సీఐసీ ప్రధాన కమిషనర్ గా రాజ్ కుమార్ గోయెల్
posted on Dec 14, 2025 6:19AM

కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రధాన కమిషనర్ సహా ఖాళీగా ఉన్న ఎనిమిది పోస్టులనూ భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 9 సంవత్సరాల తరువాత కేంద్ర సమాచార కమిషన్ పూర్తి స్థాయికి చేరుకుంది. కేంద్ర సమాచార కమిషనర్ గా రిటైర్డ ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ గోయల్ నియమితులయ్యారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫార్సుల మేరకు ఈ నియామకాలు జరిగాయి.
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సీఐసీ ప్రధాన కమిషనర్ చేత సోమవారం (డిసెంబర్ 15) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఆయనతో పాటు నిమమితులైన ఎనిమిది మంది సీఐసీ కమిషర్లలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్ రమేశ్, అశుతోష్ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి వంటి ప్రముఖులు ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచీ సీఐసీ ప్రధాన కమిషనర్ పోస్టు, అలాగే 2023 నుంచి ఎనిమిది మంది డైరెక్టర్ల పోస్టులూ ఖాళీగా ఉన్నాయి.

ఇక సీఐసీ కమిషనర్ గా నియమితులైన ఏపీకి చెందిన సుధారాణి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, లా గ్రాడ్యుయేషన్ చేశారు. గతంలో సీబీఐ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ గా, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా చేశారు. ప్రస్తుతం పీఎన్జీఆర్బీ సభ్యురాలిగా ఉన్నారు.