అన్నీ ఆలోచించే.. పార్టీ నిర్ణయం మేరకే లొంగిపోయాం.. మావోయిస్టు ఆజాద్
posted on Nov 27, 2025 9:02AM

ఆయుధాలు విడిచి లొంగిపోవడంపై మావోయిస్టు తెలంగాణ రాష్ట్రకమిటీ మాజీ సభ్యుడు ఆజాద్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఆయుధాలను విసర్జించి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలన్న మావోయిస్టు పార్టీ పిలుపుమేరకే తాము లొంగిపోయామని స్పష్టం చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన తమ లొంగుబాటుకు కారణాలు, లొంగుబాట్లకు వ్యతిరేకంగా తాను అంతకు ముందు చేసిన ప్రక టన తదితర అంశాలపై వివరణ ఇచ్చారు. తామంతా పార్టీకి చెప్పే లొంగిపోయామని పునరు ద్ఘాటించారు. ఇంకా లొంగిపోకుండా ఉన్న రాష్ట్ర కమిటీ అగ్రనేతలు కూడా సరెండర్ కావాలని పిలుపు నిచ్చారు. మారుతున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని కొనసాగించడం కష్టమని పేర్కొన్న ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించడంలేదన్నారు.
తొలుత మల్లోజుల సాయుధపోరాటం వీడాలంటూ రాసిన లేఖతో పార్టీలో అయోమయం నెలకొన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తామంతా ఆ లేఖతో షాక్ కు గురయ్యామన్నారు. ఆ సమయంలోనే
మావోయిస్టు కేంద్ర కమిటీ సలహా మేరకు జగన్ పేరుతో మల్లోజుల స్టేట్ మెంట్ న ఖండిస్తూ.. మల్లోజుల సొంత ప్రయోజనాల కోసమే లేఖ రాశారని జగన్ పేరుతో తాన ప్రకటన విడుదల చేసినట్లు చెప్పిన ఆజాద్.. ఆ తరువాత పార్టీ కేంద్ర కమిటీ క్లారిటీ ఇవ్వడంతో గందరగోళానికి తెరపడిందన్నారు.
పార్టీకి చెప్పే ఆయుధాలను వీడి పోలీసుల ఎదుట లొంగిపోయామన్నారు. భూస్వామ్య వ్యవస్థ మీద వ్యతిరేకతతో పార్టీలో చేరాను..పీడత జనాల అభివృద్ధి కోసమే పార్టీలో చేరానని చెప్పిన ఆయన ఆ దిశగా పోరాటంలో కొంత మేర విజయం సాధించామని చెప్పుకొచ్చారు. అయితే ఆ తరువాత పరిస్థితులు మారాయనీ, ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణం జరగలేదనీ అన్నారు. ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకాన్ని పొందడంలో మావోయిస్టు పార్టీ విఫలమైందన్నారు. అలాగే పార్టీలోకి కొత్త క్యాడర్ రావడం ఆగిపోయిందనీ చెప్పుకొచ్చారు.