చాలా మందికి నేనే టార్గెట్.. ఎంతకాలం ఉంటానో తెలియదు.. ట్రంప్ నిర్వేదం
Publish Date:Feb 24, 2026
Advertisement
ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదు... ఇదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79 ఏళ్ల వయస్సులో తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్. ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో పరిసరాల్లోకి ఇటీవల తుపాకీతో చొరబడ్డ యువకుడిని భద్రతా సిబ్బంది మట్టుపెట్టారు. ఈ ఉదంతంపై ట్రంప్ స్పందించారు. తనను అనేక మంది టార్గెట్ చేసుకున్నారనీ, ఇంకా ఎంత కాలం ఉంటానో తెలియదని వ్యాఖ్యానించారు. ఇక యువకుడు ఎస్టేట్‌లోకి ప్రవేశించిన సమయంలో ట్రంప్ అక్కడ లేరని భద్రతా దళాలు పేర్కొన్నాయి. సాధారణంగా వారాంతాల్లో ట్రంప్ ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో ఎస్టేట్‌లో గడుపుతుంటారు. ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నం జరిగింది. 2024లో ఎన్నికల ప్రచారం సందర్భంగా తొలిసారిగా ట్రంప్‌పై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ట్రంప్‌ను టార్గెట్ చేయడంతో తూటా ఆయన చెవికి తగులుతూ వెళ్లింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయమైంది. ప్రాణాపాయం తృటిలో తప్పిపోయింది. తన లాంటి నాయకులకు ముప్పు ఉంటుందని అప్పట్లో ట్రంప్ కామెంట్ చేశారు. ఇలాంటి ముప్పును ఎదుర్కొన్న మునుపటి అమెరికా అధ్యక్షుల గురించి కూడా పేర్కొన్నారు. ఇక తాజా ఘటనలో మృతి చెందిన నిందితుడిని 21 ఏళ్ల ఆస్టిన్ టక్కర్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఉత్తర కెరొలీనాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. ఫిబ్రవరి 22న అర్ధరాత్రి 1.30 గంటలకు అతడు కారు నడుపుకుంటూ మార్-ఏ-లాగో ఎస్టేట్‌లోకి ఉత్తర వైపు గేటు నుంచి చొరబడ్డాడు. అతడిని ఇద్దరు సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు, ఒక పోలీసు అధికారి అడ్డుకున్నారు. ఆస్టిన్ వద్ద గన్ను, పెట్రోల్‌తో ఉన్న క్యాన్‌ను కూడా వారు గుర్తించారు. వాటిని పక్కనపెట్టాలని అధికారులు ఆస్టిన్‌కు సూచిస్తుండగా అతడు తన తుపాకీని వారిపై గురిపెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో, ముప్పును తప్పించుకునేందుకు వారు ఆస్టిన్‌పై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆస్టీన్ హతమయ్యాడు.
http://www.teluguone.com/news/content/many-people-are-targeting-me-36-214592.html





