సీజ్ ఫైర్ ఉల్లంఘించి మరీ ఇరాన్ పై అమెరికా దాడులు
Publish Date:May 26, 2026
Advertisement
మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొంటుందని ప్రపంచమంతా ఆశిస్తున్న తరుణంలో అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ ఇరాన్ పై దాడులకు పాల్పడింది. గత నెల 7న కుదిరిన చారిత్రాత్మక సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని పక్కనబెట్టి, అమెరికా సైనిక దళాలు ఇరాన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక ప్రాంతాలైన ఖేష్మ్ పోర్ట్, బందర్ అబ్బాస్ లక్ష్యంగా అమెరికా జరిపిన ఈ వైమానిక దారులు గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పరిధిలో అమెరికా నౌకాదళ ఆస్తులపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడులు పరిమిత సైనిక చర్య మాత్రమేనని, పూర్తి స్థాయి యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించడం తమ ఉద్దేశం కాదని అమెరికా సీనియర్ అధికారులు పేర్కొన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భీతావహంగా మారింది. ఇరాన్ అధికారిక మీడియా కథనాల ప్రకారం.. ఖేష్మ్ ఐలాండ్, బహమన్ పీర్, బందర్ అబ్బాస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా దళాలు తమ పౌర నివాస ప్రాంతాలను, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని కాల్పుల విరమణ ఒప్పందాన్ని దారుణంగా ఉల్లంఘించాయని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతిచర్యగా, హోర్ముజ్ జలసంధిలో ఉన్న శత్రు దళాలపై ఇరాన్ నేవీ మిస్సైల్, డ్రోన్ విభాగాలు ఎదురుదాడికి దిగాయి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. హోర్ముజ్ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగినప్పటికీ సీజ్‌ఫైర్ ముగిసిపోలేదు అని ప్రకటించారు. డ్రోన్ హబ్‌లు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నిఘా కేంద్రాల నుండి పొంచి ఉన్న ముప్పును అణచివేయడానికే తాము ఈ దాడులు నిర్వహించామని అమెరికా సైనిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై స్పందిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమలులోనే ఉందన్నారు. అయితే.. ఇరాన్ గనుక అణు ఒప్పందానికి అంగీకరించకపోతే భవిష్యత్తులో ఇంతకంటే ఘోరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/us-launches-attacks-on-iran-36-220864.html





