ఆసియాకప్.. సూపర్ 4కు అర్హత సాధించిన పాకిస్థాన్

ఆసియాకప్ లో గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించి సూపర్ 4కు అర్హత సాధించింది. ఆసియాకప్ టోర్నీలో భాగంగా బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్ లో పాకిస్ధాన్ యూఏఈపై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది.  పాక్ బ్యాట‌ర్ల‌లో ఫకార్ జమాన్ హాఫ్ సెంచ‌రీ చేశాడు.  యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిక్ నాలుగు వికెట్లు తీశాడు.   147 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన యూఏఈ 17.4 ఓవ‌ర్ల‌లో 105 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పాకిస్థాన్ సూపర్ 4 కు అర్హత సాధించడంతో ఈ టోర్నీలో భారత్ తో పాకిస్థాన్ మరో సారి తలపడనుంది.  సూప‌ర్‌-4లో భాగంగా ఆదివారం అంటే సెప్టెంబ‌ర్ 21న దుబాయ్ వేదిక‌గా భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. 

 ఇలా ఉండగా పాకిస్థాన్, యూఏఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్ టోర్నీని బహిష్కరించిందన్న వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా పాకిస్థాన్ మైదానానికి రావడానికి చాలా ఆలస్యం చేసింది. ఒక దశలో పాకిస్థాన్ మ్యాచ్ ను బాయ్ కాట్ చేసిందనే అంతా భావించారు. అయితే నిర్ణీత సమయం కంటే దాదాపు గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. 

భారత్ తో మ్యాచ్ లో పరాజయం తరువాత షేక్ హ్యాండ్ వివాదం మెదలైన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని డిమాండ్ చేసింది. దీనికి ఐసీసీ తిరస్కరించడంతో పాకిస్థాన్ టోర్నీని బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించింది. చివరి నిముషంలో పైక్రాఫ్ట్  క్షమాపణ చెప్పినట్లు పీసీబీ ప్రకటించింది. దీంతో పాక్ ఆటగాళ్లు టోర్నీలో  కొనసాగారు. దీనిపై పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ మీడియాకు వివరణ ఇచ్చారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu