గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
posted on Sep 2, 2025 9:22PM

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 03 నుండి 05వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.ఈ సందర్భంగా ఉదయం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్రసమర్పణ చేశారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 03న పవిత్రప్రతిష్ట చేపడుతారు. ఉదయం 09 - 11 గం.ల వరకు యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన మరియు స్నపన తిరుమంజమునకు ఏర్పాట్లు చేపడుతారు. ఉదయం 11 గం.ల నుండి 12.30 గం.ల వరకు కల్యాణ మండపమునందు స్నపన తిరుమంజనం, సేవాకాలము, శాత్తుమొర ఆస్థానం చేపడుతారు. సాయంత్రం ఉత్సవ మూర్తులు తిరువీధి ఉత్సవం, రాత్రి 7.30 - 9.00 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
సెప్టెంబరు 04వ తేదీ స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం, జాప్యం, మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉపసన్నిధి నందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం మరియు మాడ వీధులు, శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడుతారు. సాయంత్రం 5.30 - 6.30 గం.ల మధ్య ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.సెప్టెంబర్ 05వ తేదీ ఉదయం స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం, సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర , వేద శాత్తుమొర చేపడుతారు.
రాత్రి ఉత్సవ మూర్తులు కుంభం విమాన ప్రదక్షిణంగా సన్నిధిగా వేంచేపు చేస్తారు.పవిత్రోత్సవాలలో పాల్గొనే భక్తులు రూ. 500/- చెల్లించి ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. ఒక టికెట్టుపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది, ఒక పవిత్ర ప్రసాదం ఇవ్వబడుతుంది. పెద్ద జీయర్, చిన్న జీయర్, ఆలయ డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈఓ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ లు చిరంజీవి, ఆలయ ఇన్ స్పెక్టర్ రాధాకృష్ణ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.