మార్చిలో పవర్‌స్టార్ సినిమా.. ఆ సినిమాలకు ఎలాంటి ఇబ్బందీ లేదా?
on Dec 8, 2025
.webp)
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేయడం ఒక ఎత్తయితే దాన్ని రిలీజ్ చెయ్యడం మరో ఎత్తుగా మారింది. ఎందుకంటే ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్‌కి ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వకపోవడం మనం చూస్తున్నాం. రకరకాల కారణాల వల్ల స్టార్ హీరోల సినిమాల రిలీజ్ పదే పదే వాయిదా పడుతున్నాయి. అలా వాయిదా పడడం వల్ల అంతకుముందే రిలీజ్‌ని ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి.
ఇప్పుడు అలాంటి పరిస్థితి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్(Pawan Kalyan) సినిమా వల్ల ఎదురు కాబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో రెండు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేసి ఉన్నాయి. ఆ సినిమాల మధ్యలోకి పవన్‌కళ్యాణ్ సినిమా వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ చేస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ అదే నెలలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది హరిహర వీరమల్లు, ఓజి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన పవన్ వచ్చే ఏడాది మరో పవర్ఫుల్ మూవీ ఉస్తాద్ భగత్‌సింగ్‌తో రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మార్చిలో నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ మార్చి 26, రామ్‌చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది మార్చి 27న రిలీజ్ కాబోతున్నాయి. అయితే పవన్ సినిమా కూడా మార్చి 27కే రాబోతోందనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాన్ని ఆ డేట్‌కి రిలీజ్ చేసే ఆలోచన యూనిట్‌కి లేదనే వార్త కూడా మరో పక్క చక్కర్లు కొడుతోంది. అదే నెలలో సినిమాను రిలీజ్ చేసే పక్షంలో రెండు వారాల ముందుగానే సినిమాని థియేలర్లలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్‌కళ్యాణ్ సినిమాను మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



