సోము వీర్రాజుపై బొత్స కామెంట్స్ అభ్యంతరకరం : మంత్రి లోకేష్
Publish Date:Feb 24, 2026
Advertisement
శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఇది వ్యక్తిగత దాడే మంత్రి నారా లోకేష్ అన్నారు. శాంతిభద్రతల అంశంపై మండలిలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలయుద్ధం జరిగింది. వైసీపీ హయాంలో చిలకలూరిపేటలో ప్రధాని సభను సరిగా నిర్వర్తించలేదని, దీంతో ఆ ఎస్పీని బదిలీ చేశారని, వైసీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎత్తిచూపారు. దీనిపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం లేవనెత్తారు. సోము వీర్రాజు తన అవసరం కోసం ఎవరినో మెప్పించడానికి, భజన చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ, ప్రధాని ప్రస్తావన తీసుకురావడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వైసీపీ సభ్యులు నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడి, లేనిపోని ఆరోపణలు చేసి వాకౌట్ చేయడాన్ని హోంమంత్రి అనిత తప్పుబట్టారు. అటు బొత్స వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. బొత్స వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. సభ్యులను మెప్పించడానికి మేం ఇక్కడకు రాలేదు. ఆ రోజు ప్రధాని సభలో మేమంతా పాల్గొన్నాం. ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. కనీస భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయాయి. ఆనాడు ప్రధాని మాట్లాడుతున్న సమయంలో మైక్ కూడా కట్ అయింది. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీసు జారీచేసి అధికారులను సస్పెండ్ చేసిన విషయం బొత్స తెలుసుకోవాలి. వాకౌట్ చేయడం ప్రతిపక్ష నేత బొత్సకు ప్యాషన్. ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి వెళ్తారు. శాంతిభద్రతలపై చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత మాపై లేదా? వినాల్సిన బాధ్యత వారిపై లేదా? రెండు గంటలు కాగానే వారికి ఆకలేస్తుంది. దీంతో వాకౌట్ అని బయటకు వెళ్తారు. టైం చూశారు.. రెండు అయిందా లేదా అని. బొత్స అభ్యంతరకర పదాలను వినియోగించారు. సోము వీర్రాజు ఎవరో ఒకరిని మెప్పించాలనో, ఒక పార్టీని మెప్పించాలనో చూస్తున్నారంటూ ఆయనపై వ్యక్తిగత దాడికి దిగారని మండిపడ్డారు. ఇది సరికాదని, బొత్స వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్ ను కోరారు.
http://www.teluguone.com/news/content/ap-legislative-council-36-214605.html





