'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యానికి పవన్ కళ్యాణ్ కారణం కాదా?
on Dec 14, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ని 2026 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా 'దేఖ్‌లేంగే సాలా' విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. (Ustaad Bhagat Singh)
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమాని ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే ప్రకటించారు. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం, ఆయన ఈ సినిమాకి తగిన సమయం కేటాయించలేకపోవడంతో.. ఆలస్యమైందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అందులో వాస్తవం లేదని, నిజానికి ఈ సినిమా నా వల్లే ఆలస్యమైందని చెప్పి షాకిచ్చాడు హరీష్ శంకర్.
'దేఖ్‌లేంగే సాలా' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. "ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల అసలు ఆలస్యం అవ్వలేదు. మొదట ఒక ప్రేమ కథ చేయాలనుకున్నాం. కానీ, అభిమానులు గబ్బర్ సింగ్ లాంటి సినిమా కావాలని కోరుతుండటంతో సందిగ్ధంలో పడిపోయాం. అదే సమయంలో పాండమిక్ వచ్చింది. ఏ కథ చేయాలనే సందిగ్ధంలో నా వల్లే కొంచెం సమయం వృధా అయింది. ఒక రీమేక్ చేద్దామనుకొని అది కూడా పక్కన పెట్టాము. కొంచెం ఆలస్యమైనా పర్లేదు, అభిమానులందరూ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా చేయాలనుకున్నాం. నిజానికి పవన్ కళ్యాణ్ గారి వల్లే చిత్రీకరణ త్వరగా పూర్తయింది. ఉదయాన్నే కేబినెట్ మీటింగ్ కి విజయవాడ వెళ్ళిపోయేవారు. రెండు రోజులు షూటింగ్ ఉండదేమో అనుకునేవాళ్ళం. కానీ, ఆయన రాత్రి పూట షూటింగ్ కి సమయం కేటాయించేవారు. ఉదయమంతా ప్రజాసేవలో ఉండి, రాత్రి ఫ్లయిట్ లో హైదరాబాద్ వచ్చి తెల్లవారుజాము వరకు షూటింగ్ చేసి, మళ్ళీ మంగళగిరి వెళ్ళిన రోజులున్నాయి. 18 గంటలు, 20 గంటలు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను." అని చెప్పాడు.
హరీష్ శంకర్ మాటలను బట్టి చూస్తే.. ఎలాంటి సినిమా చేయాలనే సందిగ్ధం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది కానీ, పవన్ కళ్యాణ్ వల్ల కాదని అర్థమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



