మలాలా అంటే చదువుల తల్లి

మొన్నటి వరకూ తల్లిదండ్రుల చాటున పెరిగిన ముగ్ధలాంటి ఆడపిల్ల మలాలా... ఇప్పుడు కేవలం 17 సంవత్సరాల వయసులోనే నోబుల్ శాంతి బహుమతి గెలుచుకుని మహిళా శక్తిని మరోసారి ప్రపంచానికి చాటింది. గంజాయి వనంలో తులసిమొక్క పుట్టినట్టుగా, హింస అంటే పడిచచ్చే పాకిస్థాన్‌ దేశంలో పుట్టిన శాంతి కపోతం మలాలా యూసఫ్‌జాయ్.

మలాలా యూసఫ్‌జాయ్ పాకిస్థాన్‌లోని స్వాత్ ప్రాంతంలో పుట్టి పెరిగింది. తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా వున్న ఆ ప్రాంతంలో మహిళలు చదువుకోవడం అంటే అది చంపడం లాంటి భారీ శిక్ష విధించేంత పెద్ద నేరం. అయితే చదువుకోవడం నా జన్మహక్కనే మలాలా బడికి వెళ్ళితీరతానని పట్టుబట్టింది. బాలికలు చదువుకోవడం మీద నిషేధం వున్న ప్రాంతంలో చదువుకుంటానని తన బలమైన సంకల్పాన్ని వ్యక్తం చేసింది. బాలికల చదువు మీద తాలిబన్ల అదుపాజ్ఞలను పదకొండేళ్ళ వయసులోనే వ్యతిరేకించి, అందుకు నిరసనగా గళం విప్పింది. చిన్న వయసులోనే విద్యాకార్యకర్తగా ప్రశంసలు అందుకుంది.

మలాలా అభ్యుదయవాద ధోరణిని సహించలేని ఒక దురదృష్టకరమైన సమయంలో చిన్నారి మలాలా మీద ఒక తాలిబన్ ఉన్మాది అత్యంత పాశవికంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మలాలా ఇక చనిపోతుందని అందరూ అనుకున్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా మలాలా అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారంటే ఆమె ఏ స్థాయిలో గాయపడిందో అర్థం చేసుకోవచ్చు. నెత్తుటి ముద్దలా మారిన చిన్నారి మలాలా తన సంకల్పబలంతో కోలుకుంది.

ఆ తర్వాత పాకిస్థాన్‌లోని హింసాత్మక వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపోయిన మలాలా లండన్‌లోని బ్రూమింగ్‌హామ్‌లో ఆశ్రయం పొందింది. అక్కడి నుంచి బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తోంది. మలాలా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ఇప్పుడు ఆమెకి లభించిన నోబెల్ శాంతి పురస్కారం ఆమెకు అంది తీరాల్సిన అత్యున్నత గౌరవం. మలాలాకి అభినందనలు.