రుషికొండ ప్యాలెస్ లో గూగుల్ !?
posted on Nov 5, 2025 3:23PM

వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వ్యయం చేసి మరీ రుషికొండపై జగన్ హయాంలో నిర్మించిన విలాసవంతమైన ప్యాలస్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. జగన్ తన సొంతం కోసం ప్రజాధనంతో నిర్మించిన ఈ అత్యాధునిక విలాసవంతమైన భవనాన్ని ఎలా ఉపయోగించాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. దేశంలో ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో గూగుల్ ఇక్కడ డేటా సర్వేను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ కంపెనీకి అప్పగిస్తే.. ఆ కంపెనీ తన డేటా సెంటర్ కు శాశ్వత నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునే వరకూ రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ కార్యాలయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం మేధావులు, విద్యావేత్తల నుంచి వస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత పొందిన గూగుల్ కి ఇస్తే డేటా సెంటర్ కార్యకలాపాలు జాప్యం లేకుండా ప్రారం భమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ అంశాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సీరియస్ గా పరిశీలించాలంటున్నారు.
డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం భూమి కేటాయింపు, ఆ కేటాయించిన భూమిలో కంపెనీ నిర్మాణాలు చేపట్టడం వంటివన్నీ పూర్తి కావడానికి ఎంత లేదన్నా రెండు సంవత్సరాలు పడుతుంది. అంత వరకూ రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ కు అప్పగిస్తే.. ప్రభుత్వానికి ఆ ప్యాలెస్ మెయిన్ టెయినెన్స్ ఖర్చు కలిసిరావడమే కాకుండా ఆదాయం కూడా వస్తుందని అంటున్నారు.
అమెరికా తరువాత ఆ స్థాయిలో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. అమెరికా వెలుపల ఇంత భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడానికి మంత్రి లోకేష్ చోరవే కారణమనడంలో సందేహం లేదు.విశాఖ ఐటీ హబ్ గా మారడానికి ఇది తొలి అడుగు అని చెప్పాల్సి ఉంటుంది. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంస్థలు రావడం మాట అటుంచి.. ఉన్నవి తరలిపోయే పరిస్థితి ఉండేది. అభివృద్ధి ఆనవాలే కనిపించని పరిస్థితి. అరకొర సంక్షేమం అమలు చేయడమే పాలన అనుకున్న జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ వెనుకబడిపోయింది.
మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి సుమాలు విరియడం మొదలైంది.. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి భారీ ఆధిక్యతతో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టిన తరువాతే. జగన్ హయాంలో రాష్ట్రం రాజధాని అనేదే లేకుండా అనాథగా మారింది. జగన్ మూడు రాజధానులంటూ.. అసలు రాజధానే లేని పరిస్థితిని తీసుకువచ్చారు. ఆర్థిక రాజధానిగా విశాఖ అన్న జగన్.. విశాఖలో ప్రజాధనంతో ప్రజలను ఉపయోగం లేని రుషికొండ ప్యాలెస్ నిర్మించడం తప్ప చేసినదేమీ లేదు. ఇప్పుడు ఆ ప్యాలెస్ నిర్వహణే ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. అందుకే రుషికొండ ప్యాలెస్ ను గూగుల్ డేటా సెంటర్ కు అప్పగిస్తే సద్వినియోగం అవుతుందని అంటున్నారు.