ప్రభుత్వం ఏదైనా ఏపీలో మందుబాబులకు సుఖం లేదా!?
posted on Oct 11, 2025 1:40PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు సుఖం లేకండా పోయిందా? వైసీపీ హయాంలో నాసిరకం మద్యం.. ప్రభుత్వం మారింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది ఇక నాణ్యమైన మద్యం దొరుకుతుందని ఆనందపడేలోగా కల్తీ మద్యం భయం పట్టి పీడించడం మొదలైంది. వైసీపీ హయాంలో నాసిరకం, తెలుగుదేశం హయాంలో కల్తీ మద్యం తాగలేక.. తాగకుండా ఉండలేక నానాయాతనకు గురౌతున్నారు ఏపీలో మందుబాబులు. ఆచార్య ఆత్రేయ ఓ పాటలో మనసున్న మనసుకూ సుఖము లేదంతే అన్నారు. ఏపీలో అయితే మందుబాబులు దీనిని కొంచెం మార్చి తాగే అలవాటున్న మనిషికి సుఖం లేదంతే అని పాడుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో.. మందుబాబులకు నాణ్యమైన మద్యం దొరికిందే లేదు. ఒక వేళ అలాంటి మంచి బ్రాండ్లకు చెందిన మద్యం తాగుదామంటే ఖాతా ఖాళీ అయిపోయేది జేబు గుల్లయిపోయేది. అలాంటిది ఇప్పుడు చూస్తే ఇదిగో ఈ జయచంద్రారెడ్డి- జనార్ధన్ కలసి చేసిన నకిలీ మద్యం బాగోతం కారణంగా.. ఎక్కడ ఏమందు బాటిల్లో ఏం కలిపారో అన్న భయాందోళన వారిని వెంటాడుతోంది. ఏపీ మద్యం బాబులూ మీకు మళ్లీ కష్టాలు తప్పలేదు. మీరు తెలంగాణ వచ్చినపుడు మంచి మందు తాగుదురుగానీ.. ఏపీలో మాత్రం తాగొద్దంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజనులు తెగ పోస్టులు పెడుతున్నారు.
దీంతో మందు బాబులు ఏం చేయాలో తోచక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. అసలే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుదామని సాయంత్రం పూట ఒక నైన్టీ వేసి చిల్ అవుదామన్నది మందుబాబుల ఆలోచన. అలాంటి వారికి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇక్కడి మద్యం తాగొచ్చా? తాగితే పరిస్థితేంటన్నది వారికి అర్ధం కావడం లేదు.
ఉన్న గొడవలు చాలవన్నట్టు ఇటీవల ఒక వ్యక్తి వైన్ షాపులోనే చనిపోయాడు. ఇదంతా నకిలీ మద్యం మహత్యమేనంటూ వైసీపీ తెగ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటి వరకూ చచ్చిన పాములా పడి ఉన్న వైసీపీకి ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారం బయటకు రావడంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయ్యింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తామెంత ట్రై చేస్తున్నా మైలేజ్ రాక జుట్టుపీక్కుంటున్న వైసీపీకి కల్తీ మద్యం ఆయుధంగా మారింది. దీంతో ఇటు జగన్ నుంచి అటు సాధారణ వైసీపీ కార్యకర్తల వరకూ ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతోందంటూ.. లెక్కలు కట్టి మరీ వివరిస్తున్నారు. దీంతో మందు బాబులకు మనసు మరింత పాడై పోతోంది. అప్పుడు చూస్తే అలా- ఇప్పుడు చూస్తే ఇలా.. ఏంటి మాకీ అగ్ని పరీక్ష అంటూ విలవిలలాడుతున్నారు.
తాజా కబర్ ఏంటంటే నకిలీ మద్యం కేసులో ఏవన్ గా ఉన్న జనార్దనరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన గన్నవరంలో దిగగానే పట్టుకుపోయారు. ఎక్కడికి తీసుకుపోయారన్న సంగతి అలా ఉంచితే.. ఆయన నోటి ద్వారా ఎవరి పేర్లు బయటకొస్తాయన్నది సస్పెన్స్ గా మారింది. చూడాలి మరి ఈ మద్యం కేసు ఏ తీరం చేరనుందో.. ఎవరెవరి పేర్లు బయటకు రానున్నాయో?