రెండో విడత పంచాయతీ పోలింగ్ షురూ

తెలంగాణలో  రెండో విడత పంచాయతీలకు పోలింగ్‌  ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది ఆ తరువాత  ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. రెండో విడతలో భాగంగా 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా  ఐదు పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో రెండు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. ఇక పోతే 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను  108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.  

31 జిల్లాల్లో మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,96,006 పురుషులు, 29,26,306 మంది మహిళలు,   153 మంది ఇతరులు ఉన్నారు. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేశారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu