తను కనుగొన్న రహస్యాన్ని వివరించి చెప్పేసాడు భూతానికి . భూతం గట్టిగా నవ్వి, తను ఇచ్చిన మాట ప్రకారం రాణిని, ఆమె కొడుకుని వదిలిపెట్టి ఇక కనబడకుండా వెళ్ళిపోయింది. "ఎక్కించి చెప్పి అనవసరంగా నా బిడ్డను కష్టాలపాలు చేసానే!" అని బాధపడే గంగరాజు మనసు ఇప్పుడు చల్లబడింది. యువరాజుకు భార్య అంటే గౌరవం పెరిగింది. అటుపైన అందరూ సుఖంగా ఉన్నారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కలిసి బ్రతుకుదాం..

కలిసి బ్రతుకుదాం!   అనగనగా ఒక అడవిలో ఒక చీమ, మిడత, పేడపురుగు ఉండేవి. చీమ, మిడత ప్రతిరోజూ కలిసి తిరిగేవి, వానాకాలం కోసం అవసరమైన ఆహారాన్నంతా ముందుగా సేకరించుకునేవి. చీమ ఆహారాన్ని వాసన పట్టి చూపించేది; మిడత దాన్ని తెచ్చి చీమ పుట్ట దగ్గర విడిచేది. ఇక మిడత, పేడపురుగు రెండూ ప్రతిరోజూ కలిసి తిరిగి, ఎక్కడెక్కడి పాటలూ సేకరించుకొని పాడేవి. పేడపురుగు నోటితో తాళం పలికిస్తే, మిడత ఎగిరి గంతులు వేసేది. రెండూ సంతోషంగా బిగ్గరగా నవ్వుకునేవి. ఎప్పుడో ఒకసారి ఈ మూడూ కలిసేవి. అట్లా కలిసినప్పుడు మరి పేడపురుగు, చీమ సరిగ్గా మాట్లాడుకునేవి కావు. ఒకదాన్ని చూసి ఒకటి ముఖం చిట్లించుకునేవి. మిడత మటుకు వాళ్లిద్దరి ముఖాలకేసీ చూసి నవ్వేది. "ఈ పేడ పురుగుకు పనిచేయటమే రాదు! ఎప్పుడూ ఆ పాటలేంటి?" అనేది చీమ ఆ తర్వాత. మిడత నవ్వేది- పేడపురుగును వెనకేసుకు వచ్చేది. "ఈ చీమకి అస్సలు పాట అంటే ఏంటో తెలీదు! ఎప్పుడూ ఆ పనేంటి?" అనేది పేడపురుగు. మిడత నవ్వి, ఈసారి చీమను వెనకేసుకు వచ్చేది.   అంతలో వానాకాలం‌ రానే వచ్చింది. అడవిలో అంతటా నీళ్ళు, బురద! బయటికి వెళ్ళాలంటే కష్టం అయిపోయింది చీమకి. అది ఇంట్లోనే ఉండి, దాచుకున్న ఆహారంతోటే వంట చేసుకుని, అందులో తను కొంచెం తిని, కొంచెం‌ మిడతకు కూడా పెట్టేది. మిడత అట్లా తనకు చీమ ఇచ్చిన ఆహారంలోంచే కొంచెం తీసుకెళ్ళి పేడపురుగుకు పెట్టేది. అటుపైన రెండూ కలిసి బురదలోనే చక్కగా పాటలు పాడుకుంటూ తిరిగేవి. ఆ సమయంలో అవి సేకరించిన ఆహారంలో కొంత తీసుకెళ్ళి మళ్ళీ చీమకు పెట్టేది మిడత! ఇట్లా రెండు మూడేళ్ళు గడిచేసరికి, చీమకు పేడ పురుగంటే గౌరవం పెరిగింది. పేడ పురుగుకు కూడా చీమంటే ప్రేమ కలిగింది. "పేడపురుగు ఎంత బాగా పాడుతుందో కదా, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది!" అన్నది చీమ. "చీమ ఎంత మంచిదో కదా, సంవత్సరమంతా శ్రమపడుతుంది- స్వార్ధమే లేదు దానికి!" అన్నది పేడపురుగు. అటుపైన మూడూ కలిసి సంవత్సరమంతా కచేరీలు చేసుకుంటూ, కలిసి ఆహారం సేకరించుకుంటూ, కలిసి తింటూ బ్రతికాయి.   మన సమాజం కూడా ఇలానే ఏర్పడింది అనిపిస్తుంది ఆలోచిస్తే. అందరమూ అన్ని సమయాల్లోనూ అన్ని పనులూ చెయ్యలేం కాబట్టి, ఎవరికి వీలైనట్లు వాళ్లం, ఎవరి శక్తికి తగినట్లు వాళ్లం, ఎవరి ఇష్టానికి తగినట్లు వాళ్లం- పనిచేసేందుకు అనువుగా ఈ వ్యవస్థల్ని ఏర్పరచుకున్నాం అనమాట. అయితే ఈ ఆదర్శాలు సరిగా పనిచేయాలంటే చీమలు, పేడపురుగుల్లాగా తమ పనిని తాము ఇష్టంగా చేసే వాళ్ళు ఎంత ముఖ్యమో, మిడత లాగా అందరినీ‌ కలుపుకు పోయే వాళ్ళు అంతకంటే ముఖ్యం.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మారిన నైజం

మారిన నైజం   పిల్లలకు ఆకలి ఎక్కువ. టామీ కుక్కపిల్ల చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా చాలా ఆకలి ఉండేది. రోజంతా ఆహారం కోసం వెతుక్కుంటూ తిరిగేదది. ఒక్కోసారి, ఊళ్ళో ఏ హోటల్లోంచో మంచి భోజనం వాసన గుప్పున తగిలేది. ప్రతిసారీ ఆశతో అటువైపుకు పరుగు పెట్టేది పాపం. ప్రతిసారీ విస్తరాకులు కనబడటం, గబగబా విస్తర్లలో‌ మూతి పెట్టటం, మరుక్షణాన ఓ పెద్ద కుక్క వచ్చి మీద పడటం, ఏం జరుగుతున్నదో అర్థమయ్యే లోపలే అది ఎక్కడో దూరంగా పోయి పడటం. "కుయ్, కుయ్" మని వణుక్కుంటూ అట్లా దూరంగా నిలబడేదది. ఆ వచ్చిన పెద్ద కుక్క తినేసాక, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే టామీ అదృష్టం, అంతే. చాలా సార్లు పెద్ద కుక్క ముగించే లోపలే మధ్య రకం కుక్కలు కొన్ని వచ్చి పడేవి. అవి వచ్చాయంటే ఇక టామీకి ఒక్క మెతుకు కూడా‌ దక్కేది కాదు. చిన్న కుక్కలు దొంగగానే తినాలి. ఒకసారి టామీకి అకస్మాత్తుగా ఓ మాంసం ముక్క దొరికింది. చటుక్కున అది అటూ ఇటూ చూసింది- వేరే పెద్ద కుక్కలేవీ దగ్గర్లో లేవు. దాంతో అది చటుక్కున ఆ ముక్కను నోట కరుచుకొని పరుగెత్తి, ఒక మూలగా ఆగి, దాన్ని గబగబా తినేసింది. బ్రతుకు మెళకువలు అట్లా నేర్చుకున్నది టామీ. ఆటంకాల్ని అధిగమిస్తూ, ఓటమిని భరిస్తూ, మెల్లగా పెద్దదైంది. ఇప్పుడు దానికి కండలు తిరిగాయి. అనుచరులు కూడా ఏర్పడ్డారు. ఎట్లాంటి యుద్ధంలో అయినా ఇప్పుడు దానిదే పైచేయి. మొదట్లో‌ ఉండిన పెద్ద కుక్కలన్నీ‌ ఇప్పుడు ముసలివైనాయి. చిన్న కుక్కలకు ఎట్లాగూ బలం‌ ఉండదు! అట్లా అది తిరిగే పరిసరాల్లోని హోటళ్ళు, చెత్తకుండీలు అన్నీ ఇప్పుడు దాని సొంతం అయిపోయాయి. సాధారణంగా దాని వయసు కుక్కలు ఏవీ పిల్ల కుక్కల్ని, ముసలి కుక్కల్ని తిననివ్వవు; ప్రశాంతంగా ఒక చోట ఉండనివ్వవు. తరిమి తరిమి సంతోషపడతాయి. కానీ టామీ మనసు మాత్రం అట్లా కరకుబారలేదు. చిన్నతనంలో తను ఎదుర్కున్న కష్టాలు దానికి గుర్తున్నాయి- అయినా ఆ అనుభవాలకుగాను 'ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి' అని దానికి అనిపించలేదు. చిన్న కుక్కల్ని చూసినప్పుడల్లా దానికి చిన్నప్పటి తనే గుర్తుకొచ్చేది. ముసలి కుక్కల్ని చూసినప్పుడల్లా దానికి "తర్వాత ఎప్పుడో నేనూ వీటిలాగానే అయిపోతాను" అనిపించేది. తన ఆ ఆలోచనల కారణంగా అది చిన్నపిల్లలతోటి, ముసలి కుక్కలతోటీ పోట్లాడటం మానేసింది. తనకు దొరికిన ఆహారంలోనే కొంత భాగాన్ని వాటికోసం వదలసాగింది. మెల్లగా ముసలి కుక్కలు, చిన్న కుక్కలు టామీని ఇష్టపడటం మొదలెట్టాయి. ఒక్కోసారి దాని మంచితనాన్ని బలహీనత అనుకొని చిన్నచూపు చూసే కుర్ర కుక్కలు ఎదురయ్యేవి దానికి. అలాంటివాటితో మటుకు అది ప్రాణాలకు తెగించి పోరాడేది. వాటి మీద తన బలాన్ని నిరూపించుకునేది. రాను రాను టామీకి తన పద్ధతి మంచిది అన్న నమ్మకం కలిగింది. ఇప్పుడు అది తనకు ఎక్కడ ఆహారం దొరికినా, మిగతా కుక్కలన్నిటినీ పిలవటం, కలిసి తినటం మొదలుపెట్టింది. బలం ఉన్న కుక్కలు బలహీనుల్ని కరవబోతే కూడా తను అడ్డుకొనసాగింది. ఆ క్రమంలో దాని అనుచరులు కూడా అదే పని చేయసాగాయి. అలా ఉన్నదాన్ని తోటి కుక్కలతో పంచుకొని తింటూ పెద్దయిన క్రొత్త తరం కుక్కలకు అట్లా పంచుకొని తినటమే అలవాటయింది! ఇప్పుడు ఆ ఊరి కుక్కలు ఆహారం కోసం అసలు కొట్లాడుకోవు! దొరికిన ఆహారాన్ని అన్నీ‌ కలిసి తింటాయి! వాటి నైజమే మారిపోయింది! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ప్రాణత్యాగం

ప్రాణత్యాగం   పట్టువదలని విక్రం తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి, బేతాళాన్ని భుజంపైన వేసుకొని, చెట్టుదిగాడు. అంతలో రోబో బేతాళం కదిలి, "చూడు విక్రం, ఒక పోలీసు అధికారిగా నీకు నా మీద ఏం కోపమో అంతుపట్టడం లేదు. ప్రతి ప్రాణికీ ఒక నీతి ఉంటుంది. అయితే నువ్వు చేస్తున్న పని మటుకు నాకు తెలిసి ఏ నీతి ప్రకారమూ సరైనది కాదు. గతంలో చంద్ర ప్రభుడు అనే చిన్నవాడు ఒకడు నీ మాదిరే ఆలోచించి బ్రహ్మరాక్షసుడికి కూడా లోకువైనాడు. అలసట తెలీకుండా ఉండటం కోసం నీకు అతని కథ చెబుతాను- నోరెత్తకుండా విను" అంటూ ఇలా చెప్ప సాగాడు. అవంతీ రాజ్యపు మంత్రి సుశర్మకు ఒక్కగానొక్క కొడుకు చంద్రప్రభుడు, దూర దేశంలో విద్యనభ్యసిస్తున్నాడు. కథ మొదలయ్యేనాటికే అతని చదువు ముగిసింది. అతను గురువుగారి ఆశీస్సులు అందుకొని, తన మిత్రులు ముగ్గురితో కలిసి అవంతికి తిరుగు ప్రయాణం అయ్యాడు. చంద్రప్రభుడి మిత్రులు కిశోరుడు, పిప్పలుడు, అనూరుడు ముగ్గురూ మూడు సామంత రాజ్యాల యువరాజులు. యువకులు నలుగురూ కూడా సాహసులూ, ధైర్యవంతులూ, ఔత్సాహికులూనూ. వాళ్ళు అలా తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అనేక శాఖలతో ఒక పెద్ద అరణ్యంలాగా విస్తరించి ఉన్న ఆ చెట్టుని చూడగానే మిత్రులు నలుగురికీ అక్కడ కొంత సేపు విశ్రమించాలనిపించింది. అలా అనిపించటానికి కారణం ఆ మర్రిచెట్టు మీద ఎన్నో ఏళ్లుగా నివసించే ఒక బ్రహ్మరాక్షసుడు. వాడి పేరు ప్రచండుడు. వాడు తన మాయా ప్రభావం చేత అటువైపుగా వెళ్ళే బాటసారులను ఆకర్షించి, ఆనక వాళ్లను తినేస్తూ ఉండేవాడు.   వాడికి ఈ నలుగుర్నీ చూడగానే చాలా సంతోషం వేసింది; దానితోబాటు కొంత విచారం కూడా కలిగింది. ఏమంటే బ్రహ్మ శాపం ప్రకారం వాడు ఒక రోజున ఒక్క ధైర్యశాలిని మించి తినలేడు! అలా ఇప్పుడు వీళ్లను నలుగుర్నీ ఒకేసారి మ్రింగేసే అవకాశం పోయింది వాడికి. తక్షణం వాడు తన మెదడుకు పని పెట్టాడు. 'ఏదైనా ఒక మాయ చేసి, వీళ్లని ఒక్కరొక్కరుగా, నాలుగు రోజులపాటు తినాలి' అని వాడు పథకం సిద్ధం చేసుకొని, భీకరంగా అరుస్తూ వాళ్ల ముందుకు దూకాడు. వాడి అరుపులకు ఆకాశం వణికింది. భూమి కంపించింది. ప్రశాంతంగా నిద్రపోతున్న నలుగురూ గబాలున మేల్కొని, వరల్లో ఉన్న కత్తులు బయటికి లాగారు. ఎదురుగా అంతెత్తున నిలబడి, గదని త్రిప్పుతూ, భీకరమైన కంఠంతో వికటాట్టహాసం చేస్తున్న ప్రచండుణ్ణి చూడగానే నలుగురికీ ఒక ప్రక్కన భయం వేసినా, మరొక ప్రక్కన విపరీతమైన క్రోథం కలిగింది. అయితే వాళ్ళ కత్తులు బ్రహ్మరాక్షసుడిని ఏమీ చేయలేక, వంగిపోయాయి! నలుగురు యోధుల ముఖాలూ తెలవెల పోయాయి.   ప్రచండుడప్పుడు చికాకును, బద్ధకాన్నీ‌ నటిస్తూ "ఇంక చాలు. నేను అనుమతించకుండా మీరెవ్వరూ తప్పించుకోలేరు ఎలాగూ. ప్రస్తుతం నాకు బాగా ఆకలిగా వుంది. అందులోనూ మీలాగా బలమైన మనుషుల్ని తిని చాలా ఏళ్లయ్యింది. చూస్తుంటే కుస్తీ యోధుల్లా నోరూరిస్తూ ఉన్నారు. మీలో ఎవరైనా ఒకరు నాకిప్పుడు ఆహారం కండి. మిగతావాళ్లని వదిలేస్తాను. లేకపోతే నలుగుర్నీ ఒక్కసారిగా తినేస్తాను. వెంటనే ఆలోచించుకుని చెప్పండి. ఇవాళ్ల నాకు ఎవరు ఆహారం అవుతారు?" అని అరిచాడు. అతని మాటలు వినగానే చంద్రప్రభుడు ముందుకొచ్చి "ఓయీ! బ్రహ్మరాక్షసా! ప్రాణత్యాగానికి నేను సిద్ధం. దయచేసి నా మిత్రులు ముగ్గురినీ వదిలెయ్యి. ఆనక నీ‌ సంతోషం కొద్దీ నన్ను భక్షించవచ్చు!" అన్నాడు ధైర్యంగా. బ్రహ్మ రాక్షసుడు నివ్వెరపోయినట్లు అతనికేసి చూస్తూ ఉండిపోయాడు. అయితే మిగిలిన ముగ్గురి ఆలోచనలూ వేరేగా ఉండినై. వాళ్ళు ముగ్గురూ కట్టగట్టుకున్నట్లు ఒక్కసారిగా పరుగు లంకించుకున్నారు.   అయితే వాళ్ళు మర్రి చెట్టును ఇంకా దాటకనే ప్రచండుడు వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాడు! భయంతో తన్నుకులాడుతున్న ముగ్గురినీ చేతుల్తో బంధించి నోటి దగ్గరికి తీసుకెళ్తూ "పిల్ల కుంకల్లారా! నానుండే తప్పించుకోవాలని చూస్తారా?! ఇంక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు!" అని అరచాడు కోపంగా. "నన్ను వదిలెయ్‌! నేను బంధుర రాజ్యపు యువరాజును. నీకు ఆహారం అయ్యేందుకు చంద్రప్రభుడు ఒప్పుకున్నాడుగా? వాడిని తిని, మమ్మల్ని ముగ్గుర్నీ వదిలెయ్" అని వేడుకోసాగాడు అనూరుడు. మిగిలిన ఇద్దరూ కూడా జాలిగా ఏడుస్తూ "అవునవును. భూతశ్రేష్ఠా! మేమైతే రాజకుమారులం. రాజ్యానికి మా అవసరం చాలా ఉంది. వాడు కేవలం మంత్రి కొడుకు. వాడిని తింటే వేరే ఎవరికీ నష్టం లేదు" అనటం మొదలుపెట్టారు. ప్రచండుడు వాళ్లు ముగ్గుర్నీ, చంద్ర ప్రభుడినీ కొంత సేపు మార్చి మార్చి చూసాడు. ఆ తర్వాత ముగ్గుర్నీ ఒక్క సారిగా నోట్లోకి వేసుకొని మ్రింగేసి, చంద్రప్రభుడిని మటుకు ఏం చేయకుండా విడిచి పెట్టేసాడు. బేతాళం కథ చెప్పటం ఆపి, "ఇంతకీ బ్రహ్మరాక్షసుడు ముగ్గురినీ ఎలా తినగలిగాడంటావు? ఎవరైనా ఒకరు ప్రాణత్యాగానికి సిద్ధపడితే మిగిలిన ముగ్గుర్నీ వదిలేస్తానన్నవాడు, దానికి వ్యతిరేకంగా చేయటం ధర్మ విరుద్ధం అవ్వదా? చంద్రప్రభుడిని ఎందుకు వదిలేసాడు? అతనిలోని నీతి సంపద వల్ల రాక్షసుడి హృదయంలో పరివర్తన కలిగి ఉంటుందా?" అని అడిగింది. విక్రం చిరునవ్వు నవ్వి, "నేను మాట్లాడగానే నువ్వు తిరిగి చెట్టెక్కుతావని తెలుసు. అయినా నీకు సమాధానం చెబుతాను. బ్రహ్మరాక్షసుడి హృదయపరివర్తన ఒట్టిదే. నిజంగా అట్లాంటిదేదైనా ఉంటే వాడు అందరినీ వదిలిపెట్టేసి ఉండేవాడు.    బ్రహ్మశాపం ప్రకారం వాడు రోజుకు ఒక్క ధైర్యశాలిని మాత్రమే తినగలడు. 'భయంతో‌ కొట్టుమిట్టాడే ముగ్గురిని తినాలా, ధైర్యంగా నిలబడ్డ ఒక్కడిని తిని ఊరుకోవాలా?' అన్న ఆలోచనలో‌ వాడి 'భూత నీతి' ముగ్గురిని ఎంచుకునేట్లు చేసింది. చంద్రప్రభుడి ధైర్యమే వాడిని కాపాడిందనటంలో సందేహం లేదు. మిగిలిన ముగ్గురూ తమలోకి పిరికితనాన్ని రానివ్వటం ద్వారా బ్రహ్మరాక్షసుడికి ఆహారం అయిపోయారనాలి!" అన్నాడు. విక్రంకి అలా మౌనభంగం అవ్వగానే బేతాళం అతన్ని తప్పించుకొని ఎగిరి వెళ్ళి, మళ్ళీ చెట్టెక్కింది.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు

  పల్లవి:         శుభాకాంక్షలు... శుభాకాంక్షలు... గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు భారతీయులందరికీ తెలుగువన్.కమ్ అందిస్తోంది గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు 1950 జనవరి 26 వ తేదీనాడు... సర్వసత్తాక సామ్యవాద  లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందింది... భారతీయులందరిని  కలసికట్టుగ ఎదగమంది...  శుభాకాంక్షలు..                                 చరణం: ఆంధ్రప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అరుణాచల్ ప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అస్సాం వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బీహార్ వాసులకు.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చత్తీస్ గడ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గోవా వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుజరాత్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హర్యానా వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హిమాచల్ ప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జమ్మూకాశ్మీర్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జార్ఖండ్ వాసులకు...  గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు           కర్నాటక వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కేరళ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మధ్యప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహారాష్ట్ర వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మణిపూర్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేఘాలయ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిజోరాం వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాగలాండ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒరిస్సా వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంజాబ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజస్ధాన్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సిక్కిం వాసులకు...  గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తమిళనాడు వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు త్రిపుర వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉత్తరాఖండ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉత్తరప్రదేశ్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పశ్చిమ బెంగాల్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనభారతదేశం వాసులందరికి తెలుగువన్.కమ్ అందిస్తోంది.                                    గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.   చరణం: అండమాన్ నికోబార్ దీవుల వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చండీఘడ్ వాసులకు.... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు         దాద్రానగర్ హవేలీ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డామన్ అండ్ డయ్యూ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఢిల్లీ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు లక్షద్వీప్ వాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పుదుచ్చేరివాసులకు... గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన భారత దేశ వాసులందరికీ తెలుగువన్.కమ్ అందిస్తోంది..                                       గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.

లేడికూన-మొసళ్ళు

లేడికూన-మొసళ్ళు   ఒకరోజున, నీళ్ళు తాగుదామని నది దగ్గరికి పోయింది, లేడికూన. దగ్గర్లోనే ఎక్కడో మొసలి దాక్కుని ఉందని దానికి అనుమానం వచ్చింది. మరి నిజంగానే నీళ్ళలో మొసలి ఉందో, లేదో- ఎట్లా, తెలిసేది? చటుక్కున లేడికూనకి ఒక ఉపాయం తట్టింది. అది పెద్దగా అన్నది- "చల్లటి నీళ్ళు తాగుదామని ఉంది- ఈ నీళ్ళు చల్లగా ఉన్నాయో లేదో?! కాలు పెట్టి చూస్తే పోలా?" అని. నిజంగానే అక్కడ నీళ్ళలో ఒక వెర్రి మొసలి దాక్కుని ఉంది. దానికి చాలా సంతోషం వేసింది. "ఆహా! ఇవ్వాళ లేడి కూర నాకు!" అని దాని నోట్లో చాలా నీళ్ళు ఊరాయి. అయితే లేడికూన ఏం చేసిందనుకున్నారు? కాలు పెట్టలేదు, నీళ్ళలో! ఒక కర్రపుల్లను తీసి, నీళ్ళలో ముంచింది, బుడుంగున. తయారుగా ఉన్న మొసలి వెంటనే ఒక్క దూకు దూకింది.   ఆ పుల్లను దొరకబుచ్చుకుని, నీళ్ళలోకి లాక్కున్నది. లేడికూన పెద్దగా నవ్వింది. వేరేచోటికి పోయి చక్కగా నీళ్ళు తాగింది. ఇంకో రోజున లేడికూన మళ్ళీ నీళ్ళు తాగడానికి పోయింది. చూస్తే నదిలో ఒక కర్ర దుంగ తేలుతూ ఉంది. అయితే నీళ్ళలో తేలే మొసలి కూడా దుంగలాగే ఉంటుంది! మరి అది మొసలా, కర్ర దుంగా? ఎలా, తెలిసేది? చటుక్కున లేడికూనకి ఒక ఉపాయం తట్టింది. అది పెద్దగా అరిచింది. "ఇది నా నేస్తం కర్ర దుంగ అనుకుంటాను. కర్ర దుంగ అయితే తప్పకుండా నాతో మాట్లాడుతుంది. అదే ఆ పాడు మొసలి అయితే అస్సలు మాట్లాడదు" అని. వెంటనే నీళ్ళలోంచి ఒక పెద్ద గొంతు వినిపించింది- "మిత్రమా! నేను నిజంగా కర్రదుంగనే" అని! లేడికూన నవ్వింది. "పిచ్చి మొసలీ! కర్ర దుంగలు ఎక్కడయినా మాట్లాడతాయా?" అని, పరుగెత్తి పారిపోయింది.  ఒకరోజు లేడికూన తన నేస్తం ఏనుగుతో కలిసి నది అవతలివైపుకు పోయింది. అక్కడ చాలా పండ్లు, దుంపలు తిన్నది. కడుపు నిండగానే దానికి ఇంటికి పోవాలనిపించింది. చూస్తే ఏనుగు ఇంకా తింటూనే ఉంది. సరేనని లేడికూన ఒక్కతే బయలుదేరింది. నదిదాకా వెళ్ళి చూస్తే మొసలీ, దాని నేస్తాలూ నీళ్ళలో తయారుగా ఉన్నాయి. ఏనుగు కూడా తోడు లేదాయె. నది దాటేది ఎట్లా? కొంచెంసేపు ఆలోచిస్తే దానికి ఒక ఉపాయం తోచింది. అది నది దగ్గరికి పోయి, "మొసలీ!" అని పిలిచింది. మొసలి పెద్దగా నోరు తెరిచి "ఆహా లేడికూనా! ఇవ్వాళ నిన్ను తినేస్తాను" అన్నది. "ఇవ్వాళ కాదు మొసలీ! రాజుగారు నన్ను నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయో లెక్క పెట్టుకు రమ్మన్నారు. లెక్క ప్రకారం మీకు సరిపోయినన్ని లేడికూనల్ని పంపిస్తారట. అప్పుడు కడుపునిండా తిందురు" అన్నది. మొసళ్ళన్నీ మహా సంతోషపడిపోయాయి. సరే ఎలా లెక్కపెడతావో చెప్పమన్నాయి.  "ఏముంది, మీరు నది ఈ చివర నుంచి ఆ చివర దాకా వరసా..గా నిలబడండి" అంది లేడికూన. "సరిగ్గా నిలబడకపోతే అన్ని మొసళ్ళూ లెక్కకి రావు! అప్పుడు రాజుగారు ఇచ్చే లేడికూనలు మీకే సరిపోవు. నాకేం?!" అని తొందర పెట్టింది కూడా.  మొసళ్ళన్నీ గబగబా వరస కట్టాయి. లేడికూన మొదటి మొసలి మీదికి దూకింది - "ఒకటి" అని అరిచింది. తరవాత ఇంకో మొసలి మీదికి దూకి, "రెండు" అన్నది. అట్లా దూకుతూ దూకుతూ ఆ పక్కకి చేరి, గట్టు మీదికి దూకేసింది. "మొత్తం ఎన్ని మొసళ్ళం ఉన్నాం? ఎన్ని లేడికూనల్ని పంపిస్తారు, రాజుగారు?" అడిగాయి మొసళ్ళు, ఆత్రంగా. "సరిగ్గా నదిని దాటేందుకు కావలిసినన్ని మొసళ్ళు. అన్నీ శుద్ధ మొద్దులు" అని నవ్వుకుంటూ పోయింది లేడికూన. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

బాధ్యత

బాధ్యత     అది మా తమ్ముడి పుట్టినరోజు. ఇంట్లో‌ మా అమ్మ చాలా హడావిడి చేస్తోంది. తనకు కాళ్ళు ఒకచోట నిలవడం లేదు. బంధువులంతా వచ్చారు; కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక భోజనాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్లంతా వెళ్ళాక, భోజనం చేసే చోటును శుభ్రం చేసుకుని, మా కుటుంబ సభ్యులం అందరం భోజనానికి కూర్చున్నాము. నేను అందరికీ‌ భోజనం వడ్డిస్తున్నాను. ఆ రోజు వంటలన్నీ మాకు ఇష్టమైనవే. సాధారణంగా మా నాన్నకి వంటకాలు ఇష్టమైతే అన్నం గబగబా తినేస్తాడు. కానీ ఎందుకనో, ఇవాళ్ల ఆయన చెయ్యి అంత చురుకుగా కదలట్లేదు. 'భోజనం నచ్చలేదేమో' అన్నట్లు ఒకసారి మా నాన్న మొహం వైపు చూసాను.   మా నాన్న ముఖంలో‌ సంతోషం-దు:ఖం రెండూ కనిపించాయి ఒకేసారి. "ఎందుకు?! అయినా భోజనం చేసేటప్పుడు అడగద్దులే" అని మౌనంగా ఊరుకున్నాను. భోజనం పూర్తి అయ్యాక, మా నాన్న లేచి. బయట అలా కుర్చీలో కూర్చోగానే నేను మెల్లగా వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నాను. "నాన్నా, ఏమైంది? ఇవాళ్ల నువ్వు‌ సంతోషంగా లేవు ఎందుకు? భోజనం కూడా సరిగా చేయలేదు"‌ అన్నాను. "ఏవో రకరకాల జ్ఞాపకాలు వచ్చాయి తల్లీ! ఏమంత గొప్ప సంగతులు కాదులే" అన్నాడు నాన్న, దాటవేస్తూ. "నేను ఇప్పుడు పెద్దదాన్నయ్యాను నాన్నా! చెప్పు, ఏమీ‌ పర్లేదు" అన్నాను నేను. నాన్న విచారంగానే నవ్వాడు. "నేను నీ అంత ఉన్నప్పుడు బాగానే చదివేవాడిని తల్లీ! కానీ ఎందుకో మరి, ఇంగ్లీష్ పరీక్ష రోజునే నాకు జ్వరం వచ్చింది: అస్సలు లేవలేని పరిస్థితి! దానితో నేను ఇంగ్లీష్ పరీక్షకు హాజరు కాలేక, పదవ తరగతి తప్పాను. నీలాగే నేను కూడా గవర్నమెంట్ బడిలో ఫస్టు వచ్చేవాడిని. పరీక్ష తప్పటంతో ఇంక చదువు ఆపేశాను. ఆ తరవాత కొన్నేళ్లకు మీ అమ్మతో పెళ్ళి అయ్యింది; తర్వాత బంగారు తల్లివి, నువ్వు పుట్టావు!" అన్నాడు.   నేను ఒక నవ్వు నవ్వాను. నాన్న కొనసాగించాడు: "నువ్వు పుట్టిన మూడు సంవత్సరాలకు వాడు పుట్టాడు. పుట్టిన మూడు నెలలకల్లా వాడిని మళ్ళీ ఆస్పత్రిలో చేర్చాము.." అని. నాకు ఈ సంగతి తెలీదు- "ఎందుకు నాన్నా?" అడిగాను. "ఊపిరితిత్తుల్లో కఫం చేరిందట- ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. బాగా పెద్ద బిల్లే వచ్చింది. ఆసుపత్రి చార్జీలకోసం ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పటికప్పుడు మన ఇల్లు అమ్మేసా. ఆ తరవాతే మనం ఈ ఇంట్లోకి బాడుగకు వచ్చి చేరాం.   ఇల్లు ఇరుకైపోయి, ఆ వెంటనే మగ్గం నేయటం కూడా‌ ఆపేశా. ఆ తరవాత మెల్లగా నెలకింత డబ్బు ప్రోగుచేసి, కొంత డబ్బు అప్పు చేసి ఒక ట్రాక్టర్ తెచ్చుకున్నాను. అటుపైన ట్రాక్టర్ ద్వారా ఇల్లు నడిపించా. ఒకవైపున మిమ్మల్ని చదివిస్తూ, ఆ అప్పు తీర్చేసి, మెల్లగా ఈమధ్యే క్రొత్త అప్పుతో రెండో ట్రాక్టర్ తెచ్చాం". నేను నిశ్శబ్దంగా తల ఊపాను. నాకు ఈ సంగతి తెలుసు. నాన్న తనలో తనే అనుకుంటున్నట్లు చెప్పాడు: 'నువ్వే నా మొదటి కొడుకువి, మొదటి కూతురువి కూడా నువ్వే తల్లీ. నువ్వు ఆరో తరగతిలో చేరేప్పుడు నేను నిన్ను ఏం అడిగానో గుర్తుందా?" "లేదు నాన్నా!" అన్నాను. "అప్పట్లో మన ఊరి బళ్ళో ఆరో తరగతి కొత్తగా మొదలెట్టారు. 'నువ్వు ఇక్కడ చేరతావా, టవున్లో ప్రైవేటు బడికి వెళ్తావా?' అని అడిగాను నిన్ను.   'నాన్నా! ప్రైవేటు బడి ఎందుకు, దండగ?! నేను మన ఊర్లో గవర్నమెంటు బడికే వెళ్తాను. ఇక్కడ టీచర్లు బాగా చెబుతారు కదా!' అన్నావు. నాకు అప్పుడు చాలా సంతోషం వేసింది తల్లీ.. ఆ చిన్న వయస్సులోనే మన ఆర్థిక స్థితిగతులు నీకు అర్థం అయ్యాయి. 'పిండి కొద్దీ రొట్టె చేసుకోవాలి' అని కూడా నీకు తెలిసింది. అందుకేరా నువ్వే నా మొదటి కొడుకూ, మొదటి కూతురూనూ. కానీ వీడికి ఆ దృష్టి లేదు. వీడి చదువు మటుకు ప్రైవైటు బడిలోనే సాగింది చూడు-" అన్నాడు. నేను నవ్వాను. "అప్పటికీ ఇప్పటికీ మనం కొంచెం‌ నిలద్రొక్కుకున్నాంలే నాన్నా!" అన్నాను. "ఒకవేళ మనం‌ ఆ ఇల్లు అమ్మకపోయినా, వాడిని ఆసుపత్రిలో చేర్చకపోయినా మనం కేవలం ముగ్గురమే ఉండేవాళ్లం తల్లీ- నువ్వూ. నేనూ, మీ‌ అమ్మా.."‌ అంటుంటే మా నాన్న కళ్ళలోను, నా కళ్ళలో కూడాను నీళ్ళు తిరిగాయి. అంతలోనే నాన్న సర్దుకొని "తల్లీ , బాగా‌ ఆలస్యమైంది. పడుకోపోరా. ఉదయాన్నే బడికి వెళ్ళాలి" అన్నాడు. నేను పడుకున్నా రాత్రంతా అవే ఆలోచనలు. ఆ రోజు తర్వాత జీవితమంటే 'బాధ్యత' అని, ఆషామాషీ కాదని అర్థమయ్యింది నాకు.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

వారసుడు

వారసుడు   అనగనగా ఒక రాజ్యంలో ఒక జమీందారు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు- రామరాజు, భీమరాజు. ఇద్దరూ అందంగా, బలంగా ఉండేవాళ్ళు; ఇద్దరూ తెలివైనవాళ్ళే. జమీందారు గారికి ఒక్కోసారి 'తన తర్వాత దివాణం ఎవరికి అప్పజెప్పాలి' అని దిగులు వేసేది. ఏమంటే ఏ ఒక్కరికి దివాణం బాధ్యత అప్పజెప్పినా రెండోవాడు నొచ్చుకునే ప్రమాదం ఉన్నది మరి! అందుకని జమీందారుగారు చాలా రోజులు ఆలోచించి, కొడుకులు ఇద్దర్నీ పిలిచి, "ఒరే! మీరిద్దరూ ఇప్పుడు పెద్దయ్యారు. ఇద్దరికీ మీవంటూ శక్తి సామర్ధ్యాలు తయార-య్యాయి. త్వరలో మీరు దివాణం బాధ్యతలు చేపట్టాలి- నా బరువూ తగ్గించాలి. అయితే దానికి సమాజం గురించిన అవగాహన చాలా అవసరం. అందుకని మీరిద్దరూ ఇప్పుడు దేశాటన చేయాలి. దేశాటన అంటే ఊరికే గుర్రాలెక్కి దేశం అంతా తిరగటం కాదు- మీదంటూ ఏదో ఒక పల్లెను ఎంచుకొని, అక్కడ సామాన్యుల-లాగా ఒక సంవత్సరంపాటు జీవించాలి. ఆ సమయంలో మీరు నా కొడుకులనిగానీ, సంపన్నులని గానీ ఎవ్వరికీ తెలియకూడదు. వీలైనంత తక్కువ ఖర్చుతో బ్రతకాలి ఈ ఏడాది అంతా. సంవత్సరం పూర్తిగా గడిచాక, మీలో ఎవరు ఎలా గడుపుతున్నారు అన్నదాన్నిబట్టి, నా బాధ్యతల్ని మీకు పంచుతాను - మరి వెళ్ళి రండి" అని ఇద్దరికీ చెరొక బండెడు శనక్కాయలు ఇప్పించి పంపాడు. రామరాజు తూర్పు దిక్కుగా ప్రయాణించి, చీకటి పడే సమయానికి ఒక పల్లె చేరుకున్నాడు. అక్కడ ఒక పూటకూళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి భోజనం పెట్టమన్నాడు. ఆ తర్వాత, డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి, దర్పంగా 'నేను ఎవరనుకున్నావు? జమీందారు గారి కొడుకును!' అని బుకాయించాడు. పూటకూళ్ళమ్మ ఎందుకు ఊరుకుంటుంది? 'ఎవరైనా కావచ్చు- నా డబ్బులు నాకు ఇచ్చెయ్యాల్సిందే' అని పట్టుపట్టి, అందరినీ పిలిచి రగడ చేసింది.    ఊళ్ళోవాళ్ళు కూడా అతను జమీందారు కొడుకంటే నమ్మలేదు. అతని దగ్గరున్న శనక్కాయలు అమ్మి అయినా సరే, ముసలమ్మ అప్పు తీర్చాలని తీర్మానించారు. మరాజు తన దగ్గరున్న బండెడు విత్తనాలనూ అమ్మి, ఆ డబ్బుతో డాబుగా కొన్నాళ్ళు బ్రతికాడు అదే ఊళ్ళో. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోవా? ఆ డబ్బు త్వరలోనే అయిపోవచ్చింది- ఇక అతను కొన్నాళ్లపాటు ఊళ్ళో అప్పులు చేస్తూ బ్రతికాడు. ఇంకా ఆరు నెలలు కూడా కాకుండానే, అప్పులవాళ్ళు అతన్ని కొట్టే పరిస్థితి వచ్చేసింది. దాంతో అతను ఎవరికీ చెప్పాపెట్టకుండా తండ్రి దగ్గరికి చేరుకున్నాడు! ఇక భీమరాజు పడమటి దిక్కుగా ప్రయాణించి, ఒక పచ్చని ఊరు చేరుకు-న్నాడు. అక్కడ పదిమందినీ విచారించి, చిన్న భూమి ఒకదాన్ని కౌలుకు తీసుకున్నాడు. తను తీసుకెళ్ళిన శనగ విత్తనాల్ని ఆ భూమిలో‌ నాటి, అందరిలాగే కష్టపడ్డాడు. ఊళ్ళో- వాళ్ళంతా 'అబ్బ! భీముడు మంచి పనిమం-తుడబ్బా' అనుకునేట్టు పనిచేశాడు. ఐదు నెలలు గడిచేటప్పటికి అతని విత్తనాలు అతనికి తిరిగి రావటమే కాదు; చాలా లాభం కూడా వచ్చింది. ఆ డబ్బుతో అతనొక చిన్నపాటి చేనును కొనుక్కున్నాడు కూడా. అలా సంవత్సరం తిరిగేటప్పటికి, తను ఒక్కడే తినటం కాదు; పదిమందికి అన్నం పెట్టే స్థితికి చేరుకున్నాడు.   ఇక సంవత్సరం గడిచినా భీముడు దివాణానికి తిరిగి రాలేదు. అతన్ని వెతుక్కుంటూ జమీందారు గారే ఆ పల్లెకు చేరుకున్నారు! అప్పుడుగానీ భీముడు జమీందారు బిడ్డడని ఊళ్ళోవాళ్ళకి తెలీలేదు! 'అయ్యో!‌ తెలీక ఇన్నాళ్ళూ మేం నిన్ను ఏదేదో అని ఉంటాం నాయనా! మనసులో పెట్టుకోబాక' అన్నారు ఊళ్ళో వాళ్లంతా. భీమరాజు నవ్వుతూ 'మీరు ఇట్లా అంటారనే గద, నేను మా నాన్న పేరు చెప్పనిది! మీరు నన్ను నన్నుగా చూడటమే నాకు ఇష్టం. ఇంతకాలం నన్ను మీవాడుగా ఆదరించారు. ఇప్పటికిప్పుడు నన్ను పరాయివాడిని చేయకండి' అన్నాడు. అతను తండ్రివెంట దివాణానికి వెళ్తుంటే సగం ఊరు వెంట వచ్చి వీడ్కోలు పలికింది. దివాణాన్ని ఎవరికి అప్పజెప్పాలో తెలిసి- పోయింది. జమీందారు గారు మెల్లమెల్లగా తన బాధ్యతలన్నీ భీమరాజుకు అప్పజెప్పటం మొదలు పెట్టారు. అటుపైన రామరాజుకు రాజధానిలో తగిన ఉద్యోగం దొరకటంతో, వారసుడి సమస్య సులభంగానే పరిష్కారమైంది. ప్రజల కష్ట-సుఖాలు తెలిసిన భీమరాజు తర్వాత్తర్వాత మంచి జమీందారుగా పేరు తెచ్చుకున్నాడు.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

బాలల దినోత్సవం

బాలల దినోత్సవం   బడిలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. వేదిక మీద వెనకగా ఉన్న ఫొటోలో చాచా నెహ్రూ నవ్వుతున్నాడు. ఫొటోకి ముందు పది కుర్చీలున్నై. గ్రామంలోని ముఖ్యులు వచ్చి ఆ కుర్చీల్లో కూర్చుంటారు. ఆ కుర్చీలముందు ఒక పెద్ద టేబుల్ ఉంది. దానిమీద మంచి రోజాపూల ప్లాస్టిక్ షీటు కప్పిఉంది. ఒక గాజు గ్లాసులో‌కొన్ని పూలు అందంగా అమర్చి ఉన్నై. బడి అంతా పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. క్రితం రోజున పట్నంలో కొనుక్కొచ్చి కట్టిన ప్లాస్టిక్ జెండాలు గాలికి ఊగుతూ వింతగా శబ్దం చేస్తున్నై. చెప్పినట్లుగా ఎనిమిది గంటలకల్లా వచ్చేసి, తరగతుల వారీగా వరసల్లో కూర్చున్నారు పిల్లలందరూ- వేదికకు ఎదురుగా.  కార్యక్రమాలు నడిపే పెద్దలంతా అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేస్తున్నారు. మైకులో‌దేశభక్తి గీతాలు- అవే తిప్పి తిప్పి వినిపిస్తున్నారు. సమయం పదిగంటలైంది. తొమ్మిదికే రావలసిన జిల్లా స్థాయి అధికారి గారు ఇంకా రాలేదు. ప్రధానోపాధ్యాయులవారు హడావిడిగా అందరికీ ఫోన్లు చేస్తున్నారు. పిల్లలు కొంచెం అసహనంగానే ఉన్నారు. డ్రిల్ సారుకు క్రమశిక్షణ ఎక్కువ. ఒక్క పురుగును కూడా బయటికి పోనివ్వటం లేదు. ఎండ ఎక్కువైంది. పిల్లలకు దాహార్తీ ఎక్కువైంది. కార్యక్రమం ఇంకా మొదలే కాలేదు. అధికారి గారు రావాలి, ఊరి పెద్దలు రావాలి, అందరూ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాలి, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, అప్పుడు గానీ‌ తినేందుకు ఏమీ ఇవ్వరు. ఆ తర్వాతే, ఇంటికెళ్లటం... నీళ్ళ పంపు దగ్గర రద్దీ పెరిగింది. తొక్కిసలాట మొదలైంది. డ్రిల్ సారు వచ్చి అందర్నీ తరిమేశారు అక్కడినుండి. కార్యక్రమాల్లో‌ పాల్గొనేందుకు రంగులు వేసుకున్న పిల్లల ముఖాలు వాడిపోయి ఉన్నై. ముఖాలమీద వాలే ఈగల్నీ, దోమల్నీ తోలుకోకుండా అలాగే భరిస్తున్నారు వాళ్ళు- మేకప్పులు పోతాయని. వరసల్లో పిల్లలు చాలామంది కడుపులు బిగబట్టుకొని కూర్చున్నారు. లేచి వెళ్దామంటే డ్రిల్ సారు ఏమంటారో అని భయం. బడిలో‌ ఎలాగూ టాయిలెట్లు లేవు. ఇప్పుడు దూరం వెళ్లి రావాలంటే కుదిరేట్లు లేదు.. పదకొండైంది. కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. అధికారి గారు రాలేదు. ఆకలౌతున్నట్లుంది పిల్లలకు. ఏమీ కాకనే నీరసించి పోయారు. ఆదే సమయంలో- బడి బయట నలుగురు పిల్లలు- ఒక బర్రె చుట్టూ చేరి సందడి చేస్తున్నారు. నలుగురికీ చొక్కాలు లేవు. వాటిని విప్పి తలకు చుట్టుకొని ఉన్నారు. ఒకడు బర్రెమీద ఎక్కి అటూ ఇటూ కాళ్ళు వేసుకొని, దాన్ని పట్టుకొని, గుర్రం తోలినట్లు 'చల్! చల్!' అంటున్నాడు. మరొకడు దాని కొమ్ములకు రంగు కాయితాలు అంటిస్తున్నాడు. మిగిలినవాళ్లు ఇద్దరూ బర్రెకు నీళ్లు పోస్తున్నారు సంతోషంగా. వీళ్ల సేవలందుకుంటూ అది కదలకుండా నిలబడి, తృప్తిగా చూస్తున్నది. "ఒరేయ్! మనం ఇయాల్ల బడికి బోలేదని డ్రిల్ సారు కొడితే యలాగా?" అన్నాడు వాళ్ళలో‌ఒకడు. "లేయ్! ఇయాల్ల బాలల దినోస్తవం. మన్నల్నెవ్వరూ యేమీ అనరు!" అంటున్నాడు మరొకడు, ధీమాగా.

పిండి కొద్దీ‌ రొట్టె

పిండి కొద్దీ‌ రొట్టె     విజయనగర సామ్రాజ్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనాడు రాజు గారి పుట్టిన రోజు. ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏడాదీ పుట్టినరోజునాడు రాజుగారు ఏనుగు అంబారీ మీద నగర వీధుల్లో సంచారం చేస్తారు. మనసుకు తోచినట్లుగా ధాన ధర్మాలు చేస్తారు. కృష్ణదేవులవారు మనసున్న ప్రభువు. ఎదుటివారి విద్వత్తును, వారి పాత్రతను అంచనా వేయటంలో ఆయనకు మరెవ్వరూ సాటిరారు. ఆరోజున ఒక వింత జరిగింది. మహారాజుల వారు వైభవంగా ఊరేగుతూ పేట వీధిలోకి వచ్చారు. అక్కడ ఆయన కోసమే ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడొక బిచ్చగాడు. పేరు అచ్చయ్య. అచ్చయ్యకు ఏలాంటి రోగమూ లేదు; ఇంకా వయసు మీరలేదు. వయసు మీరినవారికి, రోగులకు ప్రభువుల వారు అనేక ఉచిత భోజన సత్రాలు, వసతి క్షేత్రాలూ‌ఎలాగూ నిర్మించి ఉన్నారు. అచ్చయ్యకు బద్ధకం ఎక్కువ. పని చేయటం అంటే ఇష్టం లేదు. 'అడుక్కుతింటే చాలు కదా' అనుకునే వ్యక్తి. ఆ నాడు ప్రభువుల వారు తనని గుర్తిస్తారనీ, తన జోలెను వెండితోటీ, బంగారు తోటీ నింపేస్తారనీ, తాను ఇక పని చేయనవసరం లేకుండా జీవితాంతం‌ కాలుమీద కాలు వేసుకొని బ్రతకచ్చనీ కలలు కంటున్నాడు అచ్చయ్య. అంతకు ముందే రాణి వాసం నుండి ఎవరో వచ్చి అతని జోలె నిండా అన్నం వేసి వెళ్లారు. కానీ అచ్చయ్యకు ఇప్పుడు కావలసింది అన్నం కాదు. బంగారం.   రాజుగారి అంబారీ అతని ముందుకు వచ్చింది. ఊరేగింపు చూసేందుకు వచ్చిన జనంతో తొక్కిసలాట మొదలయింది. అచ్చయ్య జనాన్ని తోసుకొని తోసుకొని అంబారీ దగ్గరగా వెళ్ళాడు- అన్నంతో‌ నిండి ఉన్న తన జోలెను చూపిస్తూ "ధర్మం-ధర్మం!" అని అరిచాడు. రాజుగారు అంబారీని అపమని సైగ చేశారు. అచ్చయ్య "ధర్మం చేయండి బాబు! ధర్మం చేయండి" అని అడుగుతూనే ఉన్నాడు. రాజుగారు చిరునవ్వు నవ్వారు- "ముందు నాకు ఏమన్నా ఇవ్వు!" అని అడిగారు. అచ్చయ్యకు చాలా కోపం వచ్చింది. "ఈ జనాలకే కాదు; ప్రభువుకూ తన జోలె నిండిందని అసూయేనన్నమాట! ఏం, కనీసం ఇవాళ్లనైనా తను కడుపునిండా తింటే వీళ్ళకేమి? తను అడుక్కున్నదాన్ని వీళ్లకు ఎందుకివ్వాలి అసలు?" రాజుగారు అతనికేసే చూస్తున్నారు. అతని ఆలోచనల్ని ఆయన చదువుతున్నట్లున్నారు. కొద్దిసేపటికి బిచ్చగాడికి నిరాశ మరింత ఎక్కువైంది. "తను ఏమైనా ఇస్తే తీసుకుంటారు తప్ప, రాజుగారు ఇక తనకు ఏమీ ఇవ్వరు" అని నిశ్చయించుకున్నాడు. తనకు ఏమీ‌ ఇవ్వనివాడికి తను మాత్రం ఎందుకివ్వాలి?" అనుకున్నాడు. అయినా రాజుగారు చేయి చాపి అడుగుతున్నారు కనుక, తన జోలె నుండు ఒక అన్నం మెతుకు తీసి రాజుగారి వైపు విసిరాడు. రాజుగారు ఆ మెతుకును అందుకొని, దానికేసీ- అన్నంతో నిండి ఉన్న అచ్చయ్య జోలె కేసీ చూస్తూ నవ్వారు. అంబారీ మీదినుండి దేన్నో తీసుకొని అచ్చయ్యకు అందేట్లు విసిరారు. అంబారీని ముందుకు నడిపారు. కృష్ణదేవులవారి చేష్ఠ అర్థం కాలేదు అచ్చయ్యకు. అయినా ఒక్కమాటుగా ఎగిరి అందుకొని, 'అదేంటా' అని ఆత్రంగా చుశాడు దాన్ని. అన్నం మెతుకంత బంగారం తునక అది! తర్వాత కొద్ది సేపటికి మొదలైంది అచ్చయ్య బాధ- "అయ్యో! నేనెంత తెలివి తక్కువ వాడిని, జోలెలో ఉన్న అన్నాన్నంతా ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది?" అని. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పండు-మామిడి చెట్టు

పండు-మామిడి చెట్టు     పండుకి ఆరేళ్ళు. ఈమధ్యే కొత్తగా బడికి వెళ్ళటం మొదలు పెట్టాడు. బళ్ళో టీచరుగారు చెప్పేవన్నీ శ్రద్ధగా వినటం, వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటం- ఇవన్నీ‌ వచ్చేశాయి వాడికి. టీచరు రాజారావు గారంటే వాడికే కాదు, పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. రాజారావు వాళ్ళకి పరిసరాల విజ్ఞానం నేర్పేవాడు. చెట్లు, మొక్కలు, పూలు, కాయలు, విత్తనాలు, జంతువులు వీటన్నిటి గురించీ ఎంత చక్కగా చెప్పేవాడంటే, పిల్లలందరికీ అవంటే పెద్ద ఇష్టం పట్టుకున్నది. రాజారావు పిల్లల సాయం తీసుకొని, బడి చుట్టుప్రక్కల అంతా శుభ్రం చేయించేవాడు, కొత్తగా చెట్లు, మొక్కలు నాటించేవాడు; వాటిని పెంచే బాధ్యతను పిల్లలకే ఇచ్చాడు- ఒక్కోరిదీ ఒక్కో చెట్టు! పండు వంతుకు ఓ మామిడి చెట్టు వచ్చింది. రాజారావుగారు పండుకు చెప్పారు- "చూడు పండూ! నువ్విప్పుడు ఒకటో తరగతి. ఈ బడిలో ఇంకా నువ్వు ఐదేళ్ళుంటావు. ఇక్కడినుండి వెళ్ళేలోపల నువ్వు ఈ చెట్టునుండి వచ్చిన పళ్ళు తిని, అందరికీ‌ పంచి వెళ్తావు. సరేనా? దీన్ని జాగ్రత్తగా కాపాడుకో, మరి!" అని. ఆ మాటలు పండు హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. రోజూ బడి గంట కొట్టేలోగా రావటం, మామిడి మొక్క చుట్టూ పాదు సరిగా ఉందో లేదో చూసుకోవటం, అవసరమైతే సరి చేయటం, కొంచెం ఎరువు తెచ్చి వేయటం, దాని చుట్టూ పుల్లతో గీకి, నీళ్ళు పోయటం- మళ్ళీ బడినుండి ఇంటికి పోయేటప్పుడు 'బై' చెప్పి వెళ్లటం- అట్లా ఆ తర్వాత చాలా రోజుల వరకూ వాడి మనసంతా మామిడి మొక్క పైనే.   ఒక సెలవు రోజున ఆడుకునేందుకు బడి దగ్గరికి వెళ్లాడు పండు. ఆడుతూ ఆడుతూ అనుకోకుండా తన మామిడి చెట్టు వైపుకు వెళ్ళాడు. ఆశ్చర్యం! అది ఇప్పుడు పది అడుగుల ఎత్తు ఉన్నది! దృఢంగా, నిటారుగా పెరిగింది! అదంతా తను దానికి వేసిన ఎరువు మహత్యమే! పండుకి చాలా సంతోషం వేసింది. వెళ్ళి దాన్ని ఆప్యాయంగా నిమిరాడు. దానికి తన చెక్కిళ్ళు ఆనించి మురిసిపోయాడు. అంతలో వాడికి నేలమీద ఒక పెద్ద మామిడి పండు కనిపించింది. పెద్దగా, అందంగా, ఉదయించే సూర్యునిలాగా వెలిగి పోతోందది. ఎంత తియ్యటి వాసనో! మనసును ఊరించేంత తీపి! "నిన్నటి వరకూ ఒక్క కాయ కూడా లేదు, మరి ఒక్క రోజులోనే ఇంత మంచి పండు ఎలా తయారైందబ్బా?" అని తలెత్తి పైకి చూశాడు పండు. చూస్తే ఆశ్చర్యం! చెట్టు నిండా కాయలే! కొన్ని కాయలు ఆకుపచ్చగా ఉన్నై; కొన్ని పసుపు రంగుకు తిరుగుతున్నై. చెట్టు మీద రామ చిలుకలు కూర్చొని ఆ పళ్ళని ముక్కుతో వాసన చూస్తున్నై. "అరే! ఇన్ని కాయలు వచ్చినై! నేను గమనించనే లేదే?" అనుకున్నాడు పండు, మామిడి పండును చేతిలోకి తీసుకొని- "దీన్ని ఇంటికి తీసుకెళ్ళి అమ్మకు చూపిస్తాను" అని. అయితే ఆ ఉత్సాహంలో రెండడుగులు పడ్డాయో లేదో, అక్కడున్న ఓ రాయిని తట్టుకొని బొక్క బోర్లా పడ్డాడు వాడు. చేతిలోని మామిడిపండు కాస్తా దొర్లుకుంటూ పోయింది. పండు ఆ పండు వెంట పడ్డాడు. అది పోయి అక్కడే ఉన్న ఓ మల్లెపొదలో దూరి మాయమైంది. వాడు ఆ పొదలో అంతా వెతికాడు. ఎంత వెతికినా మామిడిపండు మాత్రం కనబడదే?! పండుకి చాలా బాధ వేసింది. "ఇంకో పండు ఎప్పటికి దొరుకుతుందో ఏమో" అని పైకి చూశాడు. చెట్టులో ఒక్క కాయ కూడా లేదు! అన్నీ మాయం! దు:ఖం ఆపుకోలేక ఒక్కసారి గట్టిగా ఏడ్చేశాడు పండు. వాడి ఏడుపు విని వంట పనిలో ఉన్న అమ్మ పరుగున వచ్చింది. "ఎందుకు నాన్నా, ఏడుస్తున్నావ్? అమ్మ నీ ప్రక్కనే ఉన్నదిలే, ఏడవకు. అప్పుడే తెల్లవారింది పండూ, ఇంక లే! లేచి, మొహం కడుక్కొని, స్నానం చేసి, బడికి వెళ్ళాలి కదా, నీ మామిడి మొక్కకి నీళ్ళూ పోయాలి!" అంది. "నా మామిడి మొక్క పెద్దదైపోయింది- పెద్ద మానైందిప్పుడు!" అన్నాడు పండు. "అవునా? అంత తొందరగానా?" అంది అమ్మ ఆశ్చర్యపోతూ.   "దానికి ఇంతలేసి కాయలు కూడా వచ్చాయి. ఇప్పుడిప్పుడే మాగుతున్నాయి" అన్నాడు పండు. అమ్మ నవ్వింది- "అంటే నీకో మంచి కల వచ్చిందన్నమాట!" అన్నది పండుని దగ్గరికి తీసుకుంటూ. "నీ చెట్టుకి పండ్లు వచ్చేసరికి నువ్వు నా అంత ఎత్తు అవుతావు. ఆలోగా నువ్వూ, నేనూ, అందరం వాటిని గురించి బాగా ఊహించుకోవచ్చు" అన్నది. "ఒక మంచి మామిడి పండు దొరికిందమ్మా; కానీ అది దొర్లుకుంటూ‌ మల్లెపొదలోకి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు!" అన్నాడు పండు ఏడుపు ముఖం పెట్టి. "నువ్వు రోజూ నీళ్ళు పోస్తుంటే, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది అట్లాంటి పళ్ళు నిజంగానే చాలా వస్తాయిరా, ఏమీ పర్లేదు" అంది అమ్మ వాడిని సముదాయిస్తూ. "చెట్టుకు చాలానే పళ్ళు ఉన్నాయి. కానీ అన్నీ‌ మాయమైపోయాయిగా?" అన్నాడు పండు నిజంగానే ఏడుస్తూ. "లేదురా, అవన్నీ ఇంకా నీ మామిడి మొక్క లోపలే ఉన్నై. అది పెద్దయ్యాక కదా, అవన్నీ బయటికి వచ్చేది? అంత వరకూ అవి నీకు ఇట్లా కలల్లో కనిపిస్తుంటాయి. అట్లాంటి కలలు చాలా సార్లు వస్తాయిలే, అదంతా మామూలే!" వివరించింది అమ్మ. పండుకి ఆ ఐడియా నచ్చింది. వాడి పెదాలమీద చిరునవ్వు మొలిచింది. ఆలోగా ఒక పని చెయ్యాలి. మీ టీచరుగారిని అడిగి 'మామిడి చెట్టు ఎప్పుడు పూలు పూస్తుంది, ఎప్పుడు కాయలు కాస్తుంది, మామిడి చెట్లను ఎట్లా పెంచాలి' అన్ని వివరాలూ కనుక్కొని రావాలి. అవన్నీ తెలిస్తే మనకు గుర్తుగా ఉంటుంది కదా" పని పెట్టింది అమ్మ. కార్యశీలి పండు గబగబా లేచాడు- ముఖం కడుక్కునేందుకు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

చిత్తైన పులి

చిత్తైన పులి   అనగనగా ఒక అడవి, అడవి ప్రక్కనే ఒక ఊరు ఉండేవి. ఆ ఊళ్లో నివసించే రామయ్యకు పెద్ద గొర్రెలమంద ఉండేది. తరతరాలుగా వాళ్ళది అదే వృత్తి. గొర్రెల్ని పెంచటం, అవి ఎదిగినాక మంచి ధరకు అమ్మటం. చాలా ఏళ్ళపాటు అతని వ్యాపారం బాగానే సాగింది. అయితే కొంతకాలంగా అదంతా కష్టాల్లో పడింది. ఆ కష్టాలకు కారణం ఒక చిరుతపులి. ఆ చిరుతపులి అడవిలో తిరుగాడేది; రోజూ రాత్రిపూట వచ్చి, ఒకటి రెండు గొర్రెలను ఎత్తుకెళ్ళేది. రామయ్య దాన్ని గురించి అటవీశాఖ వాళ్లకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.  అట్లా అని దాన్ని చంపటమేమో నేరం! అయినా "ఏదైతే అదౌతుంది- పులిని చంపేస్తాను" అని రామయ్య ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా మాటు వేసినా, చిరుతపులి మాత్రం తెలివిగా ఎలాగోలా కనీసం ఒక గొర్రెనైనా తిని పోతూనే ఉంది. దాంతో‌ రామయ్య వ్యాపారం, దానితో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతిన సాగినై. "ఈ పులి బాధనుండి తప్పించుకోవటం ఎలా?" అని సతమతమౌతూండగా, దేవుడు పంపించినట్లు వాళ్ళ అన్నయ్య వచ్చాడు ఊరికి. రామయ్య శరీరపు తీరుని, అనారోగ్యాన్ని గమనించి "ఏమైందిరా?" అని అడిగాడు. రామయ్య చెప్పింది అంతా విని, "నాకు తెలుసు, ఏం చేయాలో!" అన్నాడు అన్నయ్య.   ఆ రోజు రాత్రి చిరుతపులి ఎప్పటిలాగే గొర్రెలను తిందామని వచ్చింది. ఆరోజున దానికి అక్కడ పుష్టిగా ఉన్న గొర్రెలు చాలా కనిపించాయి. అవన్నీ ఒకదానినొకటి ఆనుకొని నిలబడి ఉన్నాయి. పులి తటాలున ఒక గొర్రె మీదికి దూకి, దాని మెడను పట్టుకొని కొరికేసింది. మామూలుగా అది ఒక గొర్రెమీదికి దూకగానే మిగతా గొర్రెలన్నీ ప్రాణభయంతో అరుస్తూ పారిపోయేవి. కానీ ఆరోజున అవేవీ పారిపోలేదు. నిశ్శబ్దంగా అలాగే దానికేసే చూస్తూ నిలబడ్డాయి. చిరుతపులికి ఏమీ అర్థం కాలేదు. 'ఇవాళ్ల నేను రెండు గొర్రెల్ని ఈడ్చుకు పోతాను" అని అది వెంటనే మరో గొర్రె మీదికి దూకి, దాని మెడను పట్టుకొని చీల్చివేసింది. అయితే అదేం చిత్రమో, సరిగ్గా అదే క్షణానికి దానికి కళ్ళు తిరిగినట్లయింది! "ఏమౌతున్నది?" అనుకునేలోగానే దానికి ఎక్కడ లేని మైకం వచ్చి, తటాలున పడిపోయింది. అంతలోనే ప్రక్క గదిలోంచి వచ్చిన రామయ్య, వాళ్ల అన్నయ్య ఇద్దరూ తాము తెచ్చిన తాళ్లతో పులి కాళ్ళు, నోరు అన్నీ కట్టేసారు. పులికి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి, కానీ ఏమీ చెయ్యలేక ఊరుకున్నదది! తెల్లవారాక, పులిని అటవీ శాఖ వారికి అప్పజెప్పారు రామయ్య, అన్నయ్య. వాళ్ళు వచ్చి, పులిని బోనులో పెట్టుకొని తీసుకుపోయారు. ఇంతకీ అన్నయ్య ఏం చేసాడు? ఆరోజు ఉదయం అంతా కూర్చొని దూదితో ఒక పదికి పైగా గొర్రెల్ని చేయించాడు. వాటి మెడ దగ్గర మటుకు గొర్రె మాంసపు ముక్కలు పెట్టి కుట్లు వేయించాడు. మాంసంలోను, గొర్రె బొమ్మల మెడల దగ్గర కూడాను, అంతటా దట్టంగా మత్తు మందు చల్లించాడు.   ఇక ఆరోజు రాత్రి నిజం గొర్రెలన్నింటినీ పాకలోంచి రామయ్య పడుకునే గదిలోకి తెచ్చి, తలుపులు, కిటికీలు అన్నీ బిగించాడు. పులి అలవాటుగా అవి ఉండే పాకలోకే వెళ్ళి, అక్కడ ఉన్న గొర్రె బొమ్మల్ని చూసి, నిజం గొర్రెలు అనుకున్నది. నిజంగానే మరి, అది కొరికిన చోటల్లా గొర్రె మాంసమే ఉందాయె! అట్లా మత్తు మందు ప్రభావానికి గురైన పులి, రెండో గొర్రెను కొరకటం వరకూ చేయగలిగింది గానీ, ఆ తర్వాత ఇక తట్టుకోలేక పడిపోయింది! ఆ రకంగా అది అత్తవారింటికి- అంటే అటవీ శాఖవారి సంరక్షణ శాలకు- చేరుకున్నది! ఇక అటుపైన రామయ్య గొర్రెల వ్యాపారం దిన దినాభివృద్ధి చెందింది. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

స్వాగతం

స్వాగతం     పరమానందయ్య గారి శిష్యులు పదిమంది ఓసారి ఒక నదిని దాటారట. ప్రవాహవేగం ఎక్కువగా ఉందేమో, అందరూ జాగ్రత్తగా దాటవలసి వచ్చింది నదిని. తీరా అవతలి తీరం చేరుకున్న తర్వాత వారికి అనుమానం కలిగింది - `అందరం గట్టున పడ్డామా లేదా?' అని! ఏం చేయాలి? ఇక లెక్కపెట్టక తప్పలేదు. ప్రతివాడూ మిగతావాళ్లందర్నీ లెక్కపెట్టి చూశాడు. అందరూ తొమ్మిదిమందే ఉన్నట్లు లెక్క తేల్చారు. ఉండాల్సినవారేమో పదిమంది. అంకెలేమో తొమ్మిదే వస్తున్నాయి. ప్రతివాడూ తనను తాను ఒదిలి మిగిలిన తొమ్మిదిమందినీ లెక్కపెడుతున్నాడు! చివరికి ఇక అందరూ ఏడవటం మొదలుపెట్టారు - కొట్టుకుపోయిన పదోవాడిని తలుచుకొని. అప్పుడో పంతులుగారు వచ్చారు అటువైపు. తనూ లెక్కపెట్టిచూశారు. పదిమందీ ఉన్నారని నిర్ధారణ చేసుకొని చిరునవ్వు నవ్వారు. ఒక్కొక్కడినీ పిలిచి వీపుమీద బలంగా చరిచారు. దెబ్బపడిన ప్రతివాడినీ తను ఎన్నవవాడో అరవమన్నాడు. ఒకటోవాడినుండీ మొదలెడితే పదోవాడివరకూ అందరూ అరిచారు. పదిమందీ ఉన్నారని అందరూ మహా సంతోషపడ్డారు. అయినా వాళ్లకో సందేహం మిగిలిపోయింది. "పంతులుగారు పదోవాడిని ఎలా రక్షించి తెచ్చారు?" అని. ఈ కథ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా, మనమూ వీళ్లలాగానే ఉంటాం: సమాజం గురించి ఆలోచించేటప్పుడు మనల్ని మనం లెక్కపెట్టుకోం. ’ఆ సమాజంలో మనమూ ఒకళ్లం’ అని మరచిపోతూ ఉంటాం. సామాజిక బాధ్యతని విస్మరించటం చాలా సుళువు. సమాజంలోని ప్రతి చెడువెనకా మనందరి బాధ్యతా ఎంతోకొంత ఉందని గుర్తించగలిగిననాడు మన జీవితాలే కాదు; సమాజం యావత్తూ పురోగమించగలదు. అప్పుడుగానీ మన సమాజంలోని హింసకు సరైన ప్రత్యామ్నాయాలు లభించవు.  ఏమంటారు? - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

చెల్లీ రావే

చెల్లీ రావే   చెల్లీ రావే! సిరిమల్లీ రావే! అడవితల్లి ఒడిలో ఆడుకుందమురావె! (2) పసుపు పచ్చాని చీర కట్టుకున్న అడవి తల్లిని చూడు! ఆమె అందము చూడు! "చెల్లీ రావే!" కొండ కోన - వాగు వంక వయ్యారము చూడు! వంపు సొంపులు చూడు! "చెల్లీ రావే!" వానజల్లు వరద చూడు! పొంగుతున్న సెలయేరులు చూడు! "చెల్లీ రావే!" చింత చెట్టు చిగురు చూడు! చెట్టుమీద చిలుక పలుకులు చూడు! "చెల్లీ రావే!" కుంకుడు చెట్టు పువ్వులు చూడు! విప్ప చెట్టు మీద - తేనె పట్టును చూడు! "చెల్లీ రావే!" సీమ గరిక దూది పరుపుల మీద చిందులేసే లేగదూడను చూడు! "చెల్లీ రావే!" అంబా అంటూ తన బిడ్డను పిలిచే తెల్లావును చూడు! దాని ప్రేమను చూడు! "చెల్లీ రావే!" - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కృతఘ్నత

కృతఘ్నత   ఒకసారి, మంచిమనిషి ఒకడు ఒక అడవిదారిన పోతున్నాడు. మధ్యలో దాహంవేసి వెతుక్కుంటే అతనికో పాడుపడ్డ బావి కనిపించింది. అతను లోపలికి తొంగిచూడగా దానిలో నుండి "రక్షించు! కాపాడు" అని అరుపులు వినవస్తున్నాయి. ఒక సింహం, ఒక పాము, ఇంకా ఇద్దరు మనుషులు అందులో పడి, బయటికి రాలేక అరుస్తున్నారు, ఆర్తిగా. సింహం అన్నది - "నాకు సాయం చెయ్యి. నన్ను బావిలోంచి బయటికి తీయి. నీ మేలు మరువను" అని. "అమ్మో! `సింహం' అనుకుంటేనే నాకు వణుకు పుడుతున్నది. నిన్ను బయటికి తీస్తే నువ్వు ఊరుకుంటావా? నన్ను తప్పక తినేస్తావు. అందులోనూ బావిలోపడి నీకు కడుపు నకనకలాడుతూండాలి" అని. "లేదు లేదు. నేను నిన్నేమీ చేయనని మాట ఇస్తున్నాను. నమ్మకం ఉంచు. దయచేసి నాకు సాయం చెయ్యి" అని ప్రాధేయపడింది సింహం. దగ్గర్లో పెరుగుతున్న తీగల్ని మోకుల మాదిరి అల్లి, మంచి మనిషి సింహాన్ని బావిలో నుంచి బయటికి లాగాడు. సింహం అతన్ని తినలేదు.  "మా గుహ దగ్గరికి రా, ఎప్పుడైనా. నీకు ఏమైనా ఇద్దామని ఉన్నది నాకు. అయితే నేను వెళ్లే ముందు నీకొక సలహామాత్రం ఇచ్చిపోతాను. ఈ ఇద్దరు మనుషులకూ మాత్రం సాయం చేయకు. వీళ్లు మంచి వాళ్లుకాదు" అని చెప్పి, అది సంతోషంగా వెళ్లిపోయింది.  అప్పుడు పాము అతన్ని వేడుకున్నది; తననూ బయటికి తీసి పుణ్యం కట్టుకొమ్మన్నది. మంచి మనిషి "అమ్మో, నాకు పాములంటే భయం" అన్న మీదట, అది కూడా అతనిని ఏమీ చేయనని ప్రమాణాలు చేసింది. మనిషి పామునుకూడా బయటికి లాగాడు. "ఏ సహాయం అవసరమైనా నన్ను తలుచుకో" అని పడగ ఊపుకుంటూ సంతోషంగా వెళ్లిపోయింది పాము. వెళ్లేముందు - బావిలో పడి ఉన్నకంసాలినీ, మంగలినీ మాత్రం బయటికి లాగవద్దని హెచ్చరించి మరీ వెళ్లింది.   కానీ, కంసాలి, మంగలీ తమనుకూడా బయటికి లాగమని ప్రాధేయపడితే, మంచి మనిషి కాదనలేకపోయాడు. "వాళ్లూ నాలాగా మనుషులే కదా" అనుకున్నాడు. మోకుల్ని ఇంకా బలంగా అల్లి బావిలోకి వదిలితే, వాళ్లిద్దరూ వాటిని పట్టుకొని పైకి వచ్చారు. వాళ్లూ అతనికి ధన్యవాదాలుతెలియజేసుకొని, తమ నగరానికి వచ్చినప్పుడు తమను తప్పకుండా కలవమని ఆహ్వానించారు. అతను చేసిన సాయానికి ప్రతిగా తామూ ఏదైనా సాయం చేస్తామని మాట ఇచ్చారు. తన యాత్రలు ముగించుకొని తిరిగివస్తూ ఆ మంచిమనిషి అడవిలో సింహాన్ని కలిశాడు. సింహం అతన్ని చూడగానే ఎంతో సంతోషపడ్డది. అతనికి అడవంతా తిప్పి చూపించి, అతను వెళ్తూండగా ఒక వజ్రపుటుంగరాన్ని బహుమానంగా ఇచ్చింది. మంచిమనిషి నగరంలోకి వెళ్లి మంగలి గురించీ, కంసాలి గురించీ వాకబుచేస్తే, మంగలి ఇప్పుడు నగరానికి కొత్వాలు అయ్యాడనీ, కంసాలి రాజుగారికి దగ్గరవాడనీ తెలియవచ్చింది. వాళ్లూ మంచిమనిషిని చక్కగా సమాదరించారు. అయితే మంచిమనిషి వారికి సింహం ఇచ్చిన వజ్రపుటుంగరం చూపించగానే వాళ్లు అతన్ని రాజుగారి సైనికులకు పట్టించారు.  రాజుగారికి ఒక కుమార్తె ఉండేది. కొద్ది రోజులక్రితమే ఆమె అడవిలోనికి వెళ్లి ఇక తిరిగి రాలేదు. ఆమె జాడ తెలియజేసిన వారికి, లేదా ఆమె ఆభరణాలు వేటినైనా తెచ్చి ఆమెగురించిన సమాచారం కనుగొనటంలో సాయం చేసినవారికి గొప్ప బహుమానాన్ని స్తానని రాజుగారు ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు మంగలి కొత్వాలు అయినప్పటికీ మంచిమనిషిని దయతో చూడక, చెరసాలలో పెట్టి హింసలపాలు చేశాడు. ఆ ఉంగరం తనకు సింహం బహుమానంగా ఇచ్చిందనీ, తనేపాపం ఎరుగననీ ఎన్ని విధాలుగా చెప్పినా అతను అర్థం కానట్లే వ్యవహరించాడు. ఇక అతనినెవరు నమ్ముతారు? అతనే తన కుమార్తెను చంపి ఉంగరాన్ని అపహరించాడని రాజుగారు నమ్మారు. శిరచ్ఛేద శిక్ష విధించారు.  ఇంకా రెండు రోజుల్లో శిక్ష జరుపుతారనగా, మంచిమనిషికి ఇక నిద్ర పట్టలేదు. ఏదో ఒకటి చేసి ప్రాణాలు కాపాడుకోవాలి - ఏం చేయాలి' అని ఆలోచిస్తూండగా, అతనికి పాము గుర్తుకు వచ్చింది. అతను తలుచుకోగానే పాము, ఎలా వచ్చిందో ఏమో, అతనిముందు ప్రత్యక్షమైఏం చేయాలి, చెప్పు' అన్నది. మంచిమనిషి దానికి జరిగినదంతా చెప్పాడు. "ఆ దుర్మార్గుల్ని బయటికి లాగొద్దని నీకు ఆనాడే చెప్పాను. చూడు, ఇప్పుడేం జరిగిందో! అయినా నువ్వు కష్టకాలంలో నాకు సాయం చేశావు గనక నిన్నూ ఈ కష్టాల్లోంచి గట్టెక్కిస్తాను. నేను వెళ్లి రాణిగారిని కరుస్తాను. నువ్వు విషాన్ని విరిచేస్తానని రాజుగారికి కబురు పంపు. మిగతాదంతా నేను చూసుకుంటాను" అన్నది పాము.   ఆ రాత్రే రాణిని పాము కరిచి ఆమె బాధగా తన్నుకులాడటం మొదలైంది. రాజుగారు వైద్యులకోసం కబురంపారు. ఆలోగా సమయం అయిపోయింది. మంచివాడికి శిక్ష అమలు జరపబోతూ `చివరి కోరిక ఏమిటని' అడిగితే, అతను రాణిని కాపాడతానన్నాడు. వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు అతన్ని. రాజుగారి అనుమతితో అతను రాణిగారి మందిరంలోకి రాగానే, పాము ప్రత్యక్షమై, రాణి గారి గాయం వద్ద నోరుపెట్టి విషాన్నంతా వెనక్కు లాక్కున్నది! రాణిగారి బాధ మటుమాయం! రాజుగారు సంతోషించారు. కానీ తన కుమార్తెను చంపినవాడి పట్ల ఆయన కోపం పోలేదు.  అయితే ఆయన మంచివాడి సేవ వల్ల కొంచెం మెత్తబడ్డాడు. మంచిమనిషి తన కథను మళ్లీమళ్లీ రాజుగారితో చెప్పుకున్నాడు. బావిలోంచి తను సింహాన్నీ, పామునీ, కంసాలినీ, మంగలినీ ఎలా బయటికి లాగాడో చెప్పాడు. కావాలంటే కంసాలినీ, మంగలినీ సాక్షులుగా పిలిపించి అడగమన్నాడు. అయితే కంసాలీ, మంగలి తాము అస్సలు ఈ మనిషినే చూడలేదని బొంకారు! ఇక సింహం వచ్చి స్వయంగా చెబితే తప్ప, వేరే మార్గం లేదనిపించింది మంచి మనిషికి. కానీ సింహం ఎలాగ, వచ్చేది? అయితే అతను అలా అనుకునే సమయానికే నగరమంతటా సింహగర్జనలు వినిపించాయి. సింహం తన స్నేహితులనందరినీ వెంటబెట్టుకొని మనిషిని కాపాడటం కోసం వచ్చేసింది - రాజుతో సహా నగరవాసులందరూ భయకంపితులైపోయేటట్లు! ఈ మనిషి నిజమే చెబుతున్నాడని రాజుకు విశ్వాసం కలిగిన తరువాత, సింహాలు ఠీవిగా నడుచుకొని అడవిలోకి వెళ్లిపోయాయి. రాజుగారు మంగలికీ, కంసాలికీ శిరచ్ఛేద శిక్ష విధించారు! మంచి మనిషిని సన్మానించి సాగనంపారు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

బూష్టుపొడి తెచ్చిన తంటా

బూష్టుపొడి తెచ్చిన తంటా   ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఒకసారి అది పాలు కలుపుకోబోతుంటే బూస్టు పొడి అయిపోయిందని గుర్తుకొచ్చింది. మరేం చేయాలి? అందుకని అది ప్రక్కింటి నక్కమ్మ దగ్గరికి వెళ్ళి " ఒక చెంచాడు బూస్టు పొడి ఇవ్వవా, నీకు మళ్ళీ తెచ్చి ఇస్తాను" అని అడిగింది. నక్కమ్మ అంత మంచిదేమీ కాదు. మాములుగా అయితే ఇవ్వదు కదా! అదన్నది, "సరే అయితే- నీకో చెంచాడు ఇస్తాను, కానీ నువ్వు నాకు తిరిగి ఇచ్చేటప్పుడు రెండు చెంచాలు బూస్టు పొడి ఇవ్వాలి మరి. అలా అయితేనే నేను ఇచ్చేది" అన్నది. కుందేలు "సరే" అని చెప్పి బూస్టు పొడి తెచ్చుకున్నది.   తరువాతిరోజున కుందేలు రెండు చెంచాలు బూస్టు పొడిని తీసుకెళ్ళి నక్కమ్మకు ఇవ్వబోయింది. కానీ నక్కమ్మ ఆశపోతు కదా, అది తీసుకోలేదు. అన్నది, "నువ్వు నాకు ఇవ్వాల్సింది మూడు చెంచాల పొడి కదా, మరి రెండే ఇస్తున్నావేం? " అని! ఆ మాటలు విన్న కుందేలు నిర్ఘాంతపోయింది. పాపం దాని దగ్గర ఎక్కువ బూస్టు లేదు. అందుకని అదన్నది "కాదు. మన ఒప్పందం ప్రకారం నేను ఇవ్వాల్సింది రెండు చెంచాల పొడే. మూడెందుకు ఇవ్వాలి?" అన్నది.   " కాదు, నేను ఆ రోజునే చెప్పాను. మూడు చెంచాల పొడి తిరిగి ఇవ్వాలని! ఇప్పుడు నన్ను మోసం చెయ్యకు" అని గొడవ చేసింది జిత్తుల మారి నక్క. గొడవ పెద్దదైంది. చివరికి ఇద్దరూ న్యాయం కోసం ఏనుగు రాజు గారి దగ్గరకు వెళ్ళారు. ఏనుగు రాజుగారు ఆ రోజున హడావిడిగా ఉన్నారు. వీళ్ళ గొడవ తేలేట్లు లేదు. రేపు "రండి" అని చెప్పారు. వాళ్ళు వెళ్తుండగా కుందేలును వెనక్కి పిలిచి చెవిలో ఏదో చెప్పారు గుసగుసగా ఏనుగుగారు.   మర్నాటి రోజున ఉదయమే కుందేలూ, నక్కా రెండూ రాజు గారి ముందుకొచ్చి నిలబడ్డాయి. " సమస్య ఏంటి కుందేలూ" అని అడిగారు రాజుగారు." ఏమీ లేదు ప్రభూ! ఈ నక్క మా పొరుగింట్లో ఉంటుంది. నేను తనకు మూడు చెంచాల బూస్టు పొడి ఇవ్వాలని గొడవ చేస్తున్నది. ఊరికే నేనెందుకు ఇవ్వాలి, మీరే చెప్పండి ప్రభూ " అన్నది కుందేలు. "ఊరికే ఏమీ ఇవ్వనక్కరలేదు " అన్నారు రాజుగారు.   "కాదు ప్రభూ, కుందేలు నా దగ్గర ఒక చెంచా బూస్టు పొడి అప్పు తీసుకున్నది. ఇచ్చేటప్పుడు మూడు చెంచాల పొడి ఇస్తానన్నది. ఇప్పుడేమో మూడు ఇవ్వను, రెండే ఇస్తానంటున్నది " అన్నది నక్క. " నేనెక్కడ అన్నాను? నేనసలు దీని దగ్గర ఏమీ తీసుకోలేదు. మహారాజా, దీనికి ఏమీ ఇవ్వనక్కర్లేదు " అన్నది కుందేలు. ఇప్పుడు నిర్ఘాంతపోవటం నక్క వంతైంది. "ఏంటీ? నాదగ్గర ఏమీ తీసుకోలేదా?" అన్నది అది ఆశ్చర్యపోతూ.   " నేనెక్కడ తీసుకున్నాను? నేనేమీ తీసుకోలేదు. నేనేమీ నీకు ఇవ్వనక్కర్లేదు కూడా " అంది కుందేలు "మీరే న్యాయం చెయ్యాలి రాజా. ఇది నా దగ్గర ఒక చెంచాడు బూస్టుపొడి అప్పు తీసుకున్నది. "నిజం!" అరిచింది నక్క. "నాకేం తెలీదు ప్రభూ, నన్ను కాపాడండి" అన్నది కుందేలు. దీనంగా ముఖం పెట్టి. " ఏయ్ కుందేలూ! నువ్వు నా దగ్గర ఒక చెంచాడు పొడి తీసుకోలేదూ? తిరిగి ఇచ్చేటప్పుడు రెండు చెంచాల బూష్టు పొడి ఇవ్వాలని నేనంటే" సరే" అని నువ్వనలేదూ? నిజం చెప్పు!" అని అరిచింది నక్క. ఒళ్లు తెలీని కోపంతో.    ఏనుగు రాజుగారు నవ్వారు. " ఇదే అసలు నిజం. దురాశ కొద్దీ నక్క రెండు చెంచాల బదులు మూడు చెంచాల పొడి కావాలని పోరు పెట్టింది. ఇప్పుడు నిజం బయటపడింది. కుందేలుది ఏ తప్పూ లేదు. మోసం చేయాలనుకున్నందుకుగాను నక్కకు నష్టం జరగాల్సిందే. కుందేలు నక్కకు ఏమీ ఇవ్వక్కర్లేదు." అని తీర్పు ఇచ్చారు.  సభలోని వారంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో