ఆమె ఒక "శక్తిశాలిని"

 

 

 

ఒక కష్టం కలిగినప్పుడు ఆ కష్టం వల్ల కలిగే బాధ కొందర్ని క్రుంగదీస్తే, మరికొందర్ని దృఢంగా మారుస్తుంది. కొందరికి ఆ కష్టం నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలే పడుతుంది. మరికొందరిని తమలాంటి కష్టం కలిగిన వారిని ఎవరు ఓదారుస్తారన్న ఆలోచన వెంటనే తేరుకునేలా చేస్తుంది.

 

కన్నబిడ్డలంటే ఎవరికైనా ఎంతో మమకారం వుంటుంది. చిన్నతనం నుంచి కంటికి రెప్పల్లా కాచుకుని, అపురూపంగా పెంచుకున్న కూతుర్ని నిర్దాక్షిణ్యంగా, కట్నం కోసం కాల్చిపారేశారని తెలిస్తే? అందులోనూ కడుపులో బిడ్డని మోస్తున్న కూతుర్ని కిరాతకంగా భర్త, అత్తమామలే చంపారని తెలిస్తే? ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా వుంటుంది. కానీ, ఆ బాధ నుంచే మరెందరికో ఆశ్రయం ఇచ్చే ఓ సంస్థ పుట్టింది. ఆ బాధే ఎందరో అభాగ్యులకి తోడుగా నిలిచి పోరాడేలా చేసింది.సత్యరాణి కూతురు కట్నం కోసం బలైపోయింది. తీరని దు:ఖమే అయినా, తనలా మరెవరూ కూతురున్ని పోగొట్టుకోకూడదనే ఆశయంతో ఎన్నో సంవత్సరాలుగా ఇంటికే పరిమితమైన సత్యరాణి వరకట్నంపై పోరాటం ప్రారంభించింది. చట్టాలు, న్యాయస్థానం వీటి సంగతి పక్కన పెట్టి ముందు సమాజంలోని వ్యక్తులలో మార్పు కలిగినప్పుడే  ఈ దురాచారం సమూలంగా సమసిపోతుందని నమ్మి  ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీలో నివసించే సత్యరాణి ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేదు. చట్టం, న్యాయం, గురించి ఏమాత్రం తెలియకపోయినా వరకట్నానికి సంబంధించిన చట్టాలని, వాటిలోని లోటుపాట్లని తెలుసుకునేందుకు ప్రయత్నించింది.వరకట్నానికి వ్యతిరేకంగా మాత్రమే  పోరాటం సాగించాలనుకున్నా, ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు మరెన్నో స్త్రీల సమస్యలు బయటపడ్డాయి. ఉద్యమం విస్తృతమైంది. అత్యాచారం వంటివి జరిగినప్పుడు, ప్రేమ వివాహాలలో మోసపోయినప్పుడు సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఆత్మహత్యకి పాల్పడే యువతులను రక్షించి, వారికి ఆశ్రయం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి, వారి కాళ్ళపై వారు నిలబడేలా చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో సంకల్పం తనదే అయినా చేయందించే సహృదయులు ఎందరో వుండబట్టే తాను ఈమాత్రం సేవ చేయగలుగుతున్నానంటారు సత్యరాణి.ప్రపంచం ఎంత ఆధునీకరణ దిశగా పయనిస్తున్నా, ఇంకా సంకుచితంగా ఆలోచించేవారు ఎందరో వున్నారు. భార్యని నిర్దాక్షిణ్యంగా ఇళ్ళలోంచి వెళ్ళగొట్టడం వంటివి ఇప్పటికే వింటున్నాం. అలా నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడమే కాదు.. వారి సమస్యను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నిస్తారు. వారి కుటుంబంతో మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తారు. అవసరమైతే చట్ట సహాయం కూడా తీసుకుంటారు. తిరిగి ఆమెని తన ఇంటికి పంపించాక, అక్కడితో తమ పని అయిపోయిందని అనుకోకుండా, ఆమె బాగోగుల గురించి అప్పుడప్పుడు ఆరా తీస్తుంటారు. అవసరమైన సహాయాన్ని అందిస్తుంటారు. ఇవన్నీ సత్యరాణి ప్రారంభించిన ‘శక్తిశాలిని’ అనే సంస్థ ఆమె ఆధ్వర్యంలో నిర్వహించే కార్యకలాపాలు.కేవలం ఒక గృహిణిగా, ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేదు. సమాజం పోకడలు, న్యాయం, చట్టం వంటి విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు. కానీ, ఓ సంకల్పం చేసుకుంది. ఆ దిశగా అడుగులు కదిపించింది. మొదట ఒక వ్యక్తిగా ప్రారంభించిన కార్యకలాపాలు ఈరోజు వందల మందిని భాగస్వాములను చేశాయి. ఒకటొకటిగా మహిళల కష్టాలని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిస్పృహ నిండిన వారిలో ధైర్యాన్ని, స్ఠైర్యాన్ని నింపుతూ, ‘నేనున్నానన్న’ భరోసాని అందిస్తోన్న సత్యరాణి తపన అమ్మ మనసుకి అద్దం పడుతుంది. తన మనసులో, ఒడిలో ఎందరో కూతుళ్ళకి స్థానం కల్పించిన ఈమె వయసుతో సంబంధం లేకుండా అలుపెరుగని పోరాటం సాగిస్తూనే వున్నారు గత 20 సంవత్సరాలకు పైగా.మొదటి అడుగులో ఒక్కరమే.. కానీ, సంకల్పం మంచిదైనప్పుడు ఆ అడుగుల వడిలో జత చేరే అడుగులు మరెన్నో వుంటాయి. ఇది నిజం.