ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం : టీపీసీసీ చీఫ్

 

స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రేపు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన  ట్యాపింగ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయంతోనే ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పేర్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తక్షణమే బయటపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. "ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని గౌడ్ స్పష్టం చేశారు.

ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని, దోషులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనాన్ని నీళ్లలో పోసిందని ఆరోపిస్తూ ఆర్థిక దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు చేశారు.  బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హక్కుల కోసం వెనక్కి తగ్గమని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగినప్పటికీ బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా రాజకీయ నేతలు, సినీ తారలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని మండిపడ్డారు. 2022 నుంచి 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఈ విషయంలో సిట్ ముందు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చానని ఆయన తెలిపారు