బీసీ సంఘాల తెలంగాణ బంద్.. డిపోలకే పరిమితమైన బస్సులు
posted on Oct 18, 2025 8:16AM

బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ పిలుపు మేరకు శనివారం (అక్టోబర్ 18) తెలంగాణ బంద్ జరుగుతోంది. ఈ బంద్ కు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు జరుగుతున్న తెలంగాణ బంద్ కు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. బంద్ సందర్భంగా ఉదయం నుంచీ బస్సులన్నీ డీపోలకే పరిమితమైపోయాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము చేయాల్సినన్నీ చేస్తున్నామని ..బంద్‌కు మా మద్దతు ఉంటుందని ప్రకటించింది. అలాగే బీఆర్ఎస్ కూడా బంద్ కు మద్దతు తెలిపింది. ఇక ఈ బంద్ కు నేతృత్వం వహిస్తున్న బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ వేదికకు కన్వీర్ సాక్షాత్తూ బీజేపీ రాజ్యసభ సభ్యుడైన ఆర్ కృష్ణయ్యే కావడంతో బీజేపీ కూడా బంద్ ను సమర్శించినట్లే అయ్యింది.