మీరు శాంతిదూత ఎలా అవుతారు ట్రంప్?
posted on Oct 11, 2025 12:28PM

పహెల్గాం దాడికి సూత్రధారి కసూరీని ఉగ్రవాదిగా ప్రకటిస్తుంది ఐక్యరాజ్యసమితి. అతడేమో పాకిస్థాన్ నడి వీధుల్లో నిర్భయంగా తిరుగుతుంటాడు. ట్రంప్, ఆయన కుటుంబం చూస్తే ఆ పాకిస్థాన్ తో వ్యాపారాలు చేస్తుంటారు. అంతేనా హఫీజ్ సయీద్ తలకు సుమారు 90 కోట్ల రివార్డు ప్రకటించింది మీరే, అతడికి పాకిస్థాన్ సైన్యం హైలెవల్ సెక్యూరిటీ అందిస్తూ కాపాడుతుంది. అతడేమో భారత్ మీద ఉగ్ర దాడులకు పథక రచన చేస్తుంటాడు. తద్వారా యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు మీరేమో మీ ఎఫ్ 16లు ఇతరత్రా ఆయుధాలు ఎలా పని చేస్తాయో చూద్దామని ఆలోచిస్తుంటారు. అలాంటి మీరు ఎలా అవుతారు శాంతి దూత? ఇక్కడ మా పౌరుల చితిమంటల్లో మీరు మీ మీ వ్యాపార లావాదేవీలు ఇతరత్రా లాభనష్టాల బేరీజు వేస్తుంటారు. అలాంటి మీరు శాంతి దూత అంటే నమ్మే వారెవరు?
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సంగతే తీసుకుందాం. అక్కడ ఉక్రేయిన్ పీకలోతు కష్టాల్లో ఉంటే.. మీరు చేసిందేంటి? ఆ దేశంతో పదేళ్ల ఖనిజ ఒప్పందం చేసుకోవడం. వాళ్లు చావు బతుకుల్లో ఉన్నా కూడా వదలక వ్యాపారం చేయడాన్ని ఏమంటారు? శాంతి స్థాపనగా దీన్నెలా భావించగలం? రష్యా నుంచి భారత్ చమురు కొనడం ద్వారా, ఆ దేశానికి నిధులు అందిస్తున్నారంటోన్న ట్రంప్.. మరి గాజాపై తరచూ విరుచుకుపడే ఇజ్రాయెల్ కి ఈ మధ్యే 2 బిలియన్ డాలర్లకు పైగా నిధులివ్వడాన్ని ఎలా తీసుకోవాలి? ఇది శాంతికాముకత ఎలా అవుతుంది?
ఉగ్రవాదులను కంటికి రెప్పలా కాపాడుకునే పాకిస్థాన్ కి మీరు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ నుంచి ఏటా కొన్ని వందల కోట్ల డాలర్ల నిధులు మంజూరు చేయిస్తుంటారు. వారేమో మసూద్ అజర్ వంటి వారి ఉగ్ర స్థావరాల పరిరక్షణకై ఈ నిధులు వెచ్చిస్తుంటారు. ఆ మాటకొస్తే అక్కడి సైన్యం ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంతో పాటు.. వారు ఏదైనా దాడుల్లో చనిపోతే.. దగ్గరుండి జాతీయ జెండా కప్పి మరీ అంత్యక్రియలు నిర్వహిస్తుంటుంది. అలాంటి దేశ ఆర్ధిక స్థితిని అనునిత్యం పరిరక్షించే మీరు శాంతి సాధకులు ఎలా అవుతారు?
ప్చ్.. ఎనిమిది యుద్ధాలను ఆపినా కూడా తనకు శాంతి బహుమతి రాలేదని ట్రంప్ ఎలా అంటారు? మీరు రివార్డులు ప్రకటించిన అశాంతి కారకులు, ఉగ్రనాయకులు మీ కంటి ముందే తిరుగుతుంటే.. మీరేం చేస్తున్నారు? వారిని కట్టడి చేసి ప్రపంచ శాంతి నెలకొల్పాల్సింది పోయి.. వారి ద్వారా ఉగ్రదాడులు చేయించి ఆపై యుద్ధం వచ్చేలా చేసి.. ఆ గ్యాప్ లో మీ దగ్గరున్న ఆయుధాలను అమ్ముకోచూసే అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ పీస్ మేకర్ అవుతారు?
నిజంగా ట్రంప్ శాంతి దూతే అయితే.. మొదట పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని అర్జెంటుగా అక్కడి నుంచి తొలగించాలి.. కారణం పహెల్గాం దాడికి కారకుడు ప్రేరకుడు. అతడే . దాడికి మూడు రోజుల ముందు అతడు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే పహెల్గాం దాడికి కారణం. అలాంటి వ్యక్తి యుద్ధం వస్తే పారి పోయి ప్రణాళికల్లేవ్- ప్రార్ధనల్లేవన్న పిరికిపంద. మీ కాళ్లు పట్టుకుని భారత్ చేత కాల్పుల విరమణ చేయించడం.. శాంతి ప్రయత్నం ఎలా అవుతుంది? పైపెచ్చు అటువంటి వ్యక్తిని అమెరికా ఆర్మీ పరేడ్ కి పిలిపించడం మాత్రమే కాకుండా.. అతడికి ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చి.. ఆపై పాకిస్థాన్ ని మీ వ్యాపార ప్రయోగశాలగా మార్చే యత్నం చేస్తున్నారు.
నోబెల్ శాంతి బహుమతి ఇలాంటి రక్తదాహంతో కూడిన వ్యాపార ప్రయోజనాలను కాపాడే వారికి ఇవ్వరు. అందుకెంతో నీతి, నిజాయితీ, ప్రజా సేవ, ప్రాణ త్యాగం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. మరి మీరేం చేస్తున్నారు ఇప్పటికీ ఏ దేశంలో ఏ సమస్య తలెత్తుతుందా? దాన్ని మనమెలా క్యాష్ చేసుకుందామా? అని చూస్తారు. కడుపులో ఒకటి పెట్టుకుని.. పైకి మాత్రం మరొక నీతి వచనం వల్లె వేస్తుంటారు. భారత్ అంటే అనుక్షణం రగిలిపోతూ.. ఆ దేశంపై వంద శాతం సుంకాలు విధిస్తుంటారు. మరి ఇప్పుడు విధించండి.. నోబెల్ మీకు ఇవ్వని నార్వే దేశంపై వందకు వంద శాతం సుంకాలు. ఎందుకంటే ఆ దేశం మిమ్మల్ని, మీ ప్రతిపాదనలను కనీసం పట్టించుకోలేదు కదా? ఎప్పుడైతే రక్తపిపాసి పాకిస్థాన్ మిమ్మల్ని ఈ బహుమతికి నామినేట్ చేసిందో అప్పుడే నోబెల్ కమిటీకి మీరేంటో మీ వ్యూహమేంటో పూర్తిగా అర్ధమై పోయింది.
పైపెచ్చు ట్రంప్ ది ఎంతటి తెంపరితనం అంటే.. నోబెల్ నామినేషన్లు జనవరిలోనే ముగిశాయి. గడువు ముగిశాక పాక్, ఇజ్రాయెల్.. ఆఖరికి రష్యా చేత కూడా సిఫార్సు చేయించుకుని మరీ నామినేట్ అయ్యారు. అయినా సరే తమ నోబెల్ ని ట్రంప్ లాంటి వారికిచ్చి.. ఆ మచ్చను కొని తెచ్చుకోవడం ఇష్టం లేని కమిటీ.. ఇదిగో వెనిజులా హక్కుల కార్యకర్త, ప్రతిపక్ష నేత, 58 ఏళ్ల మరియా మచాడోకు ఇచ్చి ఈ ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఈమె కూడా తనకొచ్చిన ఈ శాంతి బహుమతిని ట్రంప్ కే అంకితం ఇవ్వడం.
ఆల్రెడీ ఈ పురస్కారం తనకు దక్కదని భావించిన ట్రంప్ వైట్ హౌస్ నుంచి ద పీస్ ప్రెసిడెంట్ అనే అవార్డ్ పొందారు. అక్కడంటే నిపుణుల కమిటీ ఉండదు. ఆయన చెప్పిందే వేదం కాబట్టి దీంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఫైనల్ గా ట్రంప్ కి నోబెల్ రాక పోవడానికి రాజకీయాలే కారణమంటూ శ్వేత సౌధం స్పందించడం.. ఈ ప్రపంచమంతా కలసి చేసుకున్న దురదృష్టం కాక మరేమిటంటారు.. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.