చిట్టీల పేరుతో రూ.150 కోట్లకు టోకరా.. డాక్టర్ దంపతుల నిర్వాకం
posted on Oct 18, 2025 7:59AM

చిట్టీల పేరుతో జనాలను 150 కోట్ల రూపాయలకు మోసం చేసిన డాక్టర్ దంపతుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేరుకు ఇద్దరూ వైద్యులే అయినా.. ఆ వృత్తితోనే నమ్మించి జనాలను నిలువునా ముంచేశారు. హైదరాబాద్ నిజాంపేట బండారీ కాలనీ లే ఔట్ లో క్లినిక్ ఏర్పాటు చేసిన డాక్టర్ రేష్మ, డాక్టర్ అలీ దంపతులు.. చిట్టీల పేరుతో దాదాపు వంద మందిని దగా చేసి 150 కోట్ల రూపాయలు దండుకుని బిచాణా ఎత్తేశారు.
చిట్టీల కాలపరిమితి పూర్తయినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు క్లినిక్ కు వచ్చారు. అయితే అప్పటికే ఈ కిలాడీ దంపతులు బిచాణా ఎత్తేశారు. దీంతో నిలువునా ముంచేశారని గ్రహించిన బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వైద్య జంటపై ఇప్పటి వరకూ 42 మంది ఫిర్యాదు చేశారు. అయితే ఈ కిలాడీ జంట బాధితుల సంఖ్య భారీగానే ఉంటుందని అంటున్నారు. చిట్టీల పేరుతో ఒక్కొక్కరి నుంచి 50 వేల నుంచి పది లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు రేష్మ-అలీ దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.