శివలింగాకృతిలో రెండు టన్నుల లడ్డూ!
posted on Aug 30, 2025 9:53AM
.webp)
గణపతి నవరాత్రులు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. గణేష్ మండప నిర్వాహకులు వినూత్నంగా ఆలోచనలు చేసి వివిధ రూపాలలో గణనాథులను ప్రతిష్టించి సృజనను చాటుకుంటున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో ఓ స్వీట్ షాప్ నిర్వాహకుడు గణపతికి సమర్పించే లడ్డూ విషయంలో కూడా కొత్తగా ఆలోచించారు. శివలింగాకృతిలో రెండు టన్నుల భారీ లడ్డూను రూపొందించారు.
విశాఖపట్నం గాజువాక లంక గ్రౌండ్స్ లో అక్కడి నిర్వాహకులు లక్ష చీరలతో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర మహా గణపతికి నైవేద్యంగా ఈ లడ్డూను సిద్ధం చేయించినట్లు తయారీదారులు ఉప్పల కిషోర్ తెలిపారు. 15 మంది సిబ్బంది నాలుగు రోజుల పాటు శ్రమించి, 8 అడుగుల ఎత్తు, 2 వేల కిలోల బరువు లడ్డూని శివలింగం ఆకృతిలో తయారు చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఇది అత్యంత భారీ లడ్డూ అని చెప్పిన ఆయన.. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం లభించే అవకాశం ఉందన్నారు. ఈ భారీ లడ్డూను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. శుక్రవారం (ఆగస్టు 29) రాత్రి దీనిని గాజువాకకు తరలించారు.