ఏపీ యువతకు విదేశాల్లోనూ ఉద్యోగాల కల్పన!

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర యువతకు రాష్ట్రంలోనే కాదు, విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావశాకాలు కల్పించడంపై దృష్టి సారించింది.  ఇందుకు సంబంధించి మంత్రి నారా లోకేష్ గురువారం (అక్టోబర్ 9) ఉండవల్లిలోని తన నివాసంలో  స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అధికారులకు  భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) ద్వారా రాబోయే ఐదేళ్లలో  విదేశాలలో రాష్ట్ర యువతకు లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు.  ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పక్కా ప్రణాళికతో కూడిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని  ఆదేశించారు.

విదేశాల్లో ప్రస్తుతం ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా మన యువతను సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు.  నర్సింగ్, వెల్డర్స్, ట్రక్కర్స్, బిల్డింగ్ వర్కర్లకు యూరప్‌తో పాటు జర్మనీ, ఇటలీల్లో మంచి డిమాండ్ ఉందన్న లోకేష్ ఆయా కొలువులకు అర్హులైన వారిని గుర్తించి శిక్షణ ఇవ్వాలన్నారు.

ముఖ్యంగా నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యనభ్యసించిన యువతీయువకులకు ఆయా దేశాల భాషల్లో శిక్షణ ఇచ్చి, విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కేరళ రాష్ట్రం చాలా విజయవంతమైంది. అందుకే, కేరళ మోడల్‌ను అధ్యయనం చేసి, ఆ  పద్ధతులను ఏపీలో అమలు చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.

ప్రస్తుతం ఓంక్యాప్ ద్వారా రాష్ట్రంలో 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలిపారు. జర్మనీ లాంగ్వేజెస్ అసెస్ మెంట్ సెంటర్లను రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి కూడా ఎంఓయూ చేసుకున్నట్లు అధికారులు వివరించారు. యువతకు ఉద్యోగాల సమాచారం సులభంగా అందించడానికి ఉద్దేశించిన  నైపుణ్యం పోర్టల్‌పై కూడా మంత్రి సమీక్షించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu