పవన్ ఏం చేసినా తప్పేనా... ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్?
posted on Nov 10, 2025 3:38PM
.webp)
మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్...ఇదీ అటవీశాఖా మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అయిన పవన్ బిజీ షెడ్యూల్. ప్రత్యేక విమానంలో , చాపర్‌లో ఆయన చక్కర్లు కొడుతున్నారంటూ పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా సైన్యం ఆయనపై దుమ్మెత్తి పోస్తోంది. ఇక ఆయన విరామ సమయంలో పుస్తకం పుట్టుకుని ఏదైనా సందేశం ఇవ్వదలిచినా కూడా దాన్లోని తప్పొప్పులు వెలికి తీసి నానా యాగీ చేస్తున్నారు.
ఫోనుతో లేచి- పొద్దంతా ఫోనే చూసుకుంటూ తిరుగుతూ- ఫోనుతోనే నిద్ర పోయేవారికి.. ఆ ఫోన్ పిచ్చిలో పడొద్దు.. పుస్తకాలు చదవండ్రా బాబూ! అంటూ తన అభిమాన గణానికి ఒక చిన్న మెసేజ్ పాస్ చేద్దామని పవన్ ఫోటోలకు పోజులు ఇస్తే.. దాన్ని కూడా రాద్దాంతం చేస్తున్నారు. బుక్కు తిరగేసి పట్టుకున్నాడు. మరగేసి పట్టుకున్నాడంటూ నానా హంగామా చేస్తున్నారు. ఆ మాటకొస్తే పవన్ తిరగేసి పట్టుకున్నా కూడా స్టైలే. అందులోంచి వెళ్లాల్సిన మెసేజ్ ఆయన అభిమాన గణానికి వెళ్లి చేరిపోతుంది.
ఇక పవన్ పర్యటనలకు సంబంధించిన గొడవ విషయానికి వస్తే. పవన్ అన్నా అధికారిక వ్యవహారాలకు చాపర్లు గట్రా వాడుతున్నారేమోగానీ.. అదే జగన్ తన జమానాలో ఏకంగా లండన్ వెళ్లి సొంత పనులు చక్కబెట్టడానికి కూడా ప్రత్యేక విమానాలను వాడిన గతం ఉంది.
ఇటీవల బాబు లండన్ వెళ్తే మొత్తం సొంత ఖర్చులతో ఈ పర్యటన చేసి వచ్చారు. అది ఆయన సొంత విషయం కావడంతో.. ఈ దిశగా బాబు అన్నీ ఖర్చులు తానే భరించారు. అదే జగన్ అలాక్కాదు.. మొత్తం ప్రభుత్వ సొమ్మే ఖర్చు పెట్టేవారు. ఇటీవల జగన్ తాను లండన్ వెళ్లినపుడు కూడా పరాయి ఫోన్ నెంబర్ ఇచ్చి కోర్టులను తిక మక పెట్టారు. సరే విదేశాలు వెళ్లి వచ్చారు.. ఒక్కసారైనా కోర్టు ముందు హాజరు కమ్మంటే.. లేదు లేదు తానలా హాజరైతే శాంతి భద్రతల సమస్యగా రూపాంతరం చెందుతుందని అన్నారు తప్పించి.. కోర్టు కోరిన పని చేయలేక పోయారు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన జగన్ కాన్వాయ్ ప్రమాదాలు, చాపర్ తో వచ్చిన సమస్యలను ఏకరవు పెట్టారు.
అదే పవన్ కళ్యాణ్ అలాక్కాదే.. ఆయన పర్యటనలు సాఫీగా సాగడానికే ఈ విధమైన గాలి మోటారు ప్రయాణాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న చూడండీ.. జగన్ కాన్వాయ్ ప్రమాదానికి గురైందా? అంతకు ముందు ఒక ప్రాణమే పోయిందా? ఇలాంటి వాటిని వీలైనంతగా తగ్గించడానికే పవన్ తన పేరుకు తగ్గట్టుగా పవన సుత హనుమాన్ లా గాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ విషయం తెలీక ఫ్యాన్ పార్టీ ప్యాన్స్ సోషల్ మీడియాలో అంత రచ్చ రచ్చ చేయాల్సిన అవసరం లేదంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.