శాస్త్రీయ విద్యాదాత రామ్జీ రాఘవన్!

 

నేటి విద్యావ్యవస్థ పైన ఎంతోమందికి అసంతృప్తి వుంది. మేధావులు, విద్యావేత్తలు, నిపుణులు ఇప్పటి విద్యావిధానం పిల్లల్లోని ఆలోచనశక్తిని, ప్రశ్నించే తత్వాన్ని తగ్గించేస్తోందని వాపోతున్నారు. వీటన్నిటిని దగ్గరగా గమనించిన ఓ వ్యక్తికి వచ్చిన ఓ ఆలోచన ఈరోజు ఎంతోమంది విద్యార్థులలోని సృజనాత్మకతకి, మేధోవికాసానికి కృషి చేస్తోంది. అతనే రామ్జీ రాఘవన్. ‘అగస్త్య సైన్స్ సెంటర్’ స్థాపకుడు. పాఠాల్ని బట్టీకొట్టించడం కాకుండా ప్రయోగాలు, నమూనాల ద్వారా బోధించగలిగితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని భావించారు.

 

బాభా సైన్స్ సెంటర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇస్రో శాస్త్రవేత్తల సహకారంతో భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణితం, పర్యావరణ శాస్త్రాలకు సంబంధించిన 300 వరకు ప్రయోగాలు, బోధన నమూనాలు సిద్ధం చేశారు. 2001 నుంచి వాటినిచిత్తూరు జిల్లాలో ప్రదర్శనకు ఉంచారు. ప్రయోగాలు, నమూనాల ద్వారా పాఠాలు చెప్పడాన్ని ముందుగా గ్రామాల్లో ప్రారంభించాలనుకున్నారు రాఘవన్. సైన్స్ కేంద్రానికి సమీపంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థుల్ని తీసుకొచ్చి ప్రతి సబ్జెక్టును నమూనాల సాయంతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు బోధించడం మొదలుపెట్టారు.‘అగస్త్య సైన్స్ కేంద్రం’లోకి విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అనుమతి వుంది. ఉపాధ్యాయులకి ఆధునిక పద్ధతుల్లో శిక్షణ కూడా ఇస్తారు ఇక్కడ. అలాగే చుట్టుపక్కల స్కూల్స్‌లో తరచూ సైన్స్ ఫెయిర్‌లను ఏర్పాటు చేస్తుంటారు. అగస్త్య సేవలు ఇప్పటి వరకు దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు, దాదాపు 80 వేల మంది ఉపాధ్యాయులకూ చేరాయి. ఈ సైన్స్ కేంద్రంలో నిత్యం ఒకే తరహా ప్రయోగాలు కాకుండా ఎప్పటికప్పుడు కొత్త వాటిని చేర్చుతుంటారు. అలాగే ఇక్కడ కేవలం పాఠాలే కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాల్ని కూడా శాస్త్రీయ పద్ధతిలో వివరిస్తారు.సైన్స్ కేంద్రానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు దూరప్రాంతాల నుంచి తరచూ రావడం కష్టమవుతోందని భావించి అగస్త్య ప్రాంతీయ సైన్స్ కేంద్రాలని ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో సంచార ప్రయోగశాలల్ని ప్రారంభించారు. సైన్స్ పరికరాలతో నిండిన మినీ బస్‌లో అగస్త్య టీమ్ ఊరూరా తిరుగుతూ ప్రయోగాలతో పాఠాలు బోధిస్తుంది. వీటిలో ఇద్దరు శిక్షకులు వుంటారు. ప్రస్తుతం ఈ సైన్స్ సెంటర్ 35కు పైగా మొబైల్ ల్యాబ్‌‌లను నడుపుతోంది.అగస్త్య సైన్స్ సెంటర్‌ని సందర్శించి నమూనాలు, ప్రయోగాల ద్వారా పాఠాల్ని నేర్చుకున్న చుట్టుపక్కల పాఠశాలల విద్యార్థులలో ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగిందట. సైన్స్.లో ఉత్తీర్ణతా శాతం 90 శాతంగా వుందంటే అర్థమయిపోతుంది పిల్లలు ఇక్కడ సైన్స్.ని చూసి నేర్చుకోవడాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో.

 

.....రమ