పేదల ముంగిట్లో విద్యాదాత రజని పరాంజపే!

పెద్ద విజయాలు సైతం చిన్న ప్రయత్నాలతోనే మొదలవుతాయి. ఒక్కరి ఆలోచన వేలాది మంది జీవితాలను మార్చేయొచ్చు. అదే జరిగింది. ముంబాయిలో. ముంబాయి వంటి మహానగరంలో మురికివాడలకి కొదవే లేదు. అక్కడ పూటగడవటమే కష్టంగా వుండేవారు ఎందరో. ఇక అక్కడి పిల్లలకు చదువు, స్కూలు అన్నవి తీరని కలలు. వాధుల్లో చెత్తాచెదారం ఏరుకుంటూ, చిన్నచిన్న పనులు చేసుకుంటూ పెరిగి పెద్దయ్యి... మరో తరం ఆ మురికివాడల్లో పేదరికంతో మగ్గిపోతోంది. అదే అక్కడి పిల్లలని అక్షరాస్యులుగా తీర్చిదిద్దితే? అది వారి జీవన ముఖచిత్రాన్నే మార్చేస్తుంది. చిన్నగా అయినా ఓ మార్పు మొదలయితే అది క్రమంగా ముందు తరాలని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుంది. ఈ ఆలోచన వచ్చిందో వ్యక్తికి. ప్రయత్నం చేస్తే వేలాదిమంది జీవితాలు మారిపోయాయి.


‘రజని పరాంజపే’. ఈమెకి వచ్చిన ఆలోచనే నేడు ఎందరికో అక్షర జ్ఞానాన్ని పంచుతోంది. ప్రత్యేకంగా స్కూలు వరకు రాలేని పిల్లల వద్దకే స్కూలుని తీసుకువెళితే? పేదల ముంగిట్లోకి పాఠాలని చేరిస్తే? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆ దిశగా ప్రయత్నాలు సాగించారామె. ఆ ప్రయత్నాల నుంచి పుట్టిందే ‘డోర్ స్టెప్ స్కూల్’. ఓ చిన్న బస్సు. అందులో బోర్డు, పుస్తకాలు, కూర్చునేందుకు బల్లలు, పలకలు, బలపాలు. అచ్చంగా ఓ తరగతి గదిలా వుంటుంది. అందులో పిల్లలకు అక్షరాలు నేర్పించే టీచర్లు వుంటారు. ఆ బస్సు మురికివాడల్లోకి వెళ్తుంది. అక్కడి పిల్లలందర్నీ బస్సులో చేర్చి వారితో అక్షరాలు దిద్దిస్తారు అందులోని టీచర్లు. ‘విద్యార్థుల దగ్గరకి పాఠశాల’ ఇలా ప్రారంభమైంది.

పిల్లల ముంగిట్లోకి పాఠశాలని తీసుకువెళ్ళి, వాళ్ళకి నచ్చచెప్పి, బొమ్మలు, చాక్లెట్లు వంటివి ఇస్తామని ఆశచూపి, అక్షరాలని దిద్దించి, ఆ తర్వాత ప్రాథమిక విద్య కోసం దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం.. ఇది వారి లక్ష్యం. అయితే చెప్పుకున్నంత సులువుగా సాధ్యం కాలేదది. వీరిపై నమ్మకం కలిగేలా చేసుకోవడానికే ఎంతో సమయం పట్టింది. ఆ తర్వాత ఒకసారి ‘డోర్ స్టెప్ స్కూల్’లోకి అడుగుపెట్టాక ఆ పిల్లలు కనీస విద్య పూర్తిచేసే వరకూ మధ్యలోనే మానేయకుండా చూడటం మరో పెద్ద సమస్య. వీటన్నిటితోపాటు ఆ కుటుంబానికి కావలసిన కనీస అవసరాలు, ఆర్థిక సహాయం వంటివి అందించడం ద్వారా వారితో సత్సంబంధాలని పెంపొందించుకోవడం.. ఇలా ఎన్నో సవాళ్ళని ఎదుర్కుని నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డారు ‘డోర్ స్టెప్ స్కూల్’ సంస్థ వారు.

ఓ మంచి  ఆశయంతో ఓ అడుగు ముందుకు వేసిన ‘డోర్ స్టెప్ స్కూల్’ ఒక్క బస్సుతో, ఒక ప్రాంతంలో తన ప్రయత్నాన్ని మొదలుపెట్టి నేడు ముంబాయి, పూణెలలో సుమారు 40 ప్రాంతాల వరకు తన సేవలను విస్తరించింది. ఎన్నో బస్సులు ఉదయం 8 గంటల నుంచి  రాత్రి 9 గంటల వరకు వివిధ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ పిల్లలకి చదువు చెబుతాయి. అంతేకాదు, బస్సులో ప్రాథమికంగా అక్షరాలు నేర్చుకుని ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చేరిన పిల్లలని ఇంటి నుంచి స్కూలుకు చేర్చటం, స్కూలు నుంచి ఇంటికి చేర్చటం వంటివి కూడా చేస్తాయి ఈ బస్సులు. కేవలం స్కూలులో చేర్చటంతో తమ పని అయిపోయిందని అనుకోకుండా వారు కనీస విద్య పూర్తిచేసేదాకా వారి వెన్నంటి వుంటారు ‘డోర్ స్టెప్ స్కూలు’ వారు.

అందరికీ విద్య అందుబాటులో వున్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుంది. విద్య ఉపాధిని అందిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక స్థితిగతులను మారుస్తుంది. అందుకే అందరికీ విద్య అందుబాటులో వుండాలన్నది మా ఆశయం అంటారు ఆ స్వచ్ఛంద సంస్థ వారు. పిల్లలు చదువు పూర్తిచేశాక వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఉపాధి అందించే వివిధ కోర్సుల్లో వారి ఇష్టాన్ని అనుసరించి చేర్పిస్తారు. ఆ తర్వాత ఉపాధి అందేలా చూస్తారు. ఇలా ముందు తరం సగర్వంగా తలెత్తుకు నిలబడేలా చేస్తున్నారు వీరు. వారి ప్రయత్నానికి అభినందనలు తెలుపుతూ ఆ స్ఫూర్తితో మనం కూడా మన పరిధిలో ఏం చేయగలమో ఆలోచిద్దాం.

-రమ ఇరగవరపు