వరద పరిస్థితిపై సీబీఎన్ సమీక్ష, రిజర్వాయర్లు, చెరువులూ నింపాలని ఆదేశం

గోదావరి, కృష్ణా నదులకు వరద, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో  వర్చువల్ గా సమీక్షించారు.  డైనమిక్ ఫ్లడ్ మేనేజ్ మెంట్, నీటి వనరుల సంపూర్ణ వినియోగంపై ఆయనీ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని రియల్ టైమ్ లో ఎస్టిమేట్ చేసి.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 అదే విధంగా కురిసిన వర్షాన్ని రెయిన్ గేజెస్ ద్వారా గణించి... వరద యాజమాన్యం పకడ్బందీగా చేయాలని చంద్రబాబు ఆదేశించారు.  అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని, అలాగే చెరువులను నీటితో నింపాలన్నారు.   ఇలా ఉండగా  ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 6.57 లక్షల క్యూసెక్కుల వరద ఉందని అధికారులు తెలిపారు. వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి పంపుతున్నట్లు వివరించారు. ఇక సోమవారం (సెప్టెంబర్ 29) దాదాపు  7 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావొచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు.  శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్నారు. అదే విధంగా  ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం  10.12 లక్షల క్యూసెక్కులు ఉందనీ, ఇది మరింత పెరిగి   11.50 లక్షల క్యూసెక్కు చేరే అవకాశం ఉందన్నారు. 

 చెరువులు నింపడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అలాగే  వరదల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలనీ,  వరద ప్రభావిత ప్రాంతాల్లో  అన్ని శాఖల అధికారులూ  సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu