ప్లేఆఫ్స్ కు రాజస్థాన్
Publish Date:May 24, 2026
Advertisement
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ రేసుకు దూసుకెళ్లింది. ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో చివరి బెర్తును రాజస్థాన్ రాయల్స్ ఖాయం చేసుకుంది. ముంబై వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ తమ స్థానాన్ని పదిలం చేసుకోవడమే కాకుండా, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఇక చండీగఢ్‌లో మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల స్కోరును నమోదు చేసింది. బ్యాటర్లందరూ సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ ఈ స్కోరును సాధించగలిగింది. ధ్రువ్ జురెల్ (38), దాసున్ శనక (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా, చివర్లో జోఫ్రా ఆర్చర్ 15 బంతుల్లో 32 పరుగులు, రవీంద్ర జడేజా 11 బంతుల్లో 19 నాటౌట్ తో వేగంతో పరుగులు సాధించి జట్టు స్కోరును 200 దాటించారు. 206 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నమన్ ధిర్ 6 పరుగులు, రియాన్ రికెల్టన్12 పరుగులు, తిలక్ వర్మ3 పరుగులు కూడా విఫలం కావడంతో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయింది. అయితే సూర్యకుమార్ యాదవ్ 42 బంతుల్లో 60 పరుుగలు చేసి జట్టు విజయంపై ఆశలు రేకెత్తించాడు. అతనికి విల్ జాక్స్ 33 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 34 పరుగులు తోడయ్యారు. అయితే, కీలక సమయంలో రాజస్థాన్ బౌలర్లు మళ్లీ పట్టు సాధించారు. ప్రమాదకరంగా మారుతున్న హార్దిక్ పాండ్యాను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేయగా, ఆ తర్వాత ఓవర్లో నాండ్రే బర్గర్ సూర్యకుమార్‌ను పెవిలియన్ పంపాడు. ఈ రెండు వికెట్లతో ముంబై ఓటమి ఖాయమైంది. చివరకు ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
http://www.teluguone.com/news/content/rajasths-royals-confirm-berth-in-playoffs-36-220753.html





