హైకోర్టు స్టే ఊహించలేదు...భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : మంత్రి పొన్నం
posted on Oct 9, 2025 6:28PM

బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కోర్టు కాఫీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. హైకోర్టు స్టే విధిస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడం జరిగిందని పొన్నం పేర్కొన్నారు.
ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ వేసి అన్ని విధాలుగా చిత్తశుద్ధితో వ్యవహరించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తమని మంత్రి పొన్నం తెలిపారు.
బీసీలకు 42 శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కూడా స్టే విధించడం అన్యాయమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ రిజర్వేషన్ కొలిక్కి వచ్చిందనుకున్నాం.. కానీ కోర్టు తీర్పు ఊహించలేదని చెప్పారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయమని పేర్కొన్నారు.
నోటి కాడ ముద్ద ఎవరు లాగేసారో కోర్ట్ తీర్పు కాపీ వచ్చాక చెబుతామని హెచ్చరించారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ కు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ బిడ్డలు అధైర్య పడాల్సిన అవసరం లేదని. .కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రెండు సభల్లో పాస్ చేసి గవర్నర్ కు పంపించామని.. గవర్నర్ బిల్లు పాస్ చేయకుండా అడ్డుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.