రాజమహేంద్రవరానికి ఓఆర్ఆర్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి ఆకాశమే హద్దా అన్నట్లుగా దూసుకుపోతున్నది. తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కార్ కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రం నుంచి కూడా సహకారం అందుతోంది. దీంతో రాష్ట్రప్రగతి నల్లేరుమీద బండి నడకలా సాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రెండో శ్రేణి నగరాలలో కూడా అత్యున్నత స్థాయి మౌలిక వసతుల కల్పనకు వేగంగా అడుగులు పడుతున్నాయి.  

ఇందులో భాగంగానే రాజమహేంద్ర వరం చుట్టూ కొత్త ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధికి బీజం పడింది. రాజమహేంద్రవరంకు ఔటర్ రింగ్ రోడ్డు వేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అభివృద్ధి వేగం పెరుగుతుందనీ, వైజాగ్, చెన్నై రోడ్డు కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందనీ భావిస్తున్నారు.  అంతే కాకుండా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్య దాదాపు పూర్తిగా పరిష్కారమౌతుందని భావిస్తున్నారు.  రాజమహేందరవరం ఔటర్ రింగ్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. దీని కోసం అధికారులు డీపీఆర్ రెడీ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. డీపీఆర్ పూర్తికాగానే ఓఆర్ఆర్ కోసం భూమి సమీకరణ ప్రారంభించనున్నారు.  

కాగా రాజమహేంద్రవరం ఔటర్ రింగ్ రోడ్డు విషయాన్ని మంత్రి నారాయణ ధృవీకరించారు. రాజమహేంద్రవరం మునిసిపల్  కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ మధురపూడి, రాజానగరం, దివాన్‌చెరువు, దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.  ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణతో పాటు రాజమహేంద్రవరం నగర, గ్రామీణ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, జేసీ మేఘా స్వరూప్, కమిషనర్‌ రాహుల్‌ మీనా పాల్గొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu