శేఖర్ సాధించిన విజయం

 

 

 

ఒకోసారి కాలం పరీక్ష పెడుతుందేమో అనిపిస్తుంటుంది. అడుగడుగూ అవరోధాలు - ఎం చేయాలో పాలుపోదు. అంతవరకు సాఫీగా సాగిన ప్రయాణం ఒడిదుడుకుల దారి పడుతుంది. అలాంటి సమయంలో భవిష్యత్తుపై ఆశ ఏ మాత్రం మిగలదు. గుండెల్లో ధైర్యం మొత్తం సన్నగిల్లిపోతుంది. ఇప్పటివరకు నడిచిన ఈ దారి ముసుకుపోతుంటే ఎలా ఏం చెయ్యాలని మధనపడతాం. కాని ఎందరో జీవితాలలో వారికి ఎదురైన అవరోధాలే వారిని ఓ కొత్త మార్గం వైపు మళ్ళించాయి. అలాంటి వారిలో ఒకరైన అనకపూత్తూర్ కు చెందిన శేఖర్ గురించి తెలుసుకుందామా...!


చెన్నై సమీపంలో చేనేతకు పెట్టింది పేరు అనకపూత్తూర్ ఊరు. అయిదారువేలమంది నేత కార్మికులకు అన్నం పెట్టే ఆ చేనేత వృత్తి ప్రపంచీకరణ నేపథ్యంలో తన ప్రభావాన్ని కోల్పోయింది. చివరికి మెషిన్ల పోటీకి తట్టుకోలేక మగ్గాలు మూలన పడ్డాయి. నేతన్నలు కూలీలుగా మారారు. ఈ పరిస్థితులలో భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు శేఖర్ కి. ఏం చెయ్యాలో తెలియదు కానీ, ఏదో చేయాలని మాత్రం గట్టిగా అనుకున్నాడు. ఆలోచించగా ఒక్కటే తోచిందట. పోటీ పడాలి తనతో తను పోటీ పడాలి. నిన్నటి తనకంటే, ఈనాటి తను, ఈనాటి తన కంటే రేపటి తను మెరుగ్గా ఉండాలంటే వైవిధ్య ఆలోచనలు చేయాలి. ఇలా ఆలోచించగా తను నార చీరలు తయారు చేస్తేనో అనుకున్నాడు.  నార చీరలు తయారు చేయాలని నిర్ణయించుకొని మొదట్లో అరటి, జనపరాలతో చీరలు తయారు చేశాడు. వాటి నాణ్యతపై పూర్తి నమ్మకం కుదిరాక ఊళ్లోని మరి కొందరికి కూడా చెప్పి నార చీరల తయారీ మొదలు పెట్టాడు. ఒక్క చీరలే కాదు, బ్యాగులు, దిండు గలీబులు, కార్పెట్లు, డ్రెస్ మెటీరియల్స్ ఇలా ఎన్నెన్నో వెరైటీల తయారీ ప్రారంభమయ్యింది. వైవిధ్యానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుందిగా. అమ్మకాలు చెన్నై నుంచి బెంగుళూరు, ఢిల్లీలకు విస్తరించాయి. మిగతా నేతన్నలూ ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఎన్నో వేల అరటి నార చీరలు, కలబంద నార చీరలు అమ్మారు. పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వారిని కూడా ఇవి ఆకర్షించాయి. మన రాష్ట్రపతికి కూడా శేఖర్ తయారు చేసిన నార చీరలు అందాయి... నచ్చాయి కూడా.అయితే ఇంతటి విజయం సాధించిన శేఖర్.. తన విజయం గురించి ఏమంటాడంటే.... మన పని నాణ్యతగా ఉంటే ఆదరణ అదే వస్తుంది. ఏది ఎప్పటికి ఆగిపోదు. ఒకటి అగిందంటే మరొకటి ఏదో మనకోసం రెడీగా ఉందన్నమాటే. అదేంటో తెలుసుకోవడంలోనే మన విజయం దాగుంటుంది అంటాడు. చెప్పటమే కాకుండా ఒక్కొక్కటిగా ప్రయోగాలు చేస్తూ అరటి, జనపనార, ఫైనాఫిల్, కలబంద.. ఇలా వేర్వేరు నారలతో చీరలు తయారు చేస్తున్నాడు. తనతో పాటు ఎందరికో ఉపాధికల్పిస్తున్నాడు. కేవలం పాతతరం నేత పనికే పరిమితం కాకుండా ఓ కొత్త ఆలోచన చేయబట్టే అతనికి ఇంతటి విజయం దక్కింది.కాబట్టి.... దీని వల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటంటే.... ఒక దారి మూసుకుపోయిందంటే పది దారులు తెరుచుకున్నట్టే ఎదగడానికి అవకాశం దొరికినట్టే. పరిస్థితులు పగపట్టాయంటూ నిలదీస్తూ కూర్చునే కంటే వాటిని దాటేందుకు సిద్దమయితే చాలు. కాలం సలాం చేసి మరీ విజయాలను మన దరికి చేరుస్తుంది.