కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్
posted on Oct 9, 2025 5:40PM

కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలసరి సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రతి నెలా ఒక రోజు, అంటే సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన పీరియడ్స్ లీవ్ పాలసీని ఆమోదించింది. . ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు తెలిపింది. మహిళల శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఈ నిర్ణయం మహిళా శ్రామికులకు పెద్ద ఉపశమనంగా మారుతుందని రాష్ట్ర న్యాయ మంత్రి హెచ్.కె. పాటిల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో, తమ రాష్ట్రం కూడా దానిని స్వీకరించాలని నిర్ణయించుకున్నామని ఆయన కేబినెట్ సమావేశం అనంతరం వెల్లడించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అధికారిక రంగంలో అమలు సులభమైనా, అనధికారిక రంగంలో ఇది ఒక సవాలుగా నిలుస్తుందని, అయినప్పటికీ ఇది మహిళల ఆరోగ్య సాధికారతకు బలమైన పునాది వేస్తుందని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగే అభిప్రాయపడ్డారు. మహిళల అసలైన ఆరోగ్య అవసరాలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు ప్రశంసనీయమని ఆమె అన్నారు.