పుష్ప సినిమా తరహాలో భారీగా నగదు రవాణా
posted on Dec 5, 2025 1:58PM

సికింద్రాబాద్‌లో ఓ ముఠా సినిమా ‘పుష్ప’ స్టైల్లో పథకం రచించి హవాలా డబ్బు రవాణా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో షాక్ అయ్యారు. ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా వెళ్లుతున్న కారును ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ వేగం పెంచి... కారుతో సహా ముందుకు దూసుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుమారు 15 కిలోమీటర్ల వరకు కారును చేజ్ చేసి.. చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పోలీసులు కారు మొత్తం తనిఖీలు చేశారు. మొదట్లో పెద్దగా ఏమీ కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి పూర్తిగా తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడింది. కారు డిక్కీ, టైర్ల లోపల, బనెట్ కింద, సీట్లలో వేరువేరు రహస్య గుహలు ఏర్పాటు చేసి, అందులో భారీ మొత్తంలో డబ్బును దాచి పెట్టిన విధానాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు.
అనంతరం పోలీసులు వాహనాన్ని పూర్తిగా ఓపెన్ చేయించి తనిఖీ చేయగా, వివిధ బండిల్స్‌గా దాచిన మొత్తం ₹4 కోట్ల హవాలా నగదు బయటపడింది. డబ్బు మూలం, గమ్యం, ముఠా నెట్‌వర్క్ వివరాల కోసం పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. సినిమా రీతిలో డబ్బు రవాణా – పోలీసుల పరుగుపరుగుల చేజ్ – చివరకు భారీ నగదు స్వాధీనం… సికింద్రాబాద్‌లో ఈ ఘటన పెద్ద కలకలం రేపుతోంది.