బ్రౌన్ వర్సిటీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
posted on Dec 14, 2025 7:25AM

అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలో, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్.. ఇలా జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ కాల్పుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ బ్రౌన్ యూనివర్సిటీ ఆవరణలో నల్లని దుస్తులు ధరించిన అగంతకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. వర్సిటీలో పరీక్షలు జరుగుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి బ్రౌన్ యూనివర్సిటీ భవనంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
ఘటన జరిగిన వెంటనే కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఆ తరువాత ఇంకా పట్టుకోలేదని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు కూడా బ్రౌన్ వర్సిటీలో కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించి, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా కాల్పుల ఘటనను ఖండించారు. దర్యాప్తులో ఎఫ్‌బీఐ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.