అమ్మకానికి ఆర్సీబీ!?
posted on Nov 8, 2025 10:39AM

ఐపీఎల్ ఛాంపియన్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అమ్మకానికి అంగట్లో ఉంది. ఈ జట్టు త్వరలో చేతులు మారనుంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ సేల్‌కి సంబంధించిన ప్రక్రియ కూడా ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆర్సీబీ టీమ్ ఓనర్.. డియాజియో కంపెనీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. బ్రిటీష్ డిస్టిలరీస్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ మాతృ సంస్థ అయిన డియాజియో.. ఆర్సీబీ జట్టు అమ్మకానికి సంబంధించి ఇప్పటికే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికల్లా.. ఆర్సీబీ అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికానుంది. యూఎస్‌ఎల్‌కు.. ఆర్సీబీ టీమ్ ఎంతో విలువైన, వ్యూహాత్మక ఆస్తి అని సంస్థ సీఈవో తెలిపారు. ఇది తమ ఆల్కబెవ్ వ్యాపారానికి ప్రధానం కాదన్నారు. సంస్థలో.. దీర్ఘకాలికంగా వాటాదారులకు విలువను అందించే ఉద్దేశంతోనే.. కంపెనీ తన ఇండియా పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తోందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్ తెలిపారు.
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కోర్ బిజినెస్.. ఆల్కహాల్ ఆధారిత పానీయాల రంగంలో ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ టీమ్ తమ కోర్ బిజినెస్ అయిన లిక్కర్ బిజినెస్‌కి సంబంధించింది కాదని చెబుతోంది. అందువల్లే.. ఆర్సీబీని వదులుకునేందుకు సిద్ధమైనట్లు చెబుతోంది. అయితే.. ఆర్సీబీ కొత్త యజమాని ఎవరు అన్నది వచ్చే ఐపీఎల్ సీజన్ మెగా వేలానికి ముందు తేలనుంది. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ ఉండటం, అపారమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉండటం వల్ల.. ఆర్సీబీ ఫ్రాంచైజీకి మార్కెట్‌లో భారీ విలువ ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ ఫ్రాంచైజీ విలువ 16 వేల కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా. ఐపీఎల్ మెన్స్ టీమ్‌తో పాటు విమెన్స్ ప్రీమియర్ లీగ్ టీమ్ కూడా ఈ డీల్‌లో భాగమే! ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ వ్యాపార సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో.. అదానీ గ్రూప్, జేఎస్ డబ్ల్యు గ్రూప్, అదార్ పూనావాలా సహా మరికొన్ని సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ గనక పూర్తయితే.. ఐపీఎల్ చరిత్రలో ఇది అతిపెద్ద ఫ్రాంచైజీ యాజమాన్య మార్పుల్లో ఒకటిగా నిలిచిపోనుంది.
వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఇటీవలే దాదాపు 17 వేల కోట్లకు ఆర్సీబీని కొనుగోలు చేస్తోందనే వార్తలు చక్కర్లు కొట్టాయ్. అదానీ గ్రూప్‌తో పాటు ఓ ఢిల్లీ బిజినెస్ టైకూన్ కూడా ఆర్సీబీ టీమ్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు యూఎస్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా రేసులో ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా.. అదార్ పూనావాల ఆర్సీబీ యాజమాన్య హక్కుల కోసం బాగా ప్రయత్నిస్తున్నస్టు సమాచారం. 2010లో లీగ్ విస్తరణ సమయంలోనే అదార్ తండ్రి సైరస్ పూనావాల ఫ్రాంచైజీ కోసం బిడ్ వేశారు. కానీ.. అప్పుడు దక్కలేదు. మళ్లీ.. ఇప్పుడు ఆర్సీబీని కొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
2008లో ఐపీఎల్ ఆరంభ సమయంలో.. యూబీ గ్రూప్ అధినేత విజయ్ మాల్యా.. బెంగళూరు ఫ్రాంఛైజీని దక్కించుకున్నాడు. ఆ తర్వాత.. 2016లో మాల్యాని ఆర్థికి ఇబ్బందులు చుట్టుముట్టాయ్. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దాంతో.. భారత్‌లోని తన అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా మాల్యా మద్యం కంపెనీతో పాటు బెంగళూరు ఫ్రాంచైజీని కూడా డియాజియో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ టీమ్‌ని మెయింటైన్ చేసింది. 2008లో విజయ్ మాల్యా ఆర్సీబీని 76 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. 2014 నాటికి.. డియాజియో యూఎస్ఎల్.. ఆర్సీబీలో మెజారిటీ వాటాని కొనుగోలు చేసింది. 2016 నాటికి మాల్యా నిష్క్రమణతో.. డియాజియో ఆర్సీబీని పూర్తిగా సొంతం చేసుకుంది. ప్రస్తుతం.. ఈ టీమ్‌ని.. యూఎస్‌ఎల్ అనుబంధ సంస్థ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఈ ఏడాది సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దీనిని.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 4న.. బెంగళూరులోని చినస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో.. 11 మంది ఆర్సీబీ అభిమానులు చనిపోయారు. దాంతో.. ఆర్సీబీ నిర్వహణపై ప్రెజర్ పెరిగింది. అప్పటి నుంచే.. ఆర్సీబీ విక్రయంపై చర్చలు మొదలయ్యాయ్. మరోవైపు.. షేర్ హోల్డర్లు కూడా నాన్ కోర్ వ్యాపారాన్ని వదలిపెట్టాలని డియాజియోపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఆర్సీబీని వదులుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.