పుట్టపర్తి సాయిబాబా స్ఫూర్తితో ముందుకు సాగాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
posted on Nov 22, 2025 3:17PM
.webp)
సత్యం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పని చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పని చేస్తోందన్నారు.. పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. అంతకు ముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న ద్రౌపది ముర్ము సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన మహాద్భాగ్యంగా చెప్పారు. సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రగణ్యుడన్న రాష్ట్రపతి నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారన్నారు. బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్పూర్తితో పని చేస్తామని సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు లవ్ ఆల్..సర్వ్ ఆల్ అన్నది పుట్టపర్తి సాయిబాబా సిద్ధాంతమన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలని పేర్కొన్నారు.
వాటిని పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందన్నారు. సత్యసాయి బాబాతో తనకు మంచి అనుబంధం ఉందన్న ఆయన తాగు నీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారని చెప్పారు. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు... పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారన్నారు. సత్యసాయి భక్తులు ఇప్పటికీ అదే స్ఫూర్తిని కొనసాగించడం సంతోషాన్నిస్తోందన్నారు చంద్రబాబు. భగవాన్ సత్యసాయి బాబా భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలని చంద్రబాబు అన్నారు.