అమరావతిలో సీఆర్డీయే భవన ప్రారంభం
posted on Oct 13, 2025 11:20AM

రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసిన చంద్రబాబు
రాజధాని అమరావతి ప్రాంతంలో మరో అధునాతన కట్టడం ప్రారంభమైంది. రాజధాని అమరావతికి గుండెకాయ వంటి సీఆర్డీయే భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం (అక్టోబర్ 13) ప్రారంభించారు. ఏడు ఫ్లోర్లతో , రెండున్నర లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించిన భవనం ప్రారంభం కావడం రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలక ముందడుగుగా చెప్పవచ్చు. కాగా ఈ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు... రాజధాని కోసం భూములిచ్చిన రైతులను కూడా భాగస్వాములను చేశారు
ఈరోజు ఉదయం 9.54 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. సీఆర్డీయే భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబుకు పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి సీఎం చంద్రబాబు రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన భవనమంతా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉన్న మంత్రి నారాయణ.. భవన నిర్మాణ శైలి, సౌకర్యాలను సీఎంకు వివరించారు. వాస్తవానికి సీఆర్డీయే భవన నిర్మాణం 2019లోనే పూర్తైనప్పటికీ, అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ కూడా భవన ఎలివేషన్ పనులను నిలిపివేసింది. తిరిగి 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే మిగిలిన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాలు, సూచనల మేరకు సీఆర్డీఏ కార్యాలయాన్ని అత్యాధునిక హంగులతో రూపొందించారు. పూర్తి సౌండ్ ప్రూఫ్ విధానంతో ఈ నిర్మాణా లు జరిగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అమరావతి నగరవ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో, సీసీ కెమెరాలును ఏర్పాటు చేసి.. వాటి ద్వారా వచ్చే ఫీడ్ ను ఈ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. వీటితోపాటు డ్రోన్ ద్వారా చిత్రీకరించే దృశ్యాలను కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా అత్యాధునిక టెక్నాలజీని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు.
రాజధాని నగరంలోని కీలక ప్రాంతాలు ,భవనాలకు సంబంధించిన మైక్రో లెవల్ డిజైన్ ఎక్స్పీరియన్స్ ను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు. అమరావతి బృహత్ ప్రణాళిక ను ఈ కేంద్రంలోని నమునాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సచివాలయం ,హైకోర్టు, అసెంబ్లీ, రాజభవన్, సీఎం నివాసం తో పాటు క్వాంటం వ్యాలీ ఉద్యానవనాలు, రహదారులు తదితర డిజైన్లను ఈ కార్యాలయం నుండి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా వీక్షించే వీలు ఉంటుంది.
ఈ భవనం మొదటి అంతస్తులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్యాంటీన్లు ,ఇతర ఎక్స్పీరియన్స్ సెంటర్లను నిర్మించారు. కాన్ఫరెన్స్ హాల్స్ కూడా మొదటి అంతస్తులోనే ఉన్నాయి. ఇక పోతే.. రెండు, మూడు, ఐదు అంతస్తులు సిఆర్డిఏ వర్క్ స్టేషన్లు, నాలుగో అంతస్తులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలకు కేటాయించారు. ఇక ఆరో అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం ,ఏడో అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి పేషీ , ప్రజా ఆరోగ్య శాఖ తదితర కార్యాలయాల కు కేటాయించారు ..మొత్తం 4.23 ఎకరాలలో నిర్మించిన ఈ భవనంలో, మొత్తం 2.42 లక్షల చదరపు అడుగులు బిల్ట్ ఏరియా ఉంది.... ప్రతి అంతస్తులో 33 వేల చదరపు అడుగులు అందుబాటులో ఉంటుంది.