కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం
posted on Nov 30, 2025 9:38AM

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాల సామగ్రి కాలి బూడిదైంది. . వ్యాపారులకు కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు తెలుస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు విస్తరించిన బొమ్మల దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
సమీపంలో జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతర కోసం వ్యాపారులు పెద్ద మొత్తంలో బొమ్మలను నిల్వ ఉంచడంతో, ఒక్కో దుకాణంలో రూ.8 నుండి రూ.10 లక్షల వరకు సరుకు ఉన్నట్టు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.
దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. తమ కళ్ల ముందు సర్వస్వం నష్టం కావడంతో వ్యాపారులు తీవ్ర వేదనతో విలపించారు. ఆ ప్రాంతం అంతా విషాద వాతావరణం నెలకొంది.మల్యాల, ధర్మపురి సీఐలు రవి, రాం నర్సింహారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.