దళారీ వ్యవస్థపై దండెత్తిన చీని రైతులు
posted on Sep 8, 2025 8:30PM

కడప జిల్లా పులివెందులలో చీని రైతులు, వ్యాపారస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడి వ్యాపారస్థులు సిండికేట్ గా మారి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పీంచకుడా తమ పంట దిగుబడిని కొనుగోలు చేస్తున్నారని చీనీ రైతులు ఆందోళనకు వ్యక్తం చేశారు. దళారులు, స్థానిక వ్యాపారుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని పులివెందులలోని మార్కెట్ యార్డ్ పై సోమవారం చీనీ రైతులు దండెత్తారు.
చీని మార్కెట్ లో వ్యాపారస్తులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. తమ భార్యల తాలిబొట్లు, పొలాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టు కుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చీని పంటకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో సంవత్సరాలుగా పెంచుకుంటున్న చీని చెట్లను నరికి వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
*దళారీ వ్యవస్థ తో నష్టపోతున్నాం
కమలాపురం, తొండూరు, పులివెందుల మండలాలకు చెందిన రైతులు సురేంద్రనాథ్ రెడ్డి, కొండారెడ్డి, సోమ లింగారెడ్డి తదితర రైతులు మాట్లాడుతూ దళారీ వ్యవస్థ లో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని నియోజకవర్గంలోని చీని రైతులం ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. సోమవారం పులివెందుల మార్కెట్ యార్డులో చీని వేలం పాటలో వ్యాపారులు అందరూ ఒక్కటి అయ్యి రైతుకు గిట్టుబాటు ధర కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టన్ను చీని రూ. 8 వేలు నుండి రూ.10 వేలు అడుగుతున్నారన్నారు. వెంటనే ప్రజాపతినిధులు, అధికారులు జోక్యం చేసుకొని రైతుకు టన్ను రూ.30 వేలు నుండి రూ.40 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు నిరసన తెలిపారు. వ్యాపారుల తీరు మారకపోతే వేలం పాటను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. తమకు కనీస గిట్టుబాటు ధర లేకపోతే మార్కెట్ యార్డుకు ఈనెల 11న తాళాలు వేసి బంద్ నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు.
రైతులు కూడ మార్కెట్ యార్డ్ కు చీని పంట తీసుకు రావద్దని తోటి రైతులకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్కెట్లో వ్యాపారస్తులందరూ సిండికేట్ అయ్యి రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది రైతులు గిట్టుబాటు ధర లేక చెట్లను నరికివేస్తున్నారని దీనివల్ల రైతుకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇలాగే ఈ వ్యవస్థ మారకపోతే రైతులు అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది అన్నారు.
*ఇతర ప్రాంత వ్యాపారులను రానివ్వకుండా
గతంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేసే వారన్నారు.. ప్రస్తుతం పులివెందుల చీనీ మార్కెట్ యార్డులో వ్యాపారులంతా ఏకమై రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. సూట్ పద్దతిని రద్దు చేసేందుకే మార్కెట్ యార్డ్లో చీని రైతులకు మరియు వ్యాపారస్తుల మధ్య సయోధ్య కుదిర్చి చీని మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం పులివెందుల చీని మార్కెట్ యార్డ్ లో దళారులంతా ఏకమై ఒకటి, రెండు చీని కుప్పలకు మాత్రం అధిక ధర వెచ్చిస్తూ కొనుగోలు చేస్తున్నారన్నారు. మిగతా వాటికి మాత్రం నామకే వాస్తు ధరలను నిర్ణయించి రైతులను నిండా ముంచేస్తున్నారన్నారు.
*రైతులతో చర్చించిన బిటెక్ రవి.
రైతుల ఆందోళన తెలుసుకున్న పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ బిటెక్ రవి, పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మెన్ అమర్నాథ్ తోకలసి మార్కెట్ యార్డ్ కు చేరుకున్నారు. అనంతరం అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాపారస్థులతో కూడ సమస్య ఎక్కడ నెలకొన్నది అనే విషయమై వారితో చర్చించారు. బిటెక్ రవి మాట్లాడుతూ చీని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులు ఆందోళన, అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.