ఇండియాలో మస్క్ స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు!?
posted on Dec 1, 2025 3:31PM

స్పేస్‌ఎక్స్, టెస్లా కార్ల అధినేత ఎలాన్ మస్క్ తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ముందుకు వచ్చారు. తక్కువ ఖర్చుతో, నమ్మకమైన ఇంటర్నెట్ సేవలను భారత గ్రామీణ ప్రాంతాలకు అందిస్తానంటున్నారు. తన స్టార్ లింక్ ప్రస్తుతం ఇండియాలో ఉన్న టెలికాం సంస్థలకు ఎటువంటి పోటీ కాదని చెబుతున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ నిఖిల్ కామత్‌తో 'పీపుల్ ఆఫ్ డబ్ల్యూటీఎఫ్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మస్క్ ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో తన సేవలను అందిస్తోందనీ, ఇక ఇప్పుడు ఇండియాలో కూడా అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
భూమికి దగ్గరగా తిరిగే వేలాది ఉపగ్రహాల ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని మస్క్ చెబుతున్నారు. భూమిపై ఫైబర్ కేబుల్స్ దెబ్బతిన్నా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగని టెక్నాలజీతో తమ సంస్థ సేవలందిస్తుందని మస్క్ చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భాలలో కూడా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు అంత రాయం కలగదని మస్క్ వివరించారు. ఇటీవల రెడ్ సీ కేబుల్స్ తెగిపోయినప్పుడు కూడా స్టార్ లింక్ సేవలు నిరంతరాయంగా కొనసాగాయని ఈ సందర్భంగా మస్క్ గుర్తుచేశారు.