ఇమ్రాన్ మృతి వార్తలను ఖండించిన పాక్ రక్షణ మంత్రి
posted on Nov 27, 2025 8:20AM
.webp)
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ పాక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఖండించారు. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనను మరో జైలుకు తరలించారని వచ్చిన వదంతులను సైతం కొట్టి పారేశారు. ఫైవ్‌స్టార్ హోటల్‌లో కంటే ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన ఆహారం అందుతోందని, జైలులో ఆరోగ్యంగానే ఉన్నారని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. డిసెంబర్ 2న ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతినిచ్చారు.
అంతకు ముందు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో రావల్పిండిలోని అదియాలా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సోదరుడిని కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ జైలు వద్దకు వెళ్లిన ఆయన ముగ్గురు సోదరీమణులపై పోలీసులు దాడి చేశారన్న వార్తలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరిలు నూర్యీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులతో కలిసి అదియాలా జైలు వద్దకు చేరుకున్నారు. మూడు వారాలుగా తమ సోదరుడిని కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదని, ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ దాడిపై పంజాబ్ పోలీస్ చీఫ్‌కు రాసిన లేఖలో రోడ్లను దిగ్బంధించలేదనీ, ఎవరికీ ఆటంకం కలిగించదనీ, అయినా పోలీసులు వీధి దీపాలను ఆపేసి, చీకటిలో తమపై దాడికి దిగారని ఆరోపించారు. 71 ఏళ్ల వృద్ధురాలిననైనా చూడకుండా తన జుట్టు పట్టుకుని, కింద పడేసి ఈడ్చుకెళ్లారని ఆరోపించారు.
పలు కేసుల్లో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని, కనీసం పుస్తకాలు చదవనీయడం లేదనీ, న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని పీటీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది ఏడుసార్లు ప్రయత్నించినా, ఇమ్రాన్‌ను కలిసేందుకు జైలు అధికారులు నిరాకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. కాగా ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు జైలు అధికారులు ఆయన సోదరిలకు అనుమతిస్తూ, ఇందుకు డిసెంబర్ 2 తేదీని ఖరారు చేయడంతో జైలు వద్ద పీటీఐ శ్రేణులు చేస్తున్న ఆందోళన విరమించారు.