పేద పిల్లలకు ప్రేమనుపంచే ‘లాక్స్ ఆఫ్ లవ్’

 

చక్కటి ఆకారానికి జడ అందాన్నిస్తుంది. ఎంతటి అందమైనా సరైన తలకట్టు లేకపోతే వెలవెలబోతుంది. అందులోనూ ఇప్పటి వాళ్ళకి జుట్టు విలువ తెలిసినంతగా వేరెవరికీ తెలియదు. ఎందుకంటే, వత్తయిన తలకట్టు, బారు జడ, మగవారికైతే వత్తయిన క్రాఫు అన్నీ ఒకప్పటి ముచ్చట్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడు చిన్న పోనీటైల్. దానిని సంరక్షించుకోవాడానికే ఎన్నో ప్రయత్నాలు. ఏ ఇద్దరు అమ్మాయిలు కలసినా రాలిపోతున్న జుట్టు గురించి కబుర్లు దొర్లకుండా వుండవు. ఇక అబ్బాయిలకైతే చిన్న వయసులోనే బట్టతల బాధలు తప్పడం లేదు. కొద్దోగొప్పో నాలుగు వెంట్రుకలయితే వున్నాయి కదా. ఆ నాలుగు వెంట్రుకల కోసమే మనమింతగా బాధపడిపోతే, అసలేమీ లేకుండా, ఉన్న జుట్టుంతా పోగొట్టుకుని బోడిగా వుండేవారి సంగతి? డబ్బున్నవారికైతే ఏ విగ్గులో దొరుకుతాయి. మరి పేదవారి సంగతి? అందులోనూ పిల్లల సంగతి? ఎప్పుడైనా ఆలోచించామా? లేదు కదా- ఇప్పుడు ఆలోచిద్దాం.


 

కేన్సర్ అటేనే అమ్మో అంటాం. దాని ట్రీట్‌మెంట్ మొత్తం తట్టుకోవడం ఒక ఎత్తు. ఆ ట్రీట్‌మెంట్ జరిగే సమయంలో ఒక్క వెంట్రుక సైతం లేకుండా మొత్తం జుట్టుంతా పోగొట్టుకోవడం ఒక ఎత్తు. ఒట్టి కేన్సరే కాదు, ఒళ్ళు కాలడం, ఇంకా రకరకాల అనారోగ్యాలతో, వ్యాధులతో జుట్టు కోల్పోవడం ఎంతో బాధపెట్టే విషయం. ఇదంతా చెప్పుకున్నట్టు డబ్బుతో ఏ విగ్గులో కొనుక్కోగలిగే వారి సంగతి పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా ఇలా జుట్టు కోల్పోయి మానసికంగా కృంగిపోతున్న పేదపిల్లల పరిస్థితి మరీ కష్టం. ఓపక్క వ్యాధి తాలూకు బాధ, మరోపక్క తోటి పిల్లల మధ్య జుట్టులేక ఇబ్బంది. ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. మరి ఆ పిల్లలకి పరిష్కారమేంటి? మనమేం చేయగలం. ఎలాంటి సహాయం అందించగలం?

 

మనం అయ్యోపాపం అంటూ వదిలేసే విషయాలని కొంతమంది అలా వదిలెయ్యలేక వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారు. వివిధ అనారోగ్య కారణాలతో జుట్టుని పోగొట్టుకుని బోడిగా తయారైన తలతో స్కూళ్ళలో, సమాజంలో తిరగలేక న్యూనతకి గురయ్యేవారి కోసం వారికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తోంది ‘లాక్స్ ఆఫ్ లవ్’ అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తోందో తెలుసా? ఓ ఉద్యమంలాగా ప్రజల నుంచి ‘జుట్టు’ని దానంగా తీసుకుంటోంది. ఆ తరువాత ఆ జుట్టుని చక్కటి అందమైన విగ్గులా తయారుచేసి  పేదపిల్లలకి అందిస్తోంది. అమెరికాలోని ఈ స్వచ్ఛంద సంస్థకి జుట్టు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చేరుతోందిట. ఎంతోమంది స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు స్వచ్ఛందంగా తమ జుట్టుని ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నారు.

 

ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న ఎంతోమంది పేదపిల్లలకి మన జుట్టుని దానంగా ఇవ్వాలనుకుంటే శుభ్రంగా తలస్నానం చేసి, ఆరబెట్టుకున్న జుట్టుని ఒకే లెవల్‌లో కట్ చేయాలి. దాన్ని ఓ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి మన పేరు, వివరాలతో వీరికి పంపాలి. జుట్టు కనీసం 10 అంగుళాలు వుండాలి. చిక్కుపడిన జుట్టు, వెంట్రుకల చుట్టలు కాకుండా ఒకే పద్ధతిలో వున్న వెంట్రుకలు పంపాలి. ఆ తర్వాత అవి అందమైన విగ్గులుగా తయారై  పిల్లలకి అందుతాయి. ఈ విధానమంతా ఎంతో పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ సంస్థ కార్యకలాపాలకి మెచ్చి అంతర్జాతీయంగా వివిధ స్వచ్ఛంద సంస్థలకు రేటింగ్ ఇచ్చే ‘ఛారిటీ నావిగేటర్’ ఈ సంస్థకు 68.1 రేటింగ్ ఇచ్చింది. 70 పాయింట్లకి 68 పాయింట్లు వచ్చాయంటే అర్థమవుతోంది కదా ఈ సంస్థ ఎంత నిస్వార్థంగా పనిచేస్తోందో? మరి పంపటానికి అడ్రస్సో అంటారా? www.locksoflove.orgకి వెళ్ళి అక్కడ చెప్పిన అడ్రస్‌కి మన జుట్టుని పంపడమే. ఎందరో పిల్లల ముఖాల్లో నవ్వులని, మనసులలో ధైర్యాన్ని, గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ఈ దానం మహాదానం కాకపోయినా చిన్నదానమైతే కాదు. locksofloveకి సహాయపడగలిగితే పరోక్షంగానైనా ఎందరో పిల్లలకి మంచి చేసినట్టే. ఆలోచిస్తారు కదూ!

-రమ ఇరగవరపు