గత వైసీపీ పాలనలో 2032 దేవాలయాలపై దాడులు : సీఎం చంద్రబాబు
Publish Date:Feb 24, 2026
Advertisement
ఎన్డీయే సమావేశంలో టీటీడీ కల్తీ నెయ్యి అంశాన్ని జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నివేదిక ఆధారంగానే ప్రస్తావించానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన పరిణామాలను వివరించారు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా దేవసంగీతం నియామకం, యూనివర్సిటీలో వేంకటేశ్వర స్వామి చిత్రాల తొలగింపు వంటి అంశాలను ప్రస్తావించారు. టీటీడీ గ్రాంట్స్‌తో నడిచే పద్మావతి యూనివర్సిటీకి వీణా నోబుల్ దాస్‌ను వీసీగా నియమించడంపై, ఆమె హయాంలో బలవంతపు మతమార్పిడుల ఆరోపణలు వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ పరిణామాలపై హిందూ మఠాలు, పీఠాధిపతుల నుంచి అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. రాఘవేంద్ర మఠం, చక్రపీఠం తదితర సంస్థలు లేఖలు రాశాయని చెప్పారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా గత పాలకులు వ్యవహరించారని, అన్యమతస్తులను చైర్మన్లుగా నియమించారని విమర్శించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఇతర మత చిహ్నాలు దర్శనమిచ్చిన ఘటనలపై కూడా ప్రస్తావించారు. ఈ అంశాలపై వచ్చిన కథనాలకు ప్రతిగా వంద కోట్ల రూపాయల డిఫమేషన్ కేసులు వేశారని, ఆ కేసులను వాదించేందుకు సుబ్రమణ్య స్వామి వంటి వారు వచ్చారని తెలిపారు. హెరిటేజ్ సంస్థ తమ కుటుంబ వ్యాపారమని, ప్రభుత్వం ఎక్కడా హెరిటేజ్ ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఒక్క కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనలేదన్నారు. నెయ్యి వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ డెయిరీతో ముడిపెట్టారని ఆరోపించారు. పూణేలోని ఇందాపూర్ డెయిరీ అనేక ప్రముఖ కంపెనీలకు కో-మ్యానుఫాక్చరింగ్ చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాజమహేంద్రవరంలో పాల కల్తీ ఘటనపై ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకుందని తెలిపారు. హిందూ ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చర్యలు ప్రారంభించామని, శ్రీవారి లడ్డూ నాణ్యత పెంచి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం పదార్థాల కొనుగోలు చేస్తున్నామని సీఎం తెలిపారు. అన్నప్రసాదం నాణ్యత మెరుగుపర్చామని, భక్తులకు 24 గంటలూ పాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. దర్శన వ్యవస్థలో మార్పులు చేసి సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కల్పించామని ముఖ్యమంత్రి వివరించారు.2019-24 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 2032 దేవాలయాలపై దాడులు జరిగాయని, రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం, అంతర్వేది, బిట్రగుంట రథాల దగ్ధం, దుర్గగుడి వెండి సింహాల చోరీ వంటి ఘటనల్లో ఒక్కరిపైనా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 200 దేవాలయాల జీర్ణోద్ధరణ, 60 టీటీడీ దేవాలయాల్లో రూ.700 కోట్లతో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. తిరుమలలో గ్రీన్ కవర్ పెంపు, దివ్య ఔషధ వనం ప్రాజెక్టు వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణం, అన్నదానం–ప్రాణదానం కార్యక్రమాల విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. హిందూ మనోభావాలను కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-36-214606.html





