కరెన్సీ నోట్లతో గణనాథుడికి అలంకరణ
posted on Aug 30, 2025 10:06AM

గణపతి నవరాత్రి ఉత్సావాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి పందిళ్లను నిర్వాహకులు వినూత్న రీతిలో అలంకరణలు చేస్తున్నారు. అయితే మంగళగిరిలో కొలువైన గణపతిని అలంకరించే విషయంలో నిర్వాహకులు మరింత వినూత్నంగా ఆలోచించారు.
ఏకంగా గణనాథుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణ కోసం ఏకంగా 2 కోట్ల 35 లక్షల రూపాయల కరెన్సీని ఉపయోగించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజారులో వ్యాపార ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘాలు, మహిళా సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారిని రూ.2.35 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో భక్తులు గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.