తిరుడా తిరుడీ!.. చోరీ చేస్తే ఆ కిక్కే వేరప్పా!
posted on Sep 10, 2025 10:49AM

తిరుడా తిరుడీ అంటే తమిళంలో దొంగా దొంగది అని అర్ధం. అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటే.. కాదనడం లేదు. కానీ.. ఒక మహిళా సర్పంచ్ పద్దెనిమిదేళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా ఈ చోర కళతో దొంగతనాలు చేస్తున్నారు. అయినా ఇదేం పిచ్చి? ఇదేం క్రేజీ? అని ప్రశ్నిస్తే.. చోరీ చేయండం మంచి కిక్ ఇచ్చే రియాల్టీ గేమ్ షో.. అంటారామె. ఏదో ఇప్పుడిలా చిక్కి పోయామని ఫీలవుతున్నాను గానీ.. దొంగతనం చేసి దొరక్కుండా దాన్ని మన పరం చేసుకోవడం అంటే ఆ మజాయే వేరు అంటారు తమిళనాడుకు చెందిన భారతి.
ఈమె గత 18 ఏళ్లుగా తిరుపత్తూరు జిల్లా, సరియంపట్టు అనే గ్రామానికి సర్పంచ్ గా పని చేస్తున్నారు. అధికార డీఎంకే పార్టీకి చెందిన ఆమె. ఇల్లూ- వాకిలీ- నగా- నట్రాతో లైఫ్ లో మంచి పొజిషన్లోనే ఉన్నారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉన్నట్టు ఆమెకు చేతి వాటం కాస్త ఎక్కువ. మొన్న ఒక బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె చేసిన చిలిపి పనేంటంటే.. పక్క సీట్లో ఉన్న మహిల బంగారు చైను దొంగతనం చేయడం. ఇదేం పాడుబుద్ధమ్మా! నీకు చూస్తుంటే కలిగినింటి దానిలాగానే ఉన్నావని అడగ్గానే.. సారీ సారీ తప్పయిపోయింది క్షమించండి. నాకు గత కొంతకాలంగా ఈ దొంగతనాలు చేయడం ఒక అలవాటు. అదేంటో తెలీదు.. అలా చేస్తే నాకు భలే కిక్ అనిపిస్తుంది. ఏమనుకోకండే అని వారితో చెప్పడంతో.. వారికి ఈమెను ఏమనాలో అర్ధం కాలేదట. దీంతో తిరుడీ తిరుడీ అంటూ తమిళంలో తిట్టేసుకుని పోలీస్ కంప్లయింట్ చేశారట. దీంతో ఇప్పుడు ఆ సర్పంచ్ దొంగను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.