హిడ్మా ఎన్ కౌంటర్ ఓ కట్టుకథ!

హిడ్మా ఎన్‌కౌంటర్‌  ఓ కట్టుకథగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభివర్ణించింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను విజయవాడలో అరెస్టు చేసి హత్య చేసి మారేడుమిల్లి ఎన్ కౌంటర్ కథ అల్లారని ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి  మాడ్వి హిడ్మా , రాజే తో పాటు కొంతమందిని విజయవాడలో నిరాయుధులుగా ఉండగా పట్టుకుని క్రూరంగా హత్య చేశారని ఆ ప్రకటన పేర్కొంది.  ఈ క్రూర హత్యకాండకు వ్యతిరేకంగా ఆదివారం (నవంబర్ 23) దేశ వ్యాప్తంగా నిరసన దినం  పాటించాలని దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చింది.  

  దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మనువాదులు పచ్చి ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.  ఫాసిస్టు ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలను చేస్తున్నదని ఆ ప్రకటన పేర్కొంది.  హిడ్మా,  అతని  భార్య  రాజే కొద్దిమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారనీ, ఈ సమాచారాన్ని కొందరు ద్రోహుల ద్వారా తెలుసుకుని వారిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.  

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ఆంధ్ర ఎస్ఐబీ  ఈ నెల 15 న విజయవాడలో హిడ్మా తదితరులను అదుపులోనికి తీసుకుని  లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరంగా హత్య చేసారని పేర్కొంది. మారెడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని, ఆయుధాలు దొరికాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించటం లాంటివన్ని పచ్చి అబద్దాలని పేర్కొంది.   చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు తలవంచకుండా తమ ప్రాణాలర్పించిన కామ్రేడ్స్ కు పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తోందన్న ఆ ప్రకటన వీరు  కొనసాగించిన విప్లవ సాంప్రదాయాలను, ఉద్యమ స్పూర్తిని నింపుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తామని కేంద్రకమిటీ శపథం చేస్తోందని పేర్కొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu