దేశంలోనే రోల్ మోడల్‌గా నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ : మంత్రి నారాయణ
posted on Oct 9, 2025 5:58PM

దేశంలోనే నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈనెల 10న సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన సందర్భంగా మంత్రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలిప్యాడ్ పరిశీలన, కార్యక్రమాల ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రి నారాయణ క్షుణ్ణంగా అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సీఎం ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు మంత్రి ఏర్పాట్లు చేపట్టారు.
తొలుత వెంకటాచలం మండలం ఈదగాలిలో కార్యక్రమం అనంతరం నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు మరోమారు సూచనలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో ఏర్పాటు చేసిన 120 కంటైనర్ షాప్ లను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా వ్యాపారులతో మాట్లాడారు. సీఎంతో మహిళ వ్యాపారుల ఫోటో సెషన్‌కు సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అన్నింటిని సాయంత్రం లోపల పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
తమ కల సాకారం చేస్తూ స్మార్ట్ స్ట్రీట్ బజార్‌ను ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ కు మహిళ వ్యాపారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ లో ప్రారంభోత్సవానికి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ముస్తాబయిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు. స్మార్ట్ స్ట్రీట్ లో 8.4 కోట్లతో 200 షాపులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే తొలివిడతలో 30 కంటైనర్లలో 120 షాపులు సిద్ధం చేశామని చెప్పారు.
మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ స్ట్రీట్ ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో తొలుతగా నెల్లూరు సిటీలో శుక్రవారం సీఎం చేతుల మీదుగా స్మార్ట్ స్ట్రీట్ బజార్‌లో 120 షాప్ లు ప్రారంభమవు తున్నాయన్నారు. ఒక్కో షాపుకి నాలుగు లక్షలు ఖర్చు అవుతుండగా... అందులో రెండులక్షల వ్యయాన్ని కార్పొరేషన్, మెప్మాలు బరిస్తాయని తెలిపారు. మిగిలిన రెండు లక్షల్లో కంటైనర్ కి లక్షన్నర రూపాయలు, పెట్టుబడి సాయం కింద మరో 50వేలు కేవలం రూపాయి వడ్డీకే లోన్ ఇప్పించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
ఆ రెండు లక్షల్లో కూడా పి-4 పథకంలో భాగంగా 120మంది లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు నా సొంత నిధుల నుండి మొత్తం కోటీ 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కింద అందచేస్తున్నానని మంత్రి తెలియజేశారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ పై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయని, చేస్తున్నాయని తనదైన శైలిలో మంత్రి ఖండించారు. అన్నిటినీ తట్టుకుని స్మార్ట్ స్ట్రీట్ ను విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లామని చెప్పారు. దేశంలోనే ఈ స్మార్ట్ స్ట్రీట్ ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
స్మార్ట్ స్ట్రీట్ లో టెక్నాలజీదే పెద్ద పాత్ర అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పోల్స్ కి సీసీ కెమెరాలున్నాయని, వైఫై సౌకర్యం ఉందన్నారు. ఏదైనా అనౌన్స్ మెంట్ చేయాలంటే దీనికే స్పీకర్స్ ఉన్నాయని తెలిపారు. లైటింగ్ పోల్స్ కూడా ఇవేనన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతీదీ టెక్నాలజీ అప్డేటెడ్ అని చెప్పేందుకు గర్విస్తున్నానని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపారంలో మెళుకువలు నేర్పేందుకు మెప్మా మహిళలకు శిక్షణ కూడా ఇచ్చారన్నారు. చెన్నై బర్మా బజారుకు తీసుకెళ్లి వ్యాపారాలపై అవగాహన కూడా కల్పించామని తెలిపారు..